ఇవ్వాళ్ల అరుదైన అనేక పుస్తకాలకు కేరాఫ్ అడ్రస్ అనగానే గుర్తొచ్చే పేర్లలో బంగారు రామాచారి మొదటగా యాదికొస్తారు. పుస్తకాల పుట్టుపూర్వోత్తరాలు మొదలు ప్రస్తుత గ్రంథాలయం చిరునామాలు ఆయనకు కరతలామలకం. అటుతరువాత ఎన్నెన్నో ఓల్డ్‌గోల్డ్‌లకు చిరునామాగానే కాక, వాటిని రేపటి తరానికి, అనేకమంది చదువరులకు అదిస్తున్న పుస్తకాల మనిషి అనీల్ బత్తుల. తెలుగునాట పుస్తక ప్రియులకు, ఫేస్‌బుక్ మొదలుకుని ఇతర మాధ్యమాల ద్వారా అనిల్ పరిచయం. తానున్న చోటుని పుస్తకాల ప్రపంచంగా మార్చే మంత్ర దండం అనిల్ దగ్గరుంది.
బత్తుల అనిల్ వృత్తి, ప్రవృత్తి రచయిత. అంతేకాక ఈయన కవి, రచయిత, ప్రచురణకర్త, అనువాదకుడు, వివిధ పుస్తకాలకు సంపాదకుడుగా అందరికీ పరిచయం. వీటన్నింటికి మించి అరుదైన పుస్తకాల సేకర్త కూడా. గతంలో కొంత కాలం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసినప్పటికీ పుస్తకాల లోకంలో మమేకమై బుక్‌వేర్ ప్రొఫెషనల్‌గా మారిపోయాడు. జూన్ 26, 1982న నిజామాబాద్ పట్టణంలో పుట్టాడు. అమ్మా నాన్నలు శ్రీమతి బత్తుల మహాలక్ష్మమ్మ – శ్రీ బత్తుల పెద్ద పోలిరెడ్డి.
అనిల్ కున్న పుస్తకాల ప్రేమ మేం మా బాల్యంలో చదువుకున్న సోవియట్ బాల సాహిత్యాన్ని డిజిటలైజ్ చేసి రేపటి తరానికి వారసత్వ సంపదగా అదించేలా చేసింది. మరోవైపు రాదుగా, ప్రగతి ప్రచురణాలయం మొదలు సోవియట్ నుండి వెలువడిన అనువాద తెలుగు సాహిత్యాన్ని సేకరించి, పునర్ముద్రణకోసం అందిస్తున్నాడు.
అనిల్ బత్తుల కవిగా తెచ్చిన స్వీయ కవితా సంపుటి ‘మధుశాల’. సంపాదకుడుగా అనిల్ తెచ్చిన పుస్తకాలు ఇటు వాసి లోనే కాక అమ్మకాల రాశిలోనూ ఉత్తమంగా నిలవడం విశేషం. ‘దేశదేశాల కవిత్వం’, ‘ఇష్ట కవిత్వం’, ‘రంగు రంగుల కవిత్వం’ సంకలనాలు అనిల్‌కు గుర్తింపు నివ్వడమేకాక పాఠకుల ఆదరణను పొందాయి. సోవియట్ బాల సాహిత్య సేకర్తగానే కాక బాల సాహిత్య అనువాదకుడు, సృజనకారుడుగా ఈయన పరిచితుడు. బాల సాహిత్యంలో ‘రష్యన్ జానపద కథలు’, ‘అపూర్వ రష్యన్ జానపద కథలు’, ‘కష్టాంక’, ‘బుజ్జి కోడిపెట్ట’, ‘అమ్మ చెప్పిన కథలు’, ‘బాపు బొమ్మల పంచతంత్రం’తో పాటు మరికొన్ని రష్యన్ బాలల కథల పుస్తకాలు వెలుగులోకి రావడానికి ముందునిలిచాడు. ప్రపంచ దేశాల్లో బాలల కేంద్రంగా వచ్చిన సినిమాలపై తెచ్చిన పుస్తకం ‘పిల్లల సినిమా కథలు’. ప్రపంచ భాషల్లోని ఉత్తమ బాలల చిత్రాల్ని పరిచయం