సంకల్పం ముందు చిన్నబోయిన వైకల్యం

A minor disability before the willవిధి వంచించినా.. తలవంచని ధైర్యం.. వైకల్యం సవాళ్లు విసిరినా.. అచంచల ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తూ.. వినువీధిలో గెలుపు గీతం వినిపిస్తూ.. అణువణువునా స్ఫూర్తిని నింపే విశ్వక్రీడా సంరంభంలో.. తమ మనోబలం ఎంత గొప్పదో చాటి చెప్పేందుకు పారా ఒలింపియన్లు ఈ క్రీడలను వేదికగా చేసుకోబోతున్నారు. తమ దేశానికి గర్వకారణంగా నిలవాలన్న లక్ష్యంతో ఆకాశమే హద్దుగా చెలరేగేందుకు సిద్ధమైన ఈ క్రీడాకారులకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే. అలాంటి తెలుగు యువ క్రీడాకారుల పరిచయం ఈ వారం జోష్‌…

‘ఒంటికే వైకల్యము మనస్సుకంటనీకు’ అని బలంగా నమ్మిన మన పారా అథ్లెట్లు చక్రాల కుర్చీలతో.. కృత్రిమ కాళ్లతో.. పనిచేయని చేతులతో.. పారాలింపిక్స్‌లో వైకల్యాన్ని దాటి.. సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఒలింపిక్స్‌లోనే సాధారణ అథ్లెట్లు అంచనాలను అందుకోలేకపోయారు.. ఇక పారా అథ్లెట్లు ఏం సాధిస్తారు?’ అడుగడుగునా ఎన్నో అనుమానాలు, అవమానాలు, మరెన్నో ప్రశ్నలను.. అనుమానాలను పటాపంచలు చేశారు. ఆత్మవిశ్వాసం అండగా.. పోరాటమే శ్వాసగా.. ఆట మీద ధ్యాసతో.. అద్భుత ప్రదర్శనతో దేశానికి పతక వెలుగులు పంచేందుకు కధనరంగంలోకి అడుగుపెట్టారు.
‘అవిటితనం కన్న ఆత్మవిశ్వాసం మిన్న/ అదికాస్త లేకున్నా అంగములున్నా సున్నా’ అన్న కవి శేషగిరి వాక్కులను నిజం చేస్తూ మన పారా అథ్లెట్లు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో విశ్వక్రీడా యవనికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించనున్నారు. వాళ్ల క్రీడా ప్రతిభ ముందు వైకల్యం ఇప్పటికే తలవంచింది. వారు ఇప్పుడు దేశానికే ఓ స్ఫూర్తి.. ఓ ఆదర్శం. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి.. అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ.. తామేమీ సాధించలేమనే నిరాశలో కుంగిపోతూ చాలా మంది తమ జీవితాలను మధ్యలోనే ముగిస్తారు. కానీ, వీళ్లది కష్టాల కడలిలాంటి జీవితం.. ఆ జీవన ప్రయాణంలో అడుగడుగునా అడ్డంకులే అయినా, వెన్నుచూపలేదు. భయపడి చీకటిలోనే ఉండిపోలేదు. అన్నింటిని అధిగమించి ఆటల్లో సత్తాచాటి దేశ ఖ్యాతిని చాటుతున్నారు.
