– అధికారపక్షంలో అందరికీ అవే లక్షణాలు
– అకృత్యాలు కనిపించకుండా నల్ల కండ్లద్దాలు
– అదేమిటని ప్రశ్నిస్తే..ఎరుపెక్కుతున్న కండ్లు
దేశంలో కండ్ల కలక అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎంత వేగంగా అంటే విద్వేషాలు, వదంతులు ఎంత వేగంగా వ్యాపిస్తాయో అంత వేగంగా అన్నమాట. దీని లక్షణాలు ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి. మతోన్మాద ధోరణులు కూడా అచ్చం అలాగే వ్యాపిస్తున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ఎక్స్ (ఒకప్పటి ట్విట్టర్) వంటి వేదికల ద్వారా గాలి కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కండ్ల కలక వచ్చిన వారిలో ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయో ప్రస్తుత రాజకీయ నాయకులలో కూడా అలాంటి లక్షణాలే కన్పిస్తున్నాయి.
న్యూఢిల్లీ: కండ్ల కలక వ్యాధి సోకిన వారిలో కన్పించే మొదటి లక్షణం ఏమంటే కండ్లు ఎర్రబడతాయి. ఇప్పుడు దేశంలో కూడా కొందరు నాయకుల కండ్లు ఎరుపెక్కుతున్నాయి. అందుకు కారణం మణిపూర్ హింస లేదా నూV్‌ా ఘర్షణలు లేదా ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఒకరు ముస్లింలుగా భావించి నలుగురు వ్యక్తులపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్న సంఘటన కావచ్చు. ఇక రెండో లక్షణం వ్యాధి వచ్చిన వారు కండ్లు తెరవలేరు. తెరిస్తే మంట. బహుశ ఇలాంటి వ్యాధి లక్షణాల వల్లనే కాబోలు..గత తొమ్మిది సంవత్సరాలుగా దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి పరిణామాలను చూడలేక కొందరు నాయకులు కండ్లు మూసుకునే ఉంటున్నారు. అదేమి విచిత్రమో గాని వీరికి చైనాను చూస్తే కండ్లు ఎర్రబడుతున్నాయి. అవినీతిపరులు, ఆర్థిక నేరస్థులు, హంతకులు, లైంగికదాడులు చేస్తే ..వారిని చూసి కోపమూ రావటంలేదు.కండ్లూ ఎర్రబడడం లేదు.
ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్న కమలనాథులు కూడా అచ్చం కండ్ల కలక వచ్చిన వారి మాదిరిగానే ప్రవర్తిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను చూసినా, హక్కుల కార్యకర్తలను చూసినా, ప్రశ్నించే గొంతుకలను చూసినా వారి కండ్లు ఎర్రబడుతున్నాయి. మతోన్మాద శక్తులు విజృంభించి విద్వేషాలను రెచ్చగొడుతుంటే…అవి ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వేగంగా వ్యాప్తి చెందుతూ మత సామరస్యాన్ని దెబ్బ తీస్తుంటే కండ్ల కలక వచ్చిన వారి మాదిరిగా కండ్లు మూసుకొని తమకేమీ పట్టనట్లు చూస్తూ కూర్చుంటున్నారు. దేశంలో దారుణాలు జరుగుతుంటే వాటికి అడ్డుకట్ట వేయాల్సింది పోయి మొసలి కన్నీరు కారుస్తూ అచేతనంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు మణిపూర్‌లోనూ, ఇటీవల హర్యానాలోని నూV్‌ాలోనూ మతోన్మాదం పెచ్చరిల్లితే చిద్విలాసంగా చూస్తూ మిన్నకుండిపోతున్నారే తప్ప చట్టసభలో కనీసం నోరు విప్పలేకపోతున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ సైతం కండ్ల కలక సోకిన వ్యక్తి మాదిరిగా ప్రవర్తించడం విచారకరం. దేశంలో మతాలు, జాతుల మధ్య మారణహోమం సాగుతుంటే కండ్లు ఉండీ చూడలేకపోతున్నారు. ఇప్పటి వరకూ పార్లమెంటులో కనీసం ప్రకటన కూడా చేయలేకపోయారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తున్న ప్రధాని, దేశంలో చెలరేగుతున్న హింసపై మాత్రం మౌనం వీడడం లేదు. పెదవి విప్పకపోవడానికి కారణం…జరుగుతున్న దారుణాలకు ఆయన వద్ద సమాధానం లేకపోవడమే. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, కీలక నేతలు సైతం ఆయన మార్గాన్నే అనుసరిస్తున్నారు. రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలలో పర్యటించి, అనేక ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విసుగూ విరామం లేకుండా హాజరవుతున్నారు. కొత్త రైళ్లకు పచ్చ జెండాలు ఊపి ప్రారంభిస్తున్నారు. పార్లమెంటులో మాత్రం ప్రతిపక్షాలను ఎదుర్కోలేక తడబడుతున్నారు. మోడీ భయపడుతున్నాడు. ప్రతిపక్షమన్నా, పార్లమెంటన్నా, ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నా అతనికి భయం. క్లిష్టమైన సమస్యలు తలెత్తిన ప్రతిసారీ పలాయనం చిత్తగిస్తారు. అవును తప్పులు చేసే వాడికి భయం ఎక్కువ కదా..! కండ్లలో విచ్ఛిన్నకలకలేర్పడినా కండ్లు కనపడవు. విద్వేషం చిమ్మే కండ్లు మూసుకుపోతాయి.