జకర్తా : ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతంలో మంగళవారం 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర మలుకు ప్రావిన్స్‌లోని హల్మహెరా ద్వీపంలో సుమారు 35 కిలోమీటర్లు లోతున భూకంప కేంద్రం ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకూ వార్తలు రాలేదు. అదే విధంగా సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఉన్న కారణంగా ఇండోనేషియాలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 2021 జనవరిలో వచ్చిన భూకంపం కారణంగా 100 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 2018లో సంభవించిన భూకంపం కారణంగా 2,200 మందికి పైగా మరణించారు. ఇక, 2004లో 9.1 తీవ్రత వచ్చిన భూకంపం, సునామీ కారణంగా సుమారు 1,70,000 మంది మరణించారు.