మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన వైద్యాధికారిణి..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 

మండలంలోని  చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సుప్రియ  పరిశీలించారు. సోమవారం మండల విద్యాధికారి ఆంధ్రయ్యతో కలిసి పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థుల కోసం ఆహార పదార్థాలను తయారు చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున  ఈగలు ఎక్కువగా ఉంటాయని వండిన ఆహార పదార్థాలపై తప్పనిసరిగా మూతలు పెట్టి ఉంచాలన్నారు. ఆహార పదార్థాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా తాజా వాటిని కొనుగోలు చేయాలన్నారు. వర్షాకాలంలో పరిశుభ్రతను పాటించాలని, పిల్లలకు శుభ్రమైన ఆహారాన్ని అందించాలని తెలియజేశారు. చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే భోజనాలు చేయాలని విద్యార్థులకు ఆమె సూచించారు. విద్యార్థుల కోసం వండి సిద్ధం చేసిన ఆహార పదార్థాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి చింత సత్యనారాయణ, పాఠశాల ఇంచార్జి  ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.