దీర్ఘకవిత్వ దయాశోకం

ధర్మపాలకునికి ఘన నివాళి అంటూ డా|| డి.వి.సుబ్బారావు చక్కటి ముందు మాట రాశారు. క్రీ.పూ. 270 ప్రాంతంలో అశోకుని పాలన, యుద్ధాలు, అశోకునిపై కలిగిన బౌద్ధ ప్రభావం, బౌద్ధం ప్రచారంలోనే మానవీయ ధర్మం, ఆధ్యాత్మిక స్ఫూర్తి, బుద్ధుని ధర్మ చక్రమే అశోకుని ధర్మ చక్రమై సారనాథ్‌ స్థూపం నుంచి భారతదేశ రిపబ్లిక్‌ జాతీయ చిహ్నం చోటు చేసుకుంది.
మనోజ్ఞమైన కవితా అభివ్యక్తితో శ్రీనివాస్‌ ఈ దీర్ఘకవితను ప్రణాళికా బద్దంగా పాతిక అధ్యాయాలుగా (కవితలతో) ఆర్థ్రంగా అక్షరీకరించారు. నేటి లఘు కవితలు రాజ్యమేలుతున్న కాలంలో అశోకునిపై దీర్ఘ కవిత్వం రాయడం సాహసమే. కుర్రా జతేంద్రబాబు, జగద్ధాత్రి, స్థపతి, ఈమని శివనాగిరెడ్డి అభిప్రాయాలు విలువైనవే. జీవకారుణ్యను, దమ్మ పాలనను సార్వజనీన (సేవ) చేసిన నాడు, భారత దేశ విభిన్న చరిత్రకు నాందీ పలికిన అశోకుని ఆవాహన చేసుకుని కవిత్వంలో అవగాహన చేసిన కవి ప్రయత్నం అభినందనీయం.
”అమానవీయత ఆడుకున్న అకృత్యం/ రాజరిక ఆధిపత్య అనావశ్య పైత్యం ఏది? మరేది? ఇంకేది?” అంటారు దయాకోశకం కవితలో (పేజీ.19). ”చార్వాకుల ప్రశ్నల గుండెల్లోంచి సమాధానాలను/ నిలదీస్తున్న లోకాయత సంచలన పయనం, క్రాంతి అస్తవ్యస్త వ్వవస్థను ప్రశ్నిస్తూ అంతరాల దొంతరలను సరళిస్తున్న సంధికాలం” (పేజీ.140) కవితలో ఓ చోట బలమైన అభివ్యక్తి తో కవి ఇలా అంటారు. ”ధమ్మా చరిణే అంతిమ తెరువుగా అవసాన దీనావస్థలోనూ/ ఎప్పటికీ మగధ మౌర్య చక్రవర్తిని తానేనని కలవరిస్తూ, పలవరిస్తూ నిర్భంధ సుడిలో కవిత తిరుగుతూ దీనాలోచనల్లో తిరుగుడు పూవులా పరిక్రమిస్తూ నైరాశ్యంలో క్షుద్భాద అంతమై జీవితాశ హరించిపోగా దాన దాహం తీరని కోరికై ఇనుమడించింది” అంటారు కవి. చరిత్రను దీర్ఘ కవిత్వంలో చూపించారు.
– తంగిరాల చక్రవర్తి, 9393804472