– బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలి
– ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్
నవతెలంగాణ-హిమాయత్ నగర్
ఆరేండ్ల చిన్నారిపై ఓ కామాంధుడు పాశవికంగా లైంగికదాడి జరిపి, హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలం, కాట్నపల్లిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుందని, చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని, సహస్ర కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్రలు డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శనివారం హిమాయత్ నగర్‌లో ”జస్టిస్ ఫర్ సహస్ర” పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభం శుభం తెలియని చిన్నారిపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కఠిన చట్టాలు ఉన్నా ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గు చేటన్నారు. చట్టాలను మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత చిన్నారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.సత్య ప్రసాద్, శ్రీమాన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్.బాలకృష్ణ, నేతలు మాజీద్ అలీ ఖాన్, కళ్యాణ్, అనీల్ కుమార్, వంశీ, బాలు, నాగరాజు, జనసేవా దళ్ సీనియర్ బోదకులు మురళీ, సౌమ్య, కీర్తి, మృణాళిని, దీప్తి, సంధ్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.