వింత కోరికల మనిషి పాట

A man's song of strange desiresకోరికలు లేని మనిషి ఉండడు. మనిషి జీవితమే కోరికల సమాహారం. దేవుడు ప్రత్యక్షమైతే ఏ కోరిక కోరుకోవాలో తెలియక మనిషి సతమతమవుతాడు. అలాంటి వింత వింత కోరికలు కలిగిన భక్తునికి సంబంధించిన పాట ఇది. దేవుడు ప్రత్యక్షమయ్యాక తన కోరికలతో దేవుడిని ఆశ్చర్యపరిచే, విసిగించే మనిషి పాట ఇది. ఇది హాస్యాన్ని కలిగించే పాట. 2002 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ సినిమాలో చిర్రావూరి విజరు కుమార్‌ రాసిన పాట. ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.

చిర్రావూరి విజయ్‌ కుమార్‌ సరికొత్త పదాలతో, కొంటె భావాలతో ఆకట్టుకునే సినీకవి. ఖడ్గం, శివరామరాజు సినిమాల్లోని పాటలతో ఒక ఊపు ఊపేసిన కవి. ఖడ్గం సినిమాలో ఒక భక్తుని వింత వింత కోరికలను భగవంతునికి వినిపించే తీరును ఎంతో హాయిగా, సరదాగా చెప్పాడు. ఇందులో భక్తుడు గోవిందా.. గోవిందా అంటూ తన కోరికల చిట్టాను విప్పి దేవుని ముందు పెడతాడు. ఆ కోరికలన్నింటిని నెరవేర్చమని వేడుకుంటాడు. అవన్నీ కూడా కనీవినీ ఎరుగని కోరికలు. వింతైన, విచిత్రమైన కోరికలు. అయితే ఆ కోరికలు ఎలాంటివో, అతడెలా కోరుకుంటున్నాడో ఈ పాటలో పూసగుచ్చినట్టుగా ఒక్కొక్కటి చెప్పడమే ఇక్కడ ప్రత్యేకత.
గోవిందా.. గోవిందా.. మా అందరి నుదుటి రాతలు మార్చేవాడివి..అందరికీ ఉచిత సేవలు చేసేవాడివి.. కోరికలు తీర్చి లంచమడగని మంచివాడివి. లోకాన్ని ఏలుకునేవాడివి.. స్వార్థమన్నది అసలే లేనివాడివి.. ఎలాంటి బాధలనైనా ఇట్టే తీర్చేవాడివి.. మేము కోరిన కోరికలను ఆలస్యం చేయకుండా వెంటనే తీర్చేవాడివి.. కాబట్టి నిన్నే తోడుగా, నీడగా నమ్ముకున్నాను. నన్ను కరుణించు.. నన్ను బాగు చేయు. నన్ను అభివృద్ధిలోకి తీసుకురా.. అంటూ తన కోరికలను ఒక్కొక్కటి చెప్పడం మొదలుపెడతాడు.
జూబ్లీహిల్స్‌లో బంగ్లా ఇవ్వు.. అంటూ విలాసవంతమైన కోరికల్ని కోరుతుంటాడు. ఒకవేళ అది వీలు కాకపోతే హైటెక్‌ సిటీ ఇవ్వు. హైజాకవ్వని విమానాన్ని, ఎప్పుడూ వెంట తిరిగే ఉపగ్రహాన్ని ఇవ్వు స్వామి అంటూ వేడుకుంటాడు. పనికిరాని మూర్ఖులకు, చవటలకు, పరమ బేవార్స్‌ గాళ్ళకు ఎందరికో ఇస్తావు. మరి నాకెందుకు ఇవ్వవు? అని ప్రశ్నిస్తున్నాడు. అందరికి ఇచ్చినట్టుగానే నన్ను పిలిచి నాకు ఇవ్వవెందుకు? నన్ను మెచ్చి కోట్లకు అధిపతిని చేయు అంటున్నాడు.
పెట్రోలుతో పనిలేని కారునివ్వమని, ఎంత తాగినా బిల్లు అడగని బారునివ్వమని, ఎంత అడిగితే అంత ఫుడ్డు పెట్టి డబ్బులడగని హోటల్‌ నివ్వమని, అసెంబ్లీలో బ్రోకర్‌ పోస్టు లేదా రాజ్యసభలో ఎం.పి సీటు, పట్టుపడని మ్యాచ్‌ ఫిక్సింగ్‌ స్కాముల సంపాదనివ్వమని కోరుకుంటున్నాడు. ఎంత లెక్కపెడదామన్న వీలులేనంత డబ్బు కావాలని కోరుకుంటున్నాడు. అతని కోరికలు ఒక్కొక్కటి ఎంత ఎత్తుకు వెళుతున్నాయో ఇక్కడ అర్థమవుతుంది. అన్నీ కూడా తనకే కావాలన్న అత్యాశ కూడా అతనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఓటమంటే ఏమిటో తెలియని రేసుగుర్రాలనివ్వమని, నష్టమసలే రాని షేరులివ్వమని, సింగిల్‌ నెంబర్‌ లాట్రీలివ్వమని, పన్నులు అడగని ఆస్తులనివ్వమని అడుగుతున్నాడు.. అంతేకాదు- వందనోట్ల తోటలు, బంగారు నిధుల కోటలు, లేకపోతే వేయిటన్నుల కోహినూర్‌ వజ్రాలు కావాలంటున్నాడు. మాస్‌ హీరోగా అవకాశాలు, హిట్టు సినిమా స్టోరీలు, అందంగా, నాజూకూగా, బాగా ఆస్తులున్న హీరోయిన్‌ని భార్యగా ఇవ్వమంటున్నాడు.
అంతటితో ఆగకుండా అతని కోరికలు మరీ రెట్టింపు అవుతుంటాయి. హాలీవుడ్‌లో స్టూడియో ఇవ్వమని, స్విస్‌ బ్యాంక్‌లో బిలియన్లు ఇవ్వమని, కోట్లు సంపాదించి పెట్టే కొడుకుల్ని, హీరోలుగా తన వంశాన్ని నిలబెట్టే మనవళ్ళని ఇవ్వమని గోవిందుడిని అడుగుతాడు. నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయు లేదా దేశ ప్రధానమంత్రిని చేయు. తెలుగు వెండితెరపై తిరుగులేని, తరిగిపోని జీవితాన్ని ప్రసాదించు అంటాడు.
సినిమాకథ పరంగా గమనించినట్లయితే ఈ పాటలో కోరికలు కోరే భక్తుడు సినిమా హీరో కావాలన్న లక్ష్యంతో ఉంటాడు. ఆ విషయాన్ని ఈ పాటలో చివరలో చెబుతాడు. వెండితెరపై చెరిగిపోని ముద్ర వేసిన ఎన్‌.టి.ఆర్‌ లాంటి మహానుభావుని ఆదర్శంగా తీసుకుని హీరోగా ఎదగాలన్న ఆశయంతో సిటీకి వస్తాడు. ఈ పాట చివరి పంక్తిలో నటుడు కావాలన్న అతని సంకల్పం స్పష్టంగా కనిపిస్తుంటుంది. నా తలరాత మార్చి, ఇప్పటిదాకా నేను అడిగిన వరాలన్ని ఇస్తే తిరుపతికి వస్తాను. నీ ఏడుకొండల్ని ఏ.సి చేస్తాను. ఎనిమిదవ వింతగా నీ గుడిని తీర్చిదిద్దుతాను అని వేంకటేశ్వరస్వామికి విన్నవించుకుంటాడు. తర్వాత దేవుని విగ్రహం అదశ్యమవుతుంది. దేవుడు మాయమైపోయాడేంటని ఆశ్చర్యాన్ని తెలియజేస్తాడు భక్తుడు. అంటే.. అతని వింత కోరికలకు ఆశ్చర్యపోయి దేవుడు మాయమయ్యాడన్న విషయాన్ని సరదాగా అర్థం చేసుకోవచ్చు.
ఇందులో అంత పెద్ద సాహిత్యమేమీ లేదు. అయినా ఇది సరదాపాటగా ఎంతో ప్రసిద్ధికెక్కింది. అందరి మన్ననలందుకుంది.

పాట:
గోవిందా గోవిందా/ గోవిందా గోవిందా/
నుదుటిరాతను మార్చేవాడా/ ఉచితసేవలు చేసేవాడా/
లంచమడగని ఓ మంచివాడా/ లోకమంతా ఏలేవాడా/
స్వార్ధమంటూ లేనివాడా/ బాధలన్నీ తీర్చేవాడా/
కోర్కెలే నెరవేర్చేవాడా/ నాకునువ్వే తోడునీడా/
గోవిందా గోవిందా/ అరె బాగుచెరు నను గోవిందా/
పైకితే నను గోవిందా/
జూబ్లీహిల్స్‌లో బంగ్లా ఇవ్వు లేనిచో హైటెక్సిటి ఇవ్వు/
హైజాకవ్వని ఫ్లైటొకటివ్వు వెంటతిరిగే శాటిలైటివ్వు/
పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్‌ గాళ్లకిచ్చి/
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి/ కోట్లకధిపతి చెరు రా మెచ్చి/
పెట్రోలడగని కారు ఇవ్వు/ బిల్లు ఇవ్వని బారు ఇవ్వు/
కోరినంత ఫుడ్డు పెట్టి డబ్బులడగని హోటలు ఇవ్వు/
అసెంబ్లీలో బ్రోకర్‌ పోస్టు రాజ్యసభలో ఎం.పీ.సీటు/
పట్టుపడని మ్యాచ్‌ ఫిక్సింగ్‌ స్కాముల సంపదనివ్వు/
ఓటమెరుగని రేసులివ్వు లాసురాని షేరులివ్వు/
సింగిల్‌ నెంబర్‌ లాట్రీలివ్వు/ టాక్స్‌ అడగని ఆస్తులివ్వు/
వందనోట్ల తోటలివ్వు గోల్డ్‌ నిధుల కోటలివ్వు/
లేకపోతే వెయ్యి టన్నుల కోహినూర్‌ డైమండ్స్‌ ఇవ్వు/
మాస్‌ హీరో ఛాన్సులివ్వు/ హిట్టు సినిమా స్టోరీలివ్వు/
స్లిమ్ముగున్న సొమ్ములున్న హీరోయిన్నే వైఫుగ ఇవ్వు/
హాలీవుడ్‌లో స్టూడియోనివ్వు/ స్విస్సుబ్యాంకులో బిలియన్లివ్వు/
కోట్లుతెచ్చే కొడుకులనివ్వు/ హీరోలయ్యే మనవలనివ్వు/
నన్నుకూడా సి.ఎం.చెయ్యి లేకపోతే పి.ఎం చెయ్యి/
తెలుగు తెరపై తిరుగులేని తరిగిపోని లైఫునివ్వు/
లక్కుమార్చి నను కరుణిస్తే/ తిరుపతొస్తా త్వరగా చూస్తే/
ఏడుకొండలు ఏసి చేస్తా/ ఎయిత్‌ వండర్‌ నీగుడి చేస్తా/
అయ్య బాబోయ్‌ దేవుడు మాయమైపోయాడేంటీ?

– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com