దీప్తి తెలంగాణ కీర్తి
పుట్టుకతోనే జీవాంజి దీప్తికి మానసిక వైకల్యం. అది చూసి తల్లిదండ్రులు కుంగిపోయారు. మరోవైపు పేదరికం. లేనిపోని మాటలు. ఎన్నో అవమానాలు. ఆమె తలపై కొండంత భారం. కానీ ఆమె ఆగలేదు. తనకు తెలిసిన పరుగునే నమ్ముకుంది. పరుగుతోనే సాగుతోంది. ఇంటిని విడిచి.. గ్రామాన్ని దాటి.. పరుగులు తీసింది. ఇప్పుడా పరుగే ఆమెను ప్రపంచ ఛాంియన్‌గా నిలబెట్టింది. పారాలింపిక్స్‌కు అ్హత సాధించేలా చేసింది. మేధోపరమైన బలహీనత ఉన్నప్పటికీ అకుంఠిత దీక్షతో, అంతులేని పోరాట పటిమతో దీప్తి అత్యున్నత విజయాలు సాధిస్తోంది. పారిస్‌లో మహిళల టీ20 400 మీటర్ల పరుగులో ఆమె కచ్చితంగా పసిడి గెలుస్తుందనే అంచనాలున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆమె నిలకడైన ప్రదర్శనే అందుకు కారణం. వరంగల్‌ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి తల్లిదండ్రులు యాదగిరి, ధనలక్ష్మి కూలీ పనిచేసేవాళ్లు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమకున్న అర ఎకరం భూమి అమ్ముకోవాల్సి వచ్చింది. మరోవైపు తనయ దీప్తి ఏమో చెప్పింది త్వరగా అర్థం చేసుకోలేదు. తన భావాలను వ్యక్తపరచలేదు. కానీ చిన్నప్పటి నుంచి వేగంగా పరుగెత్తేది. పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఆమెను ప్రోత్సహించాడు. వరంగల్‌లో ఓ సారి పాఠశాలల పోటీల్లో పాల్గొన్న ఆమె.. అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ దృష్టిలో పడింది. ఆమెను హైదరాబాద్‌కు రప్పించేలా తల్లిదండ్రులను అతను ఒప్పించాడు. రమేశ్‌ శిక్షణలో మెరుగైన దీప్తి.. మొదట సాధారణ అథ్లెట్లతోనే పోటీపడి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలూ సాధించింది. అనంతరం మానసిక దివ్యాంగుల విభాగంలో పారా పరుగు మొదలెట్టింది. ఆ దశలో పుల్లెల గోపీచంద్‌ ఆమెకు అండగా నిలిచాడు. గతేడాది ఆసియా పారా క్రీడల్లో రికార్డు ప్రదర్శనతో పసిడి నెగ్గడంతో దీప్తి పేరు మార్మోగింది. ఆ నగదు బహుమతి రూ.30 లక్షలతో తల్లిదండ్రులకు భూమి కొనిచ్చింది. ఈ ఏడాది ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణంతో సంచలనం సష్టించింది. పసిడితో పాటు ప్రపంచ రికార్డు ప్రదర్శన (55.07 సెకన్లు)తో పారిస్‌ పారాలింపిక్స్‌ బెర్తు కొట్టేసింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో పారాలింపిక్స్‌లోనూ బంగారు పతకం గెలిచేలా కనిపిస్తోంది.
స్ఫూర్తిదాయక ప్రస్థానం
నంద్యాల జిల్లాలోని ప్యాపిలికి చెందిన కొంగనపల్లి నారాయణది మరో స్ఫూర్తిదాయక ప్రస్థానం. ప్యాపిలికి చెందిన వెంకటస్వామి, సుంకమ్మ దంపతుల కుమారుడు కొంగనపల్లి నారాయణ. ఈయనకు చిన్నతనం నుంచే దేశభక్తి, క్రీడల్లో ఆసక్తి. దేశం కోసం సైన్యంలో చేరాడు. కబడ్డీలో రాష్ట్రస్థాయిలో మెరిసిన అతను దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో 2007లో సైన్యంలో చేరాడు. 2007లో సైన్యంలో చేరాడు. జమ్మూలో విధులు నిర్వర్తించే సమయంలో మందుపాతర పేలడంతో అతని ఎడమ కాలు తీసేయాల్సి వచ్చింది. అప్పటివరకూ వెలుగుతో సాగిన అతని జీవితంలో ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. ఇక నడవలేనని, మంచానికే పరిమితం కావాలేమోనని నారాయణ తీవ్రంగా బాధపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ఈ విషాదం నుంచి కోలుకుని పుణె వెళ్లి కృత్రిమ కాలు అమర్చుకున్నాడు. ఆ సమయంలో కల్నల్‌ గౌరవ్‌ దత్తా పరిచయంతో నారాయణ కథ ఊహించని మలుపు తిరిగింది. వైకల్యం ఉన్న వాళ్లను పారా క్రీడల వైపు మళ్లించే గౌరవ్‌.. నారాయణకు మొదట జావెలిన్‌ను పరిచయం చేశాడు. కానీ పరుగెత్తడం కష్టమవడంతో రోయింగ్‌కు మారాడు. ఈ ఆటలో క్రమంగా పట్టు సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టాడు.
తాను పోటీపడే పీఆర్‌3 విభాగంలో ఆసియా పారా క్రీడలు, పారాలింపిక్స్‌లో కేవలం మిక్స్‌డ్‌ స్కల్స్‌లో మాత్రమే పోటీలున్నాయి. దీంతో అనిత (రాజస్థాన్‌)తో కలిసి మిక్స్‌డ్‌ విభాగంలో నారాయణ సత్తాచాటాడు. ఆసియా పారా క్రీడల్లో ఈ జోడీ రజతం గెలిచింది. ఈ జంట పారాలింపిక్స్‌ అర్హత టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసి పారిస్‌ బెర్తు పట్టేసింది. మరోవైపు ఏపీకి చెందిన పారా షఉటర్‌ శ్రీహర్ష రామకృష్ణ కూడా పారాలింపిక్స్‌ బరిలో నిలిచాడు. 2022లో 10మీ.మిక్స్‌డ్‌ ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌2 ప్రపంచకప్‌లో స్వర్ణం గెలిచి అతను ఈ క్రీడలకు అర్హత సాధించాడు. 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీహర్ష వెన్నెముక దెబ్బతింది. అప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమైన అతను షఉటింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. క్రమంగా గురిపై పట్టు సాధించి ఇప్పుడు పారాలింపిక్స్‌లో పతక వేటకు సిద్ధమయ్యాడు.
