ఎన్నో నాడులు అవలీలగా
ఆడుతుంటేనే నేనింతసేపు
నడవగలుగుతున్నాను..
ఎన్నో బతుకు చిత్రాలు
మెదల్లో కదిలితేనే నేనింత భారం
మోయగలుగుతున్నాను..
ఇంకెన్నో జీవన దారుల ఒంపుల్ని
ఎన్ని మెలికలు తిరిగితేనో
సత్తువలేని పాదాల్ని కదపగలుగుతున్నాను..
ఎన్ని పేగులు మెలికలు పడితేనో
ఆకలి తీరే గమ్యం వైపు
ఆత్రుతగా పయనం సాగిస్తున్నాను..
ఎన్నో రాళ్లు పాదాలకు గుచ్చుకుంటేనే
నాలుగు రాళ్లను వెనకేయగలుగుతున్నాను..
ఎన్ని లక్షల అడుగుల్ని ఈ నేలపై పరిస్తేనే
అనుకున్న గమ్యాన్ని చేరుకోగలిగాను..
ఎన్ని జెండాలను మోయగలిగితేనో
ముద్దరేసిన వేలును శుభ్రం చేసుకోగలిగాను..
ఎన్ని బతుకు చిత్రాల్ని గీయగలిగితేనో
సగటు జీవనాన్ని ఈదగలుగుతున్నాను…
– నరెద్దుల రాజారెడ్డి
9666016636