చేయాలనే ఆలోచనతో తానీ పుస్తకం రాశానంటారు రచయిత. ఇందులో ఇరవై అయిదు సినిమాలను పరిచయం చేశాడు. పిల్లల గురించి ఆలోచించి, వాళ్ళకోసం వచ్చిన సినిమాలను తెలుగు పెద్దల కోసం, పిల్లల కోసం తేవడం అభినందనీయం. ఇందులో ‘రెడ్ బెలూన్’, ‘చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్’, ‘దకార్ట్’, ‘ద మిర్రర్’, ‘రన్నర్’ లాంటి దృశ్యకావాలున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సినిమాల గురించి అతని ఆలోచనలను ఇందులో చదవాలి కూడా! బాలలకోసం తెచ్చిన మరో మంచి వయ్యి బాపు బొమ్మల పంచతంత్ర కథల పుస్తకం. ఈ పుస్తకం గురించి, బొమ్మల గురించి చెప్పేందుకు ఇక్కడి నిడివి సరిపోదేమో! అనీల్ అందించిన మరో మంచి కానుక రష్యన్ జానపద కథలు. ఇది ఇరవై కథల పుస్తకం. పుస్తకం విషయంలో, ముద్రణ విషయంలో ఔచిత్యం తెలిసిన రచయిత అనిల్. ఈ పుస్తకంలో ఫాంటు సైజు మొదలుకుని బొమ్మల వరకు అన్ని పెద్ద పెద్దగా ఉండడం బాగుంది. అయితే ఇది కేవలం పిల్లలే కాదు, పిల్లల తల్లిదండ్రులు కూడా చదవదగ్గ పుస్తకం. పెద్దలు చదివి పిల్లలకు చెప్పగలిగే మంచి కథలున్న పుస్తకం.
ఇందులోని ‘బుజ్జి పిచుక’ పిచ్చుకలకు మనుషులతోవున్న అవినాభావ సంభందం పెద్దది. ఈ కథలో పిచ్చుక సందేహాల పుట్ట. అది తన తొందరపాటు వల్ల పిల్లికి ఆహారంగా మారబోయి, తప్పించుకుంటుంది. ‘మేలు మరవని పిచుక’ కథలో పిచ్చుకలు కాకులతో యుద్దంచేసి అవి దొంగలించిన గాజుపూలగుత్తిని సిండ్రెల్లా పాత్రలో నటిస్తున్న మాషా వాళ్ళ అమ్మకు అందిస్తాయి. ఇలా ఈ కథల్లోని పిచ్చుకలు ప్రజల మనసుల్లో స్థానాన్ని పొందుతాయి. మరో మంచికథ ‘వెండి గిట్ట’ లోని వెండిగిట్ట వున్న మేక, పిల్లల్ని ఊహా లోకంలోకి తీసుకెళ్లి ఆనందడోలికల్లో వూపుతుంది. వెండిగిట్ట మేక కోసం పాప అన్వేషణ… ఆ మేక తన గిట్టతో ఇంటి చుట్టుపక్కల, ఇంటిమీద, రంగురంగుల వజ్రాలను రాల్చటం.. ఆ వజ్రాలను రాల్చటంలో పిల్లి సాయం, బోలెడన్ని వజ్రాలు ఎరుకున్న పాప, పాప తాత…. ఈ కథలోని వెండిగిట్ట మేక బొమ్మను చూస్తూ పిల్లలు అక్కడే కాసేపు ఆగిపోతారు. అనిల్ ఈ కథల్ని అనువాద కథలు అంటాడు కానీ ఇవి అచ్చంగా తెలుగు కథలే అనిపిస్తాయి. పిల్లల కోసం రచన, సేకరణ, అనువాదం, మంచి పుస్తకాలను అందివ్వడం చేస్తున్న అనిల్ బత్తుల నికార్సుగా పుస్తకాల మనిషి… అరుదైన పుస్తకాలకు అచ్చమైన చిరునామా!
– డా|| పత్తిపాక మోహన్
9966229548