బోల్తా పడిన ధాన్యం బస్తాల లారీ.. 

నవతెలంగాణ – రాయికల్
రాయికల్ – మైతాపూర్ రోడ్ డ్యాం వంతెన వద్ద మంగళవారం రోడ్డు మళ్ళింపు దారి గుండా వెలుతున్న ధాన్యం బస్తాల లారీ అదుపుతప్పి బోల్తా పడింది.పట్టణంలోని శివాజీ నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి టి.ఎస్.యు.బి 1534 నెంబర్ గల లారి సుమారు 650 వరి ధాన్యం బస్తాలు లోడ్ చేసుకుని జోగిని పల్లి గ్రామంలోని ఎస్.ఆర్.ఆర్ రైస్ మిల్లు కు తరలించే క్రమంలో డైవర్షన్ రోడ్డుపై బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు.వంతెన నిర్మాణం పనులు నత్త నడకన కొనసాగుతున్నాయని, డైవర్షన్ రోడ్డు పూర్తిగా గుంతల మయమై ఉండడంతో పాటు సరియగు మట్టిని నింపకపోవడంతో లోడుతో ఉన్న లారి ఓవైపు మట్టిలో దిగబడి బోల్తా పడిందని, కనీసం హెచ్చరిక సైన్ బోర్డులు లేకపోవడం బాధాకరమని, వంతెన నిర్మాణం పనులు నడుస్తున్నప్పుడు వాహనాలు పోవడానికి సరైన మట్టి రోడ్డు నిర్మాణం చెయ్యలేదని,అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్షం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కౌన్సిలర్లు తురగ శ్రీధర్ రెడ్డి, వి.మహేష్ గౌడ్ ఆరోపించారు.
ఇప్పటికైనా అధికారులు,కాంట్రాక్టర్ గుంతలు లేని డైవర్షన్ మట్టి రోడ్డును సరిచేయించి, వంతెన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని వారు కోరారు. ఈ విషయంపై ఆర్ అండ్ బి ఏ.ఈ మధును వివరణ కోరగా ఓవర్ లోడ్, డ్రైవర్ తప్పిదం వల్లనే ప్రమాదం జరిగిందని, బస్సు రావడం వల్ల డ్రైవర్ లారీని పక్క నుండి తీసేందుకు ప్రయత్నించగా ప్రమాదం సంభవించిందని,తాత్కాలిక డైవర్షన్ రోడ్లకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకించిన నిధులు రావని త్వరలోనే వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయిస్తామన్నారు. సంవత్సర కాలంగా వంతెన నిర్మాణ పనులు పూర్తికాక పోవడంపై సంబంధిత కాంట్రాక్టర్ వెంకట రమణరావును వివరణ కోరగా ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి బిల్లులు రాకపోయినా పనులు చేపిస్తున్నామని, గతంలో వర్షాలు,నీటి ప్రవాహం వల్ల పనులు ముందుకు సాగలేదని, ప్రస్తుతం వంతెన పై అడ్డంగా ఉన్న ఎలక్ట్రికల్ వైర్లను తొలగించేందుకు సంబంధిత అధికారులకు నిబంధనల ప్రకారం రుసుము కూడా చెల్లించామని,ఎలక్ట్రికల్ వైర్లను తొలగించిన వెంటనే వంతెన పై నుండి వాహనాలు వెళ్లే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.కాగా ఈ ప్రమాదంలో   డ్రైవర్ కు ఏలాంటి గాయాలు కాలేదు.