– భారత్, పాకిస్థాన్ ఢీ నేడు
– ఆటకు రానున్న వరుణుడు
– మ.3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో…
ప్రపంచ క్రికెట్‌లోనే అతిపెద్ద సమరం.. భారత్, పాకిస్థాన్ పోరు. మరి, ఆసియా కప్‌లో అంతకుమించిన పోరాటం ఉంటుందా?!. 2019 వరల్డ్‌కప్ తర్వాత తొలిసారి వన్డేల్లో తలపడుతున్న దాయాదులు.. 2023 ప్రపంచకప్ ముంగిట బల పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఆధునిక క్రికెట్‌లో టీమ్ ఇండియా ఎదురులేని ఆధిపత్యం చూపిస్తుండగా.. రోహిత్‌సేన గుత్తాధిపత్యానికి సవాల్ విసిరేందుకు పాకిస్థాన్ రంగం సిద్ధం చేసింది. ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ ఆసియా కప్ పోరు నేడు.
నవతెలంగాణ-పల్లెకల్
ఆసియా కప్‌లో ఇటీవల సరికొత్త ప్రత్యర్థులు పుట్టుకొచ్చారు!. పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్.. శ్రీలంక, బంగ్లాదేశ్ ముఖాముఖి పోరు మైదానంలో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. కానీ ఆట స్థాయి, సమరంలో సత్తా పరంగా.. భారత్, పాకిస్థాన్ ముందు అవేవీ నిలువజాలవు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ భావోద్వేగంలో ప్రపంచ క్రికెట్ తడిసి పోయింది. ద్వైపాక్షిక క్రికెట్ లేకపోవటంతో.. ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లలో అరుదుగా వస్తున్న దాయాదుల పోరు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అటువంటి పోరే నేడు అభిమానుల ముందుకు వచ్చింది. ఆసియా కప్‌లో భాగంగా గ్రూప్-ఏ మ్యాచ్‌లో నేడు భారత్, పాకిస్థాన్ పోటీపడుతున్నాయి. తారాస్థాయి ఒత్తిడిని జయించి.. ప్రత్యర్థిని ఎవరు గెలుస్తారో చూడాలి.
అతడిపైనే ఫోకస్
2022 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులతో పాటు పండితులను పరవశింపచేసింది. గతంలోనూ పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఎన్నో నమోదు చేసినా.. ఆ ఇన్నింగ్స్ ప్రత్యేకత వేరు. దీంతో పాక్‌తో పోరు అనగానే అందరి చూపు విరాట్ కోహ్లిపైనే పడింది. బ్యాటింగ్ పరంగా గత వైభవం దిశగా అడుగులు వేస్తోన్న విరాట్ కోహ్లి పొరుగు దేశంపై విశ్వరూపం చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. విరాట్ కోహ్లికి కెప్టెన్ రోహిత్ శర్మ, యువ స్టార్ శుభ్‌మన్ గిల్ సైతం తోడైతే పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలే. మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్‌కు అవకాశం దక్కనుంది. అయితే శ్రేయస్ అయ్యర్‌ను ఆడిస్తారా? లేక తెలుగు తేజం తిలక్ వర్మకు నం.4 స్థానంలో అవకాశం కల్పిస్తారా అనేది తేలాల్సి ఉంది. బౌలింగ్ విభాగంలో కూర్పు సైతం ఆసక్తికరంగా మారింది. జడేజా, కుల్దీప్‌లు ఇద్దరు తుది జట్టులో నిలిస్తే.. ముగ్గురు పేసర్లకే చాన్స్ ఉంటుంది. పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దుల్ ఠాకూర్ నిలిస్తే.. జశ్‌ప్రీత్ బుమ్రాకు తోడుగా ఆడేందుకు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి మధ్య పోటీ ఉంటుంది.
కాస్త సరికొత్తగా..!
ఇటీవల కాలంలో పాకిస్థాన్ నుంచి భారత్‌కు గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. భారత్‌తో గత ఐదు వన్డేల్లో పాకిస్థాన్ ఒక్క మ్యాచ్‌లోనే నెగ్గింది. కానీ ఆ ఒక్క విజయంతోనే పాకిస్థాన్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. పాక్ శిబిరంలో ఇప్పుడు నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారు. బ్యాటింగ్ పరంగా పాకిస్థాన్ ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తుంది. బౌలింగ్ విభాగంలో ఆ జట్టు ఎప్పుడూ బలమైనదే. కెప్టెన్ బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్‌లకు ఇమామ్ ఉల్ హాక్, ఆఘా సల్మాన్‌లు జత కట్టారు. లెఫ్టార్మ్ సీమర్ షహీన్ షా అఫ్రిది భారత బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడూ అదే ప్రదర్శన పునరావృతం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. నషీం షా, హరీశ్ రవూఫ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్‌లు సైతం భారత బ్యాటర్లకు సవాల్ విసరగల సమర్థులు.
వర్షం ముప్పు
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నేడు కొత్త పిచ్‌పై జరుగనుంది. బంగ్లా, శ్రీలంక మ్యాచ్ తరహాలో ఈ పిచ్ ఎలాగైనా స్పందించవచ్చు. పిచ్ నుంచి సీమర్లు, స్పిన్నర్లకు అనుకూలత ఉంటుంది. అయితే, మ్యాచ్ ఆరంభానికి ముందు వర్షం ప్రమాదం పొంచి ఉంది. మ్యాచ్ సమయంలో వర్షం సూచనలు లేవు. కానీ మ్యాచ్‌కు ముందు 70 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ ఆరంభం కాస్త ఆలస్యం కానుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే వీలుంది!.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్/మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జశ్‌ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్: ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హాక్, బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఆఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షహీన్ షా అఫిద్రి, నసీం షా, హరీశ్ రవూఫ్.