తెలుగులో ప్రస్తుతం సాహిత్య విమర్శ లేదు అంటున్నాం. కవులను లేదా రచయితలను సంతోష పెట్టే విమర్శకుల తాకిడి ఎక్కువయిందనీ అంటున్నాం. పుస్తక సమీక్షలు మాత్రమే సాహిత్య విమర్శగా చెలామణి అవుతున్నాయనీ అంటున్నాం. అలా ఎందుకనాల్సి వస్తోంది. ఎన్ని పేర్లు పెట్టినా చివరకు నిజంగానే ప్రశంస, లేదూ పరామర్శ మాత్రమే విమర్శగా మిగిలి పోవడమేనా కారణం. మౌలిక సిద్దాంతాలు లేని అప్లయిడ్ క్రిటిసిజమేనా కారణం. అవునేమో! సహదయత, నిష్పాక్షికత లేకపోవడం కూడా కావచ్చేమో! అసలైన విమర్శను స్వీకరించే స్థితిలో సజనకారులు లేకపోవడం కూడా ఈ చెడు పరిణామాలకు కారణం కావచ్చు కామోసు!
జాబితా చేస్తూపోతే విమర్శ చాలారకాలు. అప్పట్లో వ్యాఖ్యానమే విమర్శ. ఆ తరవాతి విమర్శలో సామాజిక, సాహిత్య, భాషా, ఛందో, అలంకారిక, రస చర్చ సంబంధిత విషయాలు కలగలిసిపోయి ఉండేవి. సాంప్రదాయ విమర్శ, నైతిక విమర్శ, తాత్విక విమర్శ ఇంకా చాలా ఉండేవి. ఉన్నాయి. అయితే ఏ భాషా సాహిత్యంలోనైనా పరామర్శ, సమీక్ష, ప్రశంస, ఖండన మాత్రమే మౌలికంగా ట్రెండింగ్‌లో ఉండేవి, ఉన్నాయి. నిజం చెప్పాలంటే విమర్శకులు ఎక్కడనుంచో పుట్టుకురారు. ప్రతి సజనకారుడిలోనూ ఒక విమర్శకుడుంటాడు. ప్రతి పాఠకుడిలోనూ విమర్శకుడుంటాడు. ఒక రచన చదివాక పాఠకుడేమనుకుంటాడో అదే ఆ రచన అసలు సిసలు జీవం. దాన్నే పాఠక ప్రతిక్రియ అంటున్నాం. రీడర్స్ రెస్పాన్స్ థియరీ అంటున్నాం. ఇప్పుడిదంతా ఎందుకూ అంటే… మీరు అడుగుబెట్టబోతున్న ఫణి మాధవి కన్నోజు విమర్శా వ్యాసాలను ఏ గాటన కట్టేయాలి అన్న సమస్యకు పరిష్కారం వెదకడం కోసం.
ఫణి మాధవి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. కవయిత్రి. విమర్శకురాలు. ఒకటీ అరా కథలు కూడా రాసారు. వివిధ రకాల విమర్శలలో ఫణి మాధవి చేస్తున్న విమర్శ ఏ రకం? ఫణి మాధవి విమర్శను ఏ పనిముట్లతో అర్దం చేసుకోవాలి. స్త్రీల సమస్యలు, స్త్రీల వేదన, స్త్రీల చుట్టూ అలుముకున్న చీకటి గురించిన కవిత్వ విశ్లేషణ ఈ సంపుటిలో ఉంది. కేవలం తెలుగు కవిత్వాన్నే కాక దేశ విదేశ కవులను ఆమె తన పరిధిలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన విశ్లేషణలో కవిత్వ రూపం గురించి ఎక్కడా చర్చించలేదు. సాహిత్య కళ గురించిన చర్చ కూడా చేయలేదు. కేవలం ఆయా కవులు ఎంచుకున్న సారం గురించి మాత్రమే చర్చించారు.
