– నవతెలంగాణ కథనానికి విశేష స్పందన
– పలువురిపై కేసు నమోదు
నవతెలంగాణ-బోడుప్పల్
మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం సర్వే నెంబరు 62లో దళిత గిరిజనుల భూమిలో జరిగిన ల్యాండ్ పూలింగ్ అంశంపై ”దళితుల భూమిలో దళారుల నొక్కుడు” అనే శీర్షికన నవతెలంగాణలో గురువారం ప్రచురితమైన కథనంతో పోలీసు యంత్రాంగం కదిలింది. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన కుటుంబాల నుంచి బలవంతంగా అగ్రిమెంట్ చేసుకున్న వారిపై కేసులు నమోదు చేశామని మేడిపల్లి సీఐ గోవర్ధనగిరి తెలిపారు. గురువారం సీఐ మాట్లాడుతూ.. ల్యాండ్ పూలింగ్‌లో భూములు కోల్పోయిన దళిత గిరిజన రైతులకు ప్రభుత్వం ఎకరానికి 600 గజాల చొప్పున ఇచ్చిందని తెలిపారు. కానీ కొంత మంది పైరవీకారులు అధికారులు, లాయర్లు, ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇవ్వాలంటూ ఒక్కో రైతు కుటుంబం నుంచి 100 గజాలు బలవంతంగా అగ్రిమెంట్ చేసుకున్నాట్టు ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. మల్కాజిగిరి ఏసీపీ నరేష్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఎంత మంది నుంచి అగ్రిమెంట్లు చేసుకున్నారు, నగదు రూపంలో ఎంతమంది దగ్గర వసూలు చేశారనే కోణంలో విచారణ జరుగుతుందని చెప్పారు. త్వరలోనే పూర్తి వివరాలు మీడియా ముందుకు వస్తాయన్నారు.