మానవ జీవితంలో కవిత్వం అనేక పార్శ్వాలను దృశ్యీకరిస్తుంది. అలా దృశ్యంగా నిర్మించడం అందరి కవులకూ సాధ్యం కాదు. సుసంపన్నమైన, అసమానతలులేని మానవీయ సమాజాన్ని నిర్మించాలని కవి తపన పడ్తాడు. అలా అందరూ ఉండకపోవచ్చు. కొందరికే సాధ్యం. కవిత్వానికి శిల్పసొగసులద్ది, వైవిధ్యవస్తు అభరణాలను అలంకరించి, భావుకత కూడిన పదచిత్రాల వెలుతురు నీడలో కవిత్వానికి నిత్య సౌరభాలు నింపిన కవి గుంటూరు శేషేంద్ర శర్మ.
తెలుగు కవిత్వాన్ని ఖండాంతరాలకు తీసుకెళ్లి కవిత్వ వైభవాన్ని చాటిచెప్పిన కవి శేషేంద్ర. తొలుత సాంప్రదాయ కవిత్వం రాసినప్పటికీ కాలానుగుణంగా సామాజిక సమస్యలను ఆకళింపు చేసుకుని ‘మనిషి’ కేంద్రంగా సముద్రమంత కవిత్వాన్ని రాసి, భారతీయ సాహిత్యంలో గొప్ప కవిగా నిలిచిన కవి శేషేంద్ర. కవిత్వంలో అనేకానేక మార్పులకు శ్రీకారం చుట్టిన కవుల్లో ముందువరసలో ఉన్నవారు శేషేంద్ర. వచనకవితలో కావ్యవస్తువుతో పాటు రీతి కూడా మారాలని వాదించి తెలుగు కవిత్వాన్ని కొత్తపుంతలు తొక్కించిన కవి ఈయన. ప్రత్యేకించి చెప్పాలంటే శేషేంద్రది ఒక కవిత్వ తాత్వికయుగం. అధునిక కవిత్వ వికాసమంతా శేషేంద్ర కవిత్వంతో ముడిపడివుంది. ఆయన కవనం పట్టాక కవిత్వం రూపం, స్వరూపం మారిపోయింది. శేషేంద్ర చెప్పినట్టే అదుగో ఉదయించే దిక్కు, దానికే హృదయపూర్వకంగా మొక్కు అన్న స్థితిని తీసుకొచ్చాడు. ఆధునిక మహాభారతం, జనవంశమ్, సొరాబు, వచ్చింది ఓట్ల ఋతువు వరకు కూడా సాహిత్యచరిత్రలో సుదీర్ఘ అధ్యాయం. అందుకే ఆయనదొక యుగం అనాల్సి వస్తుంది. కొన్ని సంవత్సరాలపాటు అనో.. లేదా రెండుమూడు దాశాబ్దాలనో ఆయన కవిత్వ పరిణామాన్ని అంచనా వేసి సమాజానికందించే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పటం కూడా సహేతుకం కాదనిపించింది. కలం పట్టింది మొదలు ఆఖరి అక్షరం పురుడుబోసుకునే దాకా కవిత్వాన్ని కొత్తపుంతలు తొక్కించాడు.
వర్తమాన వచన కవిత్వంలో అనేక కవిత్వప్రక్రియలు పురుడుబోసుకున్నాయి. నేటితరం వర్ధమాన, వర్తమాన కవులు ఆ కవిత్వ ప్రక్రియల నాడి పట్టుకుని కవిత్వక్షేత్రంలో పచ్చని కవిత్వపంట పండిస్తున్నారు. ఈనాడు కవిత్వంలో మినీ కవితలని, నానీలని, హైకూలని, రెక్కలని, వ్యంజకాలని ఇలా చాలా ప్రక్రియలు పురుడు బోసుకున్నాయి. ఈ సరికొత్త ఆధునిక ప్రక్రియలు ప్రారంభించిందెవరైనా నేటితరం కవులు మాత్రం ఆ కవిత్వ ప్రక్రియలను ఆవాహనం చేసుకుని ఆ ప్రక్రియల్లో రాస్తున్నారు, రాణిస్తున్నారు. అయితే వాటి మూలాలు మాత్రం ఎవరూ స్పష్టంగా చెప్పలేదు. కాస్త లోతుల్లోకి వెళ్తే..
అల్పాక్షరాల్లో అనల్పార్థ రచన ఏ కాలంలోనైనా కవిత్వానికి అవసరమే. చాటువులు, శతకాలూ ఇంకా ఎన్నో చిన్న పద్యాలు, ముక్తకాలు పూర్వ సాహిత్యంలో వున్నాయి. ఆధునిక నాగరికతలో వేగం పెరిగిపోయింది. సుదీర్ఘమైన రచనలను ఆస్వాదించటానికి సామాన్యులకు అవకాశం అంతగా లేకపోవటం వలన సాహితీ ప్రక్రియల్లో కొన్ని మార్పులు వచ్చాయి. నవలతోపాటు ‘నవలిక’, కవిత్వంతో పాటు ‘మినీ కవిత’ వ్యాప్తిలోకి వచ్చాయి. చిన్నచిన్న కవితలు పూర్వకాలంలో కూడా వున్నా, ఆ పేరు ఇటీవల వచ్చిందే. మొట్టమొదట ఈ పేరు ఎవరు ఉపయోగించారో తెలియదుగానీ, పత్రికల ప్రచారం వలన ఈ ప్రక్రియ కొద్దికాలంలో ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. ‘మినీ కవిత’ అంటే పొట్టిగా, క్లుప్తంగా పుండే కవిత మాత్రమే కాదు, మరికొన్ని విధాలుగా కూడ దీన్ని గుర్తించవచ్చు. నిగూఢమైన భావాన్ని కొద్ది పంక్తులలో పొదిగి, ఒక రసవత్కావ్య ఖండికను చదివిన అనుభూతి కలిగించటం దీని ప్రత్యేకత. వ్యర్థపదం ఒక్కటీ లేకుండా, చెప్పదలచిన భావం పూర్తయ్యాక గీతం పూర్తయిందా లేదా అని చూడక అక్కడే ఆపి వెయ్యటం ‘మినీ కవితలో’ కన్పిస్తుంది. పత్రికలలో ఖాళీ జాగాలను పూరించటానికి సంపాదకులