– సిలిండర్ పేలి ఇంట్లో వస్తువులన్నీ దగ్ధం
– ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
నవతెలంగాణ-నర్సాపూర్
ఒకే గ్రామం.. ఒకే కులానికి చెందిన యువతీయువకులు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుని కొద్దిరోజుల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా, వీరి పెండ్లి ఇష్టం లేని యువతి కుటుంబసభ్యులు, బంధువులు కోపోద్రిక్తులై యువకుని ఇంటికి నిప్పు పెట్టగా, ఇల్లు పూర్తిగా దగ్ధమైన సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన సోమగారి ప్రశాంత్, పిట్ల జ్యోతి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెండ్లి విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో కలిసి ప్రశాంత్ ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో డీజిల్ పోసి నిప్పు పెట్టారు. దాంతో ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోవడంతో పాటు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు తూప్రాన్ సీఐ కృష్ణ, ఎస్ఐ రవికాంతరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువకుని తల్లి సోమగారి నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.