కవిత్వాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం అనే ప్రిమైజ్ రూఢ అయినపుడు ఇక కవిత్వ విశ్లేషణ అవసరమా, అది కవిత్వం ఎందుకయింది, ఎలా అయింది, కవిత్వం చేయడంలో కవి ఏయే మెళకువలు పాటించాడనే విశ్లేషణ దేనికి అనే నిర్దారణలోకి వస్తే కవిత్వ సారాన్ని గురించి మాత్రమే మాట్లాడాల్సి ఉంటుంది. విప్లవ సాహిత్య సమర్దకులు ఇలాంటి విమర్శే చేశారు. కవితా రూపం, రూప ప్రయోగం వంటి అంశాలను పట్టించుకోలేదు. స్త్రీ వాద సాహిత్యం ఉధతంగా వస్తున్న సమయంలో వచ్చిన సానుకూల విమర్శ కూడా కేవలం సారం గురించే చర్చించింది తప్ప కవితా రూపం గురించి చర్చించలేదు. చాలా మంది స్త్రీ వాద విమర్శకులు ఇప్పటికీ ఇదే తరహా విశ్లేషణను సాహిత్య విమర్శగా కొనసాగిస్తున్నారు. ఇదొక నిర్దారిత పద్ధతి. అందుకే ప్రిమైజ్ అన్నది. ఈ సంపుటిలో ఫణిమాధవి కూడా అదే పద్ధతిని పాటించారు. ఆమెకు సారమే ముఖ్యం. అందుకే కావచ్చు ‘మేఘాల నీలాల్లోకి’ అని ఈ సంపుటికి శీర్శికనిచ్చారు. స్త్రీవాద కవిత్వానికి పెదబాలశిక్షగా చెప్పుకోదగ్గ ‘నీలి మేఘాలు’ సారాన్ని లోతుల్లోకి వెళ్లి అధ్యయనం చేయడం, లేదా తదనంతర కవిత్వాన్ని లోకానికి విపులీకరించడం అనే అర్థంతో ఆమె ఈ శీర్శికనిచ్చి ఉంటారు. అదే నిజం అని వ్యాసాలు చదివాక కచ్చితంగా తెలిసొస్తుంది.
ఈ సంపుటిలో మలయాళ, బెంగాలీ, కన్నడ, హిందీ, ఇరానీ, ఆంగ్ల, తెలుగు కవిత్వ సారాంశ వివరణ ఉంది. ఆయా కవుల కవితలు ఏ సారం గురించి, ఏ వేదన గురించి చర్చించారో చర్చించాయో ఉంది. ఇదొక ప్రయోగం. ఇదొక కొత్త చూపు. అందుకే గాయం సలుపుతున్నా కన్ను విప్పార్చి చూస్తున్న ముఖం ముఖచిత్రంతో విషయమంతా చెప్పేసారు ఫణి మాధవి.
చలం చెప్పిన ఆమెకు వ్యాయామం, జ్ఞానం అనుభవం కావాలన్న దశ నుంచి ఫణి మాధవి మరింత ముందుకు వెళ్లి ఆమెకు ఆలోచన ఇవ్వాలనే సారాంశాన్ని తన వ్యాసాలలో ప్రతిపాదించారు. అనసూయా సేన్ కవిత్వం సాయంతో మౌనం ఎలా బలమో ఎలా ఆయుధమో ఎలా నిరసనో చెప్పారు. అదే సందర్భంలో కారా డెల్విన్ సాయంతో డిప్రెషన్‌లో కుంగిపోయిన వారు ఎలా, ఎవరికి, ఏం చెప్పుకోవాలో ఆ వేదనను ప్రపంచం ఎలా వినాలో చెప్పారు. నో అని చెప్పడం చాలా సందర్బాలలో ఎంత అత్యవసరమో నయిరా వహీద్ కవిత్వం సాయంతో చెప్పారు. మౌనం, చెప్పడం, వినడం మధ్య ఎప్పుడు ఎటు మొగ్గు చూపాలో అనే సంకేతాన్ని తన ముఖచిత్రంలో పెదాల స్థానంలో బహుశా త్రాసును ఉంచి ఇచ్చారేమో ఫణి మాధవి.
హిందీలో రజనీ తిలక్ దళిత పాదముద్రనూ, బెంగాలీ ఫెమినిస్టు కళ్యాణ్ ఠాకూర్ దళితత్వాన్నీ, తెలుగులో భైరి ఇందిర ధిక్కారాన్నీ, అలీసా కమ్మింగ్స్ కవిత్వం ఎలా ఓ చికిత్స అయిందో, మరాఠీ గీతాంజలి తన కవిత్వంతో మానసిక సాంత్వన ఎలా పొందిందో మన మనసుకు కట్టారు ఫణి మాధవి.
