సాత్విక్‌, చిరాగ్‌ నయా చరిత్ర

– బిడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 1000 టైటిల్‌ కైవసం
– ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీ
– ఫైనల్లో వరల్డ్‌ చాంప్స్‌పై ఘన విజయం
జకర్తా (ఇండోనేషియా)
భారత బ్యాడ్మింటన్‌లో మరో మైలురాయి. డబుల్స్‌ స్టార్స్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ కెరీర్‌ తొలి సూపర్‌ 1000 టైటిల్‌తో నయా చరిత్ర సృష్టించింది. టైటిల్‌ పోరులో ప్రపంచ చాంపియన్లు చియ, యిక్‌లపై గెలుపొందిన సాత్విక్‌, చిరాగ్‌.. సూపర్‌ 1000 టైటిల్‌ సాధించిన భారత తొలి డబుల్స్‌ జోడీగా రికార్డు సృష్టించారు.
ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌
జకర్తాలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ భారత బ్యాడ్మింటన్‌కు మరో చారిత్రక టైటిల్‌ విజయాన్ని అందించింది. కెరీర్‌లో తొలిసారి సూపర్‌ 1000 ఫైనల్స్‌కు చేరుకున్న భారత మెన్స్‌ డబుల్స్‌ స్టార్స్‌.. టైటిల్‌ పోరులో ప్రపంచ చాంపియన్లు, మలేషియా స్టార్స్‌ అరోన్‌ చియ, సో వీ యిక్‌లపై వరుస గేముల్లోనే గెలుపొంది అదరగొట్టారు. 43 నిమిషాల మెగా ఫైనల్లో మలేషియా జోడీపై 21-17, 21-18తో గెలుపొందిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీ ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ మెన్స్‌ డబుల్స్‌ చాంపియన్స్‌గా అవతరించి, చారిత్రక విజయం నమోదు చేశారు. బిడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 300 (సయ్యద్‌ మోడి), సూపర్‌ 500 (థారులాండ్‌, ఇండియా ఓపెన్‌), సూపర్‌ 750 (ఫ్రెంచ్‌ ఓపెన్‌) సహా సూపర్‌ 1000 (ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌) టైటిళ్లు సాధించిన తొలి భారత షట్లర్లుగా సాత్విక్‌, చిరాగ్‌ సరికొత్త చరిత్ర లిఖించారు. ఆసియా చాంపియన్స్‌గా కొనసాగుతున్న సాత్విక్‌, చిరాగ్‌ జోడీ.. కామెన్‌వెల్త్‌ గేమ్స్‌ పసిడి, థామస్‌ కప్‌ స్వర్ణం సహా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సైతం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
వరుస గేముల్లోనే.. : సాత్విక్‌, చిరాగ్‌లకు తొలి సూపర్‌ 1000 టైటిల్‌. ప్రత్యర్థి ప్రపంచ చాంపియన్స్‌, రెండో సీడ్‌ అరోన్‌ చియ, సో వీ యిక్‌లు. మలేషియా జోడీపై ముఖాముఖి రికార్డు 0-8తో మరీ పేలవం. ఈ పరిస్థితుల్లో సహజంగానే సాత్విక్‌, చిరాగ్‌లు టైటిల్‌ పోరులో అండర్‌డాగ్‌గా బరిలో నిలిచారు. తొలి గేమ్‌ ఆరంభంలో తడబాటుకు గురైన సాత్విక్‌, చిరాగ్‌ విరామ సమయానికి పుంజుకున్నారు. 11-9తో ఆధిక్యంలో కొనసాగారు. ద్వితీయార్థంలోనూ సాత్విక్‌, చిరాగ్‌లకు ఎదురులేకుండా పోయింది. మలేషియా స్టార్స్‌కు చెక్‌ పెట్టిన మనోళ్లు వరుసగా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలో నిలిచారు. 21-17తో తొలి గేమ్‌ను గెల్చుకున్నారు. ఆరంభంలో 3-7తో నాలుగు పాయింట్ల వెనుకంజలో నిలిచినా.. వరుసగా ఆరు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సాత్విక్‌, చిరాగ్‌ అదే దూకుడు తర్వాత కొనసాగించారు. ఇక రెండో గేమ్‌లో ఆరంభంలో మలేషియా జోడీ కాస్త వెనుకంజ వేసింది. కానీ తొలి గేమ్‌లో సాత్విక్‌, చిరాగ్‌ తరహాలో చియ, యిక్‌లు పుంజుకోలేదు. 11-7తో విరామ సమయానికి ఆధక్యం సాధించిన సాత్విక్‌, చిరాగ్‌.. ఆ తర్వాత పట్టు సాధించారు. 21-18తో రెండో గేమ్‌తో పాటు చారిత్రక సూపర్‌ 1000 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. 2017 నుంచి అంతర్జాతీయ సర్క్యూట్‌లో చియ, యిక్‌లపై సాత్విక్‌, చిరాగ్‌లకు ఇదే తొలి విజయం కావటం గమనార్హం.
శాట్స్‌ చైర్మెన్‌ అభినందనలు : ఇండోనేషియా ఓపెన్‌ మెన్స్‌ డబుల్స్‌ విజేతలుగా నిలిచిన సాత్విక్‌, చిరాగ్‌ జోడీకి తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అభినందనలు తెలిపారు. ఫైనల్లో బలమైన ప్రత్యర్థి, వరల్డ్‌ చాంపియన్స్‌ను మట్టికరిపిస్తూ సాధించిన విజయం యువతకు స్ఫూర్తిదాయకమని, సాత్విక్‌-చిరాగ్‌లు ఒలింపిక్‌ పసిడి సైతం సాధిస్తారనే విశ్వాసం కలిగిందని ఆంజనేయ గౌడ్‌ ఓ ప్రకటనలో తెలిపారు