నవతెలంగాణ-జైపూర్
శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం-1ఏ గని జనరల్ మజ్దూర్ ఎలవేణి శ్రీనివాస్(35) మంగళవారం మొదటి షిఫ్టు విధుల్లో మృతి చెందాడు. గని మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం..ఉదయం షిఫ్టు డ్యూటీలో చేరిన కార్మికుడు తోటి కార్మికులతో కలిసి గని భూగర్భంలో ఇటుకలు అన్‌లోడ్ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందిస్తున్న క్రమంలో మృతి చెందాడు.
ప్రాణవాయువు అందకనే మృతి : భార్య ఎలవేణి అనిత
ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని తన భర్త శ్రీనివాస్ గని భూగర్భంలో ప్రాణవాయువు అందకనే మృతి చెందాడని భార్య ఎలవేణి అనిత ఆరోపించారు. ఈ మేరకు జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గని భూగర్భంలో 4లెవల్ 35 డీప్ రిటర్న్ గాలి వద్ద విధులు నిర్వరిస్తుండగా అక్కడ సరైన ప్రాణవాయువు అందకపోవడంతో ఊపిరాడక అస్వస్థతకు గురై మృతి చెందాడని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తుండగా మృతి చెందినట్లు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తన భర్త మృతికి కారకులైన సింగరేణి అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
యాజమాన్యం బాధ్యత వహించాలి : హెచ్‌ఎంఎస్
ఇందారం-1ఏ గని జనరల్ మజ్దూర్ శ్రీనివాస్ మృతికి యాజమాన్యం బాధ్యత వహించాలని హెచ్‌ఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కొంత కాలంగా గనిలో 53,34,38 డీప్‌లలో గాలి సరఫరా లేదంటూ కార్మికులు మొరపెట్టుకున్నా అధికారులు గాలి మెరుగుపర్చడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. తాజాగా సోమవారం కార్మికులు అధికారులను కలిసి గాలి సరఫరా మెరుగుపర్చాలని కోరినా అధికారులు నిర్లక్ష్యం చేశారని తెలిపారు. అధికారులు కప్పిపుచ్చుకోవడానికి శ్రీనివాస్‌కు ఫిట్స్ వచ్చి గుండెపోటుకు గురయ్యాడని పేర్కొంటున్నారని హెచ్‌ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య, బ్రాంచ్ కార్యదర్శి అనిల్‌రెడ్డి పేర్కొన్నారు.