ఎన్నో చెప్పాలి తల్లీ..

I have to say a lot, mother..అమ్మ లేఖ
ప్రతి కుటుంబంలో పిల్లలు ఉంటారు. పిల్లలు బాగుండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, సంఘంలో గౌరవంగా బతకాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటారు. అయితే నేటి ఆధునిక జీవితంలో పిల్లలతో గడపటానికి తల్లిదండ్రుల దగ్గర సమయం లేదు. దానితో పిల్లలకు చాలా విషయాల పట్ల అవగాహన ఉండటం లేదు. పిల్లలకు మొదటి గురువు తల్లే కనుక, తల్లి తన బిడ్డలకు ఎటువంటి విషయాలు చెప్తుంది అనే దానిపై ఓ తల్లిగా తపన పడుతూ నా బిడ్డకు ఉత్తరాలు రాస్తూ అవగాహన కల్పించాలని భావించాను. ప్రతి అమ్మాయికీ ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ‘అమ్మ లేఖ’కు మానవి పేజీ ద్వారా శ్రీకారం చుట్టారు.
పియ్రమైన వేణు గీతికకు
అమ్మ రాయునది:
ఎలా ఉన్నావ్‌? ఉద్యోగం ఎలా ఉంది? చూస్తూ ఉండగానే ఎంత పెద్ద దానివి అయిపోయావు. ‘అప్పుడే ఉద్యోగం చేస్తోందా? నిన్న, మొన్నటి వరకు నా చేతుల్లో పెరిగిన చిట్టితల్లి’ అనిపిస్తుంది. నా బంగారు తల్లీ… ఇప్పుడు ఒంటరిగా లోకంలో బతకడానికి ముందడుగు వేశావు. నీకు తెలియని రాష్ట్రంలో, ఎవరూ తెలియని చోటికి ఉద్యోగం కోసం నాకు ధైర్యం చెప్పి మరీ ముందుకు వెళ్లావు. అందుకు నిన్ను అభినందిస్తున్నాను. ఇది ఎంతో సాహసం, మానసిక స్థైర్యం ఉన్నవారికి మాత్రమే సాధ్యం. నీలో అది నిండుగా ఉన్నందుకు ఓ తల్లిగా గర్వపడుతున్నాను.
నువ్వు మొన్నటి వరకు మా దగ్గర పెరిగిన దానివి. అంటే తల్లిదండ్రుల చాటు బిడ్డవి. ఒక్కసారిగా మమ్మల్ని వదిలి చదువు కోసం, ప్రాజెక్టుల కోసం ఇతర రాష్ట్రాలలో ఉంటూ భాషరాని చోట నిన్ను నువ్వు తీర్చిదిద్దుకుంటున్నావు. అమ్మ నాన్నల కష్టాన్ని అర్ధం చేసుకుని చదువు పైనే దృష్టి పెట్టి ఒక మంచి విద్యార్థినివిగా పేరుతెచ్చుకున్నావు. మాకు చాలా సంతోషాన్ని అందించావు. ఇప్పుడు నువ్వు ఉద్యోగస్తు రాలివి అయ్యావు. కనుక లోకం పోకడ కూడా తెలుసుకోవాలి కాబట్టి నీకు ఎన్నో విషయాలు చెప్పాలి. నీవల్ల సమాజానికి కూడా ఎంతో కొంత మేలు జరగాలని నా ఆకాంక్ష. నీతో పంచుకోవ డానికి అనేక విశేషాలు ఉన్నాయి ఒక్కొక్కటి చెప్తాను. నేను నీకోసం రాసే ప్రతి విషయం నీ ఎదుగుదలకి పునాది కావాలని కోరుకుంటూ…
మీ అమ్మ
– పాలపర్తి సంధ్యారాణి