మాంసం విషయంలో గొడవ.. వ్యక్తి హత్య

నవతెలంగాణ-ఓయూ
మాంసం విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని స్నేహితుడు కత్తితో పొడిచిన ఘటన సికింద్రాబాద్‌ తుకారంగేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ గోల్‌బారు బస్తీకి చెందిన కుంభలి అజరు(30), చారి స్నేహితులు. అజరు రోజువారి కూలి పనులు చేసుకుని జీవన సాగించే వ్యక్తి. సోమవారం అజరు, చారి పండుగ సందర్భంగా మటన్‌, మందు తెచ్చుకుని పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యలో మటన్‌ తినే విషయంలో వివాదం తలెత్తింది. ఇద్దరూ మద్యం మత్తులో ఉండగా ఆగ్రహంతో అజరుపై చారి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అజరు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తుకార గేట్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.