– జమిలిపై పెరుగుతున్న ఆందోళన
– ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకం
– స్థానిక ప్రాధాన్యతలకు తగ్గనున్న ప్రాముఖ్యత
– ప్రభుత్వంలో లోపించనున్న జవాబుదారీతనం
– ప్రతిపక్షాలకు ఇబ్బందికరమే
జమిలి ఎన్నికలపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోడీ, బీజేపీ అనుసరించే వ్యూహంపై అందరి దృష్టీ నిలిచి ఉంది. అధికారం కేంద్రీకృతం కావాలన్నదే కమలదళం ఎత్తుగడ. ప్రతి ఓటు పైనా మోడీ సంతకం ఉందాలన్నదే దాని అజెండా. ఇప్పుడు ఎన్నికల డ్రామాకు తెర లేచింది. భారత ప్రజాస్వామ్య వేదిక తదుపరి చర్య కోసం ఎదురు చూస్తోంది. జమిలి ఎన్నికలపై బీజేపీ చేస్తున్న హడావిడి పరిపాలనను నూతన శిఖరాలకు చేరుస్తుందా లేక ప్రాంతీయ స్వతంత్రతపై కన్పిస్తున్న వెలుగును మసకబారుస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.
న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక అందజేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అందజేసిన ఈ నివేదిక ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ భావనకు మద్దతు తెలిపింది. జమిలి ఎన్నికల కారణంగా పరిపాలనా సంబంధమైన ప్రక్రియలను క్రమబద్ధీకరించవచ్చునని, ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చునని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు వైవిధ్యభరితమైన రాజకీయ యవనిక ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందన్న మాట నిజమే. ప్రస్తుతం దేశంలో ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఎన్నిక జరుగుతోంది. దీనివల్ల ప్రజాధనం పెద్ద ఎత్తున ఖర్చవుతోంది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న రాజకీయ పార్టీలకు ఈ పద్ధతి ప్రయోజనకరంగానే ఉంటుంది. అదే సమయంలో ఈ విధానం కొన్ని విషయాలలో ప్రమాదకరమైన సంకేతాలు అందిస్తోంది.
నిరంకుశత్వం ప్రబలుతుంది
పాలకుల్లో నిరంకుశ ధోరణులు ప్రబలంగా ఉన్నప్పుడు జమిలి ఎన్నికల నిర్వహణ అభిలషణీయం కాదు. దేశంలో ఐదు సంవత్సరాల పాటు ఎక్కడా ఎన్నికలే లేకుంటే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. పాలకులు పరిపాలనను గాలికి వదిలేసి నియంతలుగా మారతారు. ఐదు సంవత్సరాల వరకూ తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా వారిలో ఏర్పడుతుంది. అహంకారం పెరుగుతుంది. కేవలం ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయన్న కారణంతో రాజకీయ బహుళత్వం, ప్రజాస్వామిక పాలనపై ఈ విధానం చూపే దుష్ప్రభావాన్ని విస్మరించకూడదు. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటే ఆ మార్పుపై సమగ్ర చర్చలు, సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. కానీ ఆ ప్రక్రియ సరిగా జరగలేదనే చెప్పాలి. కొన్ని పార్టీలు, సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రభుత్వం ఖాతరు చేయలేదు.
స్థానిక సమస్యలు మరుగున పడతాయి
దేశంలో జరిగే వివిధ ఎన్నికల్లో సందర్భాన్ని బట్టి జాతీయ, ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణతో స్థానిక ప్రాధాన్యతలకు ప్రాముఖ్యత తగ్గిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటర్లు ఆయా పార్టీల ప్రాంతీయ పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. జాతీయ అంశాలకు వారు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. ఉదాహరణకు రాష్ట్ర ఎన్నికల్లో ఢిల్లీ నియోజకవర్గ ప్రజలు అమ్‌ఆద్మీ పార్టీని గెలిపించారు. అదే పార్లమెంటరీ ఎన్నికల్లో వేరే పార్టీలకు ఓటేశారు. లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు స్థానిక సమస్యలు, ఇతర అంశాలు మరుగున పడతాయి. బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా దేశాభివృద్ధిని ప్రస్తావిస్తూ ఉంటుంది. ప్రాంతీయ అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు. ఇది ఓ రకంగా అమెరికాలో అమలులో ఉన్న అధ్యక్ష తరహా ఎన్నికల ప్రక్రియకు దారితీస్తుంది. ఫలితంగా ఒకే పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యాన్ని చెలాయించే ప్రమాదం ఉంది. జాతీయ అజెండా మాటున స్థానిక అంశాలను విస్మరించడం ప్రజాస్వామ్య మూలాలకే విఘాతం కలిగిస్తుంది.
అధికార పార్టీలకే ప్రయోజనం
ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం జాతీయ లేదా ప్రాంతీయ ఆధిపత్యం చెలాయించే పార్టీలకు ఉపయోగకరంగా ఉంటుంది. జమిలి ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈ ధోరణి కన్పిస్తుంది. ఈ విధానం కింద కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ వంటి పార్టీలు ఓ వెలుగు వెలుగుతాయి. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో పూర్వవైభవం సాధించాలని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తరహా ఎన్నికలు ఇబ్బందికరమే. అదే విధంగా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీతో తలపడి గెలవడం కష్టమవుతుంది. జమిలి ఎన్నికలు ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీకే మేలు చేకూరుస్తాయన్నది సుస్పష్టం. 1967లో జరిగిన ఎన్నికల్లోనూ, 2014, 2019లో కొన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్‌సభకు ఒకేసారి జరిగిన ఎన్నికల్లోనూ జరిగింది అదే.
ఫెడరలిజంకు సవాలు
జమిలి ఎన్నికలు ఫెడరలిజంకు సవాలుగా పరిణమిస్తాయి. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని, ప్రజాస్వామ్య ప్రక్రియను అవి నీరుకారుస్తాయి. లోక్‌సభ అయినా లేదా ఏ రాష్ట్ర శాసనసభ అయినా పదవీకాలం ముగియక ముందే రద్దయితే అక్కడ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. రాష్ట్రపతి పాలన విధించే ప్రమాదమూ ఉంది. ఇది రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని హరిస్తుంది. ప్రజాస్వామ్య నిబంధనల్ని కాలరాస్తుంది. జమిలి ఎన్నికల విధానంలో తరచుగా ఎన్నికలు జరగవు కాబట్టి ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపిస్తుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో కూడా ఉదాశీనత చోటుచేసుకుంటుంది. వారు ఓటర్లను పట్టించుకోరు. తాము ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతుంటారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ఎన్నికల ప్రక్రియను కేంద్రీకృతం చేస్తుంది. ప్రాంతీయ గొంతుకలకు స్థానం లేకుండా పోతుంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా పరిపాలన జరగదు.