– కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పదిలం
– బీజేపీకి రెంటింపు స్థాయిలో ఓటింగ్
– గులాబీ ఓట్లు భారీగా కమలానికి బదీలి
– చేవెళ్లలో అస్తిత్వం కోల్పోయిన గులాబీ
– లోకల్ నాన్ లోకల్ ఈక్వేషన్ సక్సెస్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించని పరిస్థితిలో.. చేవెళ్ల పార్లమెంట్‌లో పాగా వేయడం రాజకీయ వర్గాల ఊహకు చిక్కని అంశంగా మారింది. బూత్ స్థాయిలో కమిటీలు లేని కమలం అత్యధిక మెజార్టీతో లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి మిరాకిల్ సృష్టించింది. కమలం అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ ఒకటైతే.. లోకల్ నాన్ లోకల్ ఈక్వేషన్ మరో అంశంగా ముందుకు వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి నాన్ లోకల్ కావడం.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లడం జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా తమ ఉనికిని కోల్పోయిన పర్వలేదు.. బీజేపీని గెలిపించి.. కాంగ్రెస్‌ను ఓడించాలన్న లక్ష్యంగా బీఆర్‌ఎస్ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికల్లో పని చేసినట్టు ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్ క్యాడర్ అంతర్మధనంలో పడింది. పార్లమెంట్ పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉండి కూడ కనీసం చెప్పుకోదగ్గ ఓటింగ్ శాతాన్ని తెచ్చుకోకపోవడం.. భవిష్యత్‌లో పార్టీ పరిస్థితి ఎంటీ అనే ఆలోచనలో పడ్డారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 2,01,960 ఓట్లు వసే.. ప్రస్తుతం 8,09,882 ఓట్లు వచ్చాయి. 6 లక్ష 8 వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. బీజేపీకి ఇన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేదానికి బీఆర్‌ఎస్ ఓటు బ్యాంక్‌ను పరిశీలిస్తే అర్థం అవుతుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 5,28,148 ఓట్లు బీఆర్‌ఎస్‌కు వచ్చాయి. ప్రస్తుతం 1,78,968 ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే సుమారు 3,49,180 ఓట్లు గత పార్లమెంటు ఓటింగ్ కంటే తక్కువగా వచ్చాయి. దీనిని బట్టి చూస్తే పెద్ద మొత్తంలో బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీ బదీలి అయ్యాయి అనేది స్పష్టమవుతుంది.
అయితే మహేశ్వరం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 1,25,578 ఓట్లు వచ్చాయి. కానీ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 37,215 ఓట్లు వచ్చాయి. బీజేపీకి అసెంబ్లీలో 99,391 రాగా పార్లమెంట్‌లో 1,49,527ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో 70657 రాగా.. పార్లమెంట్‌లో 99,175 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ తన ఓటింగ్ శాతం పెంచుకుంది. ఇక్కడ బీఆర్‌ఎస్ 60 శాతం ఓటింగ్ బీజేపీకి క్రాస్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు 12,1734 ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 28,529 ఓట్లతో సరిపెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ ఓట్లు కూడ సాధించ లేకపోయింది. ఇక్కడ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 89,638 ఓట్లు రాగా ప్రస్తుతం 1,57701 ఓట్లు వచ్చాయి. ఇక్కడ రెట్టింపు స్థాయిలో బీజేపీ ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది.
కాంగ్రెస్ అసెంబ్లీలో 82057 ఓట్లు రాగా ప్రస్తుతం 1,38,495 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ సైతం ఇక్కడ రెట్టింపు స్థాయిలో ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది.
శేరిలింగపల్లిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 1,57,332 ఓట్లు రాగా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో 42,687 ఓట్లు మాత్రమే కనీసం అసెంబ్లీలో వచ్చిన మెజార్టీ ఓట్లు కూడ రాబట్టుకోలేక పోయింది. ఇక్కడ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 80,148 ఓట్లు రాగా ప్రస్తుతం 1,78,249 ఓట్లు తెచ్చుకుంది. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో 1,10, 780 ఓట్లు రాగా, పార్లమెంట్‌లో 1,04,472 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ సుమారు 6 వేల ఓట్లు వరకు తగ్గాయి. చేవెళ్లలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 76,218 ఓట్లు రాగా.. ప్రస్తుతం 21,410 ఓట్లు వచ్చాయి. దీనిని బట్టి చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ అభ్యర్థికి కోసం పనిచేయలేదు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ అసెంబ్లీలో 37,886 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 93,778 ఓట్లు రెంటింపు ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో 75,950 ఓట్లు వచ్చాయి. పార్లమెంటులో 71,678 ఓట్లు వచ్చాయి తమ ఓటు బ్యాంక్‌ను పదిలో చేసుకుంది.
పరిగిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి చెందింది. అసెంబ్లీలో 74523 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 23142 వచ్చాయి. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో 98536 ఓట్లు వచ్చాయి. పార్లమెంట్‌లో 71816 ఇక్కడ సుమారు 28 వేల ఓట్లు కాంగ్రెస్‌కు తగ్గాయి. బీజేపీ అసెంబ్లీలో 16653 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 74024 ఓట్లు సాధించింది. ఇక్కడ బీజేపీ అత్యధిక ఓట్లు సాధించింది.
తాండూరులో బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో 78,079 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 10,598 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి ఇక్కడ అభ్యర్థి కూడ లేని పరిస్థితి.. పార్లమెంటులో మాత్రం 77,654 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 84,662 ఓట్లు సాధించిన కాంగ్రెస్ ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో 69,864 ఓట్లు మాత్రమే వచ్చాయి. సుమారు 15 వేల ఓట్లు తగ్గాయి.
వికారాబాద్‌లో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 86885 ఓట్లు రాగా.. పార్లమెంట్ ఎన్నికల్లో 75,361 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో 73,992 ఓట్లు రాగా పార్లమెంట్‌లో 13,959 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అసెంబ్లీలో 7132 ఓట్లు సాధించగా ప్రస్తుతం 67,584 ఓట్లు వచ్చాయి. వికారాబాద్‌లో కాంగ్రెస్‌కు లీడ్ ఇవ్వడం జరిగింది.
పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే బీఆర్‌ఎస్ తమ అభ్యర్థిని గాలికి వదిలి.. బీజేపీని భూజాన ఎత్తుకున్నట్టు తెలుస్తోంది. కనీసం తమ క్యాడర్ ఓట్లు కూడ తమ అభ్యర్థితికి వేయించుకోలేని స్థితికి బీఆర్‌ఎస్ దిగజారింది. కాంగ్రెస్ సైతం పరిగి, తాండూరులో తమ ఓటు బ్యాంక్ పదిలం చేసుకోవడంలో ఆదమరచినట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఓట్లతో పోలిస్తే కొంత ఓటింగ్ శాతం తగ్గింది. ఎదీఎమైనప్పటికీ కమలం గెలుపు వెనుక.. బీఆర్‌ఎస్ శ్రమ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.