
– మోతె నెత్తిమీద సాక్షాత్తు కేసీఆర్ ఉన్నాడు
– ఉద్యమగడ్డ మోతెను ఉన్నతంగా నిలిపాము
– మరోసారి ఆశీర్వదించి గెలిపించండి
-వేల్పూర్ మండలంలో మంత్రి వేముల ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు తాను రాష్ట్రానికి మంత్రినైనా వేల్పూర్‌కు బిడ్డనేనని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి, బిఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి వేల్పూర్ మండలంలోని ఉద్యమగడ్డ మోతే గ్రామంలో, ఆయన స్వగ్రామం వేల్పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు మోతే, వేల్పూర్ ఎంతో ఇష్టమైన గ్రామాలన్నారు. వేల్పూర్‌లో 150 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయన్నారు. మీ బిడ్డ ప్రశాంత్‌రెడ్డి ఎమ్మెల్యే కాకముందు వేల్పూర్ గ్రామం ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో మీ కండ్లముందే ఉందన్నారు. వేల్పూర్ చుట్టూ వాగులపై పెద్ద పెద్ద బ్రిడ్జిలు, వాగుల నిండా చెక్ డ్యాంలు గ్రామంలో సెంట్రల్ లైటింగ్, గల్లీలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేల్పూర్ నుంచి నలువైపులా వెళ్లే డబుల్ రోడ్లు, కొత్తగా కట్టుకున్న, అభివృద్ధి చేసుకున్న బడులు, గుడులు, మసీదులు, చర్చీలతో వేల్పూర్ గ్రామం సర్వతోముఖంగా అభివృద్ధి చెంది మీ కండ్లముందే నిలిచిందన్నారు. వేల్పూర్ గ్రామం మద్దతు తనకు కొండంత బలం అన్నారు. మోతే గ్రామం తెలంగాణ ఉద్యమ వేగుచుక్క అన్నారు. వేతన కన్న ఊరు వేల్పూర్ అంటే తనకెంతోఎ ఇష్టమన్నారు. మంత్రిగా జిల్లాకు ఎప్పుడు వచ్చినా ఏ జిల్లా కేంద్రంలోనూ, గెస్ట్ హౌజ్‌ల్లోనూ, ఏ పెద్ద పెద్ద బంగ్లాల్లోనూ పడుకోలేదని, వేల్పూర్‌కే వచ్చి పడుకుంటానని గుర్తు చేశారు. సెక్యూరిటీ సమస్య ఉంటుందని అధికారులు వారించినా.. తన గ్రామమే తనకు సెక్యూరిటీ అని చెప్పేవాడినని అన్నారు. దళితబంధు దశల వారీగా అందరికీ అందించే లక్ష్యంతోనే కేసీఆర్ ప్రారంభించారన్నారు. సమైక్యవాదులైన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాంటి బలవంతులకు ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం ఇరవై రెండేళ్ల క్రితం టీఆరెస్ పార్టీని స్థాపించిన సందర్భంలో మోతేగ్రామం ఏకగ్రీవ తీర్మానం చేసి ఉద్యమ దిక్సూచిగా నిలిచిందన్నారు. ఇరవై రెండు ఏండ్ల నాటి ఆ ఉత్సాహం, ఆ పౌరుషం మోతే గ్రామస్తుల్లో తన ప్రచార సందర్భంగా కూడా కనిపిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. సాగునీటికి ఎన్నో కష్టాలు పడ్డ మోతే గ్రామాన్ని చుట్టు వాగుల్లో చెక్‌డ్యాంలు నిర్మించి చెరువుకు మాటు కాలువ నిర్మించి ఒక ద్వీపంలాగా కేసీఆర్ సహకారంతో నిలబెట్టానన్నారు. మోతేకు ఏ మాత్రం లోటు వచ్చినా కేసీఆర్ ఊరుకోడన్నారు. మోతే కోసమే ప్రత్యేకంగా పీహెచ్‌సీ ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పీఏసీఎస్‌ను ఏర్పాటు చేశామన్నారు. కోటి రూపాయలతో జీపీ భవనం నిర్మించామన్నారు. తనను మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రికి రెండు గ్రామాల్లో లభించిన ఘన స్వాగతం ఉద్యమకాలం నాటి అపూర్వ స్వాగతాలను తలపించింది.