మూత్రశాలల లేమి వెనుక ఉన్న నరకం, ఒలీవియా మెంటల్ హెల్త్ అవగాహన గురించి, మెన్సుట్రువల్ హైజీన్ ఆవశ్యకత గురించిన సారాన్ని ఎంచుకున్న కవులను తన జాబితాలోకి ఎక్కించుకుని ఫణి మాధవి ఈ సంపుటికి ఒక పరిపూర్ణతనిచ్చారు. హిజాబ్ మాటున కుట్ర చేసే లౌకిక తత్వం గురించి మాట్లాడిన జైనాబ్ రషీద్ ధైర్యం గురించి, కొండ మీది చింత చెట్టు మైదానంలోకి నడిచిరాదన్న వాస్తవాన్ని అర్దం చేసుకోలేని ఆధునిక ఆదానీల అణచివేతకు బలయే గిరిజన జీవన విధానాన్ని వివరించే కళ్యాణి కుంజ, పద్దం అనసూయ మనను ఈ వ్యాసాల్లో పలకరిస్తారు. ఆమెలే కాక ట్రాన్స్ జెండర్ శిలోక్ ముక్కటి జెండర్ కవిత్వ ప్రయాణాన్ని, ఇరాన్ మహిళలు ఫరూV్‌ా ఫారోక్జాద్, తాహెరా, బెహ్మానీ, గ్రానాV్‌ా మౌసమీల ప్రయాణాలను, పోర్శియా దేవి ఆత్మాభిమానపు మోనోలాగ్‌ను కూడా మనకో ట్రాజిక్ ట్రావెలాగ్‌లా వినిపిస్తారు ఫణి మాధవి.
కవి కంటే విమర్శకుడు ఎక్కువ అధ్యయనశీలి అయి ఉండాలన్నది వాస్తవం. కవి సగం చెపితే మిగతా సగం పాఠకుడే అర్దం చేసుకుంటాడు కదా. ఆ ఖాళీని పూరించే పనిని విమర్శలో ఫణి మాధవి చేసారు. ఆమె విమర్శలో లిబరల్ స్పిరిట్ కీలకం. తన లోపలి కవయిత్రి తనను వెన్నాడుతున్నా కూడా కేవలం విమర్శ మీదనే దష్టి నిలపడం ఆ లిబరల్ స్పిరిట్ వల్లనే సాధ్యమైంది. ఇక్కడ ఆమె సామభేదం తూకం తప్పకుండా పాటించారు.
మంచి విమర్శ వచ్చినపుడే మంచి సాహిత్యం వస్తుందన్న మాట నిజమే అయితే మంచి స్త్రీ వాద సాహిత్యం రావడానికి ఫణి మాధవి వ్యాసాలు పునాదులయి తీరతాయి.
దు:ఖం ఒక స్వచ్చత. దు:ఖం ఒక బలం. దు:ఖం ఒక పొలికేక. దు:ఖం ఒక పశ్చాత్తాపం. దు:ఖం ఒక సంభాషణ. దు:ఖం ఒక ఆనందభాష్పం. దు:ఖం ఒక అవ్యాజ్య ప్రేమ.
ఈ వ్యాసాలు చదవడమంటే దు:ఖదిమ్మరిగా పర్యటించి పకపకా ఏడ్వడం. ఎక్కిళ్లొచ్చేట్టు నవ్వడం. ఈ వ్యాసాలలో గుండెడు కన్నీళ్లున్నాయి. బండెడు గాయాలున్నాయి. ఇదొక అశ్రు సంచారి యాత్రా కథనం. ఆ సంచారి విశ్వ మానవి కావచ్చు. పాఠకుడే కావచ్చు. ఫణిమాధవీ కావచ్చు. రేపటి నవ్వుల కోసం ఇవాళ కన్నీళ్లలో మునగడం కూడా బానే ఉంటుంది. మేఘాల నీలాల్లో తడిసిపొండి.
– ప్రసేన్, 98489 97241