రిసెప్షనిస్టుగా మొదలై…
సాఫీగా సాగుతున్న జీవితంలో ఊహించని ప్రమాదం కారణంగా అర్షద్‌ షేక్‌ వైకల్యం బారిన పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన అర్షద్‌ చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేవాడు. తైక్వాండోలో రాష్ట్రస్థాయిలో రాణించాడు. కానీ ఏడో తరగతి చదువుతుండగా ఓ రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలును మోకాలి వరకూ పోగొట్టుకోవాల్సి వచ్చింది. మనోధైర్యం కోల్పోయిన అతణ్ని.. చదువుపై దృష్టిసారిస్తే దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగ వస్తుందని తండ్రి ప్రోత్సహించాడు. ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు క్రీడా పోటీల్లోనూ అర్షద్‌ ాల్గొనేవాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆసుపతరిలో ఉద్యోగిగా చేరాడు. అక్కడ పనిచేస్తున్న వారి ప్రోత్సాహంతో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని రాణించాడు. ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో చేరాక జాతీయ, అంతర్జాతీయ పారా సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొంటూ పతకాల పంట పండిస్తున్నాడు. ఆసియా రోడ్‌ సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఎలైట్‌ వ్యక్తిగత టైమ్‌ ట్రయల్‌ సీ2 విభాగం మహిళల్లో జ్యోతి (మహారాష్ట్ర) స్వర్ణం, అర్షద్‌ రజతం గెలిచారు. దీంతో ర్యాంకింగ్స్‌లో మెరుగై పారాలింపిక్స్‌కు అర్హత సాధించారు. పారాలింపిక్స్‌ చరిత్రలోనే పారా సైక్లింగ్‌లో భారత అథ్లెట్లు పోటీపడబోతుండటం ఇదే తొలిసారి. అర్షద్‌ పురుషుల సీ2 వ్యక్తిగత టైమ్‌ ట్రయల్‌, సీ1-3 టైమ్‌ ట్రయల్‌, సీ2 రోడ్‌ రేస్‌, సీ2 వ్యక్తిగత పర్స్యూట్‌లో బరిలో దిగుతున్నాడు.
పొట్టివాడు కాదు గట్టివాడు
అనకాపల్లి కె. కోటపాడుకు చెందిన షాట్‌పుట్‌ క్రీడాకారుడు రొంగలి రవి పుట్టుకతోనే మరుగుజ్జు. తన ఎత్తును చూసి మిత్రులతో పాటు చుట్టుపక్కల వాళ్లు గేలిచేసినా ఏనాడూ కుంగిపోలేదు. తాను ఏదైనా సాధిస్తే, ఇవాళ వెక్కిరించిన వాళ్లే రేపు గౌరవిస్తారని చిన్నతనంలోనే దృఢంగా నిశ్చయించుకున్న రవి.. చదువుతో పాటు ఆటల్లోనూ తనదైన ప్రతిభ చూపేవాడు. చిన్నప్పుడు ప్రభుత్వ హాస్టల్‌లో ఉండి చదువుకునేటప్పుడే తనకిష్టమైన షాట్‌పుట్‌ క్రీడను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అనతికాలంలోనే అందులో రాటుదేలిన రవి.. ఈ ఏడాది పారిస్‌ క్రీడలకు ఎంపికై పారాలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత షాట్‌పుట్‌ క్రీడాకారునిగా రికార్డు సృష్టించాడు. తన ఈవెంట్‌లో ప్రస్తుతం ప్రపంచ ఐదో ర్యాంకర్‌గా కొనసాగుతున్న రవి.. నిరుడు పారా ఆసియా క్రీడల్లో రజతం నెగ్గి అదరగొట్టాడు. బెంగళూరు సారు కేంద్రంలో శిక్షణ తీసుకొన్న రవి.. ఇప్పుడు పారాలింపిక్స్‌లో ఏకంగా స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు.

– అనంతోజు మోహన్‌కృష్ణ, 8897765417న