కర్నాటక దేశానికందించిన సందేశం!

”బీజేపీ తిరోగమన పాలనను చూస్తూ ఊరుకోదు – ఇండియా రియాక్ట్స్‌” అన్న కేసీఆర్‌ మాటను, మొన్న మునుగోడు – నిన్న హిమాచల్‌ప్రదేశ్‌ – నేడు కర్నాటక రుజువుచేశాయి. అయితే కన్నడ ప్రజలు దేశానికొక వినూత్న సందేశాన్నందించారు. మోడీ ప్రభుత్వం మామూలుగా ఎన్నికలు నిర్వహించి ఉంటే, బహుశా కన్నడ ప్రజలంత తీవ్రంగా స్పందించి ఉండేవారు కాదేమో? కానీ 40శాతం కమీషన్ల బురదలో పొర్లాడుతున్న బొమ్మై ప్రభుత్వం ఒకవైపు, కోట్లాది రూపాయల నోట్లతో పట్టుబడ్డ బీజేపీ మంత్రి ఇంకోవైపు కేంద్రం నిర్లక్ష్యపు ధోరణి, అమర్థతను చాటిచెప్పాయి. అంతర్జాతీయ అవినీతి పరునిగా అపఖ్యాతి పాలైన అదానీవైపు గానీ కన్నెత్తి చూడని మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్‌ వాళ్ళు అవినీతి పరులన్న అపఖ్యాతిని ప్రజల్లో వ్యాపింపజేయాలని చూశారు. వ్యవస్థల దాడులతో ఊపిరాడ కుండా చేసి, ఎన్నికల ప్రచారంలో వాళ్ళు పూర్తిగా నిమగం కాలేని స్థితిని కల్పించే లక్ష్యంతో ముందుకు సాగారు. కాంగ్రెస్‌ ప్రముఖులు వాళ్ళ అనుచరులపై వ్యవస్థలను ఉసిగొల్పారు. రాహుల్‌గాంధీ జోడో యాత్ర ఇమేజ్‌ని చెరిపేసేందుకని అతనిపై కేసు బనాయించి, శిక్షించించే ఈ నేపథ్యంలో కర్నాటకలో ఎన్నికలను ప్రకటింపజేసింది మోడీ ప్రభుత్వం.
కుట్రపూరిత బీజేపీ అంతర్యాన్ని గ్రహించి కర్నాటక కాంగ్రెస్‌కు ఉత్తర, దక్షిణ ధృవాల వంటి శివకుమార్‌, సిద్ద రామయ్యలు ప్రజలముందుకొచ్చారు.”మేం చేయీ, చేయీ కలిపి నడుస్తాం! బీజేపీని మట్టిగరిపిస్తా” మంటూ భరోసా కల్పించారు. దాంతో ఊగిసలాటలో ఉన్న తటస్థ ఓటర్లు ధైర్యంగా కాంగ్రెస్‌వైపు మొగ్గారు. ఉదాహరణకు ఎన్నికలకు రెండ్రోజుల ముందుగా బీజేపీ మద్దతు దారులైన లింగాయత్‌లు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించటం అందుకొక నిదర్శనం! ”నేనే కింగ్‌! మాకధికా రాన్నప్పగిస్తే బీజేపీకైనా, కాంగ్రెస్‌కైనా మద్దతిస్తామంటూ తన అధికార దాహాన్ని, అవకాశవాదాన్ని చాటుకున్నాడు కుమారస్వామి గౌడ, కానీ తరాలుగా అతనికి మద్దతిస్తున్న ఒక్కళిగలు తదితరులు కూడా బీజేపీని ఓడించాలన్న కసితో ఉన్నారు. అందుకే కుమారస్వామి జేడీఎస్‌ను తిరస్కరించి కాంగ్రెస్‌కు ఓటేశారు. కుమారస్వామి కొడుకు సినీహీరో నిఖిల్‌గౌడ ఓటమి అందుకొక నిదర్శనం. అలాగే కుమారస్వామి వంటి అవకాశవాదితో చేయి కలపకుండా దేశ క్షేమం పట్ల తన నిబద్ధతను ప్రజలకు తెలియజేశాడు కేసీఆర్‌ అని విశ్లేషకుల అభిప్రాయం! హుబ్లీ ఈస్ట్‌, బీజాపూర్‌లలో పోటీ చేసిన ఎంఐఎం, మరోచోట జేడీఎస్‌కు మద్దతిచ్చింది. బీజేపీకి బినామీగా, ముస్లింలకు శకునిలా వ్యవహరిస్తుందన్న ఆగ్రహంతో ఎంఐఎంను తిరస్కరించి ‘అష్రాఫీ, పస్మాండ, షియా, సున్నీ, బహ్మా తెగల కతీతంగా ముస్లింలంతా సమైక్యంగా కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారు. మోడీ హయాంలో బీజేపీ, ఎంఐఎం నేతలు తప్ప, వ్యవస్థల దాడులకు గురికాని బీజేపీయేతర పార్టీలు, నేతలు లేరన్నది నిజం. బీజేపీకి బినామీ ఎంఐఎం అనటానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి? అని బహిరంగంగానే చర్చించు కుంటున్నారు కన్నడ ముస్లింలు! ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీ పట్ల ఆగ్రహంతో కొందరు కన్నడ యువకులు ”ఈ మత విద్వేష బీజేపీ ఢకొీనగల కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, జాతీయ ప్రాంతీయ ఏ పార్టీనైనా గెలిపించుకోవాలన్నన మనలాంటి ఆలోచనలు దేశ ప్రజలందరిలో జ్వలిస్తే ఎంత బాగుంటుందో కదా!” అనుకుం టున్నారట ఆవేశంలో ఉన్న, అర్ధవంతం గానే ఆలోచిస్తున్నారు వాళ్ళని విశ్లేషకులంటున్నారు.
బీజేపీ పట్ల కన్నడ ప్రజల్లో అంత వ్యతిరేకతే ఉంటే.. మా ఓటింగ్‌ శాతం తగ్గి వుండాలి గదా అన్నది బీజేపీ నేతల వాదన. అందుకు ఆత్మ పరిశీలన ద్వారానే వారికి జవాబు దొరుకుతుంది! కర్నాటక ఎన్నికల్లో 1. మోడీతో సహా 15 మంది కేంద్ర మంత్రులు, 128మంది జాతీయ నేతలు అమిత్‌షా, నడ్డాల పర్యవేక్షణలో 19 భారీ బహిరంగ సభలు, 6 భారీ రోడ్డుషోలు, అనేక ర్యాలీలతోపాటు 2. కేరళ ఫైల్స్‌ సినిమా రిలీజు, దాన్ని గూర్చి మోడీగారి భజన, 3. వేలాది సంఫ్‌ పరివార కార్యకర్తల ఇంటింటి ప్రచారం 4. మోడీ జై భజరంగ భలీ నినాదాలు 5. హనుమాన్‌ చాలీసా పారాయణాలు 6. ఉచిత గ్యాస్‌ సిలెండర్లు, పాలప్యాకెట్లు వగైరా ఉచిత హామీలు 7. ఎన్నికల కమిషన్‌ను జాన్‌దేవ్‌ అంటూ హిజాబ్‌ – హలాల్‌ – లవ్‌జిహాద్‌” వగైరా మత విద్వేష అస్త్రాల ప్రయోగం. 8. కాంగ్రెస్‌కు ఉగ్ర వాదులతో సంబంధాలున్నాయి, వాళ్ళ అధికారానికొస్తే మతకల్లోలాలు చెలరేగుతాయి, కర్నాటకను భారత్‌ నుండి విడదీయాలను కుంటున్న దేశద్రోహులు వాళ్ళంటూ ప్రధాని మోడీ, ఆధార రహిత ఆరోపణలు చేశాడు! దేశ ప్రధాని, రక్షణమంత్రి మోడీ, అమిత్‌షాలిలా యధేచ్ఛగా మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నా ఇది చట్ట విరుద్ధమంటూ కాంగ్రెస్‌ నేతలు మొరపెడుతున్నా ఎన్నికల కమిషన్‌ చలించలేదు. వ్యవస్థలు మోడీ ప్రభుత్వ చేతి రిమోట్లలా వ్యవహరిస్తున్నా యనటానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలంటున్నారు పలువురు.
ఈ మత విద్వేష ప్రచారానికైన భారీ ఖర్చంతా ప్రజా (ప్రభుత్వ)ధనమేననీ ఓటర్లపై బీజేపీ కురిపించిన నోట్ల వర్షమంతా ఎన్నికల బాండ్ల రూపంలో ఆశ్రిత పెట్టుబడిదారులు బీజేపీ కందించిన భారీ నిధులేననీ ఈసీకి తెలియనిదా? ఇంత చేసినా గ్రామీణ ప్రాంతాలలో భారీగా ఓట్లు కోల్పోయింది బీజేపీ! మతం మత్తింకా దిగని పట్టణ ప్రాంతాలలో మాత్రం కొన్ని ఓట్లను పెంచుకోగలిగింది బీజేపీ! ఇంతగా చెమటోడ్చినా, గతంలో బీజేపీ ఓట్ల శాతం 36.5శాతం నుండి ఈ ఎన్నికల్లో 35.9శాతానికి తగ్గిన మాట వాస్తవం! మరి బీజేపీ పట్ల ప్రజాభిమానం తగ్గినట్లా? లేక బీజేపీ వ్యతిరేక వరదకు తమ ఓటర్లు కొట్టుకుపోకుండా వ్యవస్థలు – విద్వేషాలు – కార్పొరేట్ల నిధులు – కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలతో అడ్డుకట్ట వేసుకున్నట్లా? జవాబు బీజేపీనే చెప్పాలి.అందుకే ప్రస్తుతం రాష్ట్రాలన్నింటా తానే అధికారాన్ని పొందాలన్న పేరాశకు పోకుండా ఆయారాష్ట్రాలలో కాంగ్రెస్‌, తదితర పార్టీల బలాబలాలను బేరీజువేసుకుని, కాంగ్రెస్‌ కాధిక్యమున్న చోట బీజేపీ యేతర పార్టీలతో సంఘటితమవుతూ, ప్రాంతీయ పార్టీలకు, ఆధిక్యమున్నచోట వాటికి మద్దతు ప్రకటిస్తూ ”మత విద్వేష కార్పొరేట్‌ బీజేపీ ముక్త్‌ భారత్‌” లక్ష్యం దిశగా కృషి చేస్తూ తన దేశభక్తిని మరోసారి చాటుకోవలసిన ఆవశ్యకతను కాంగ్రెస్‌ విస్మరించకూడదు.
పాతూరి వెంకటేశ్వరరావు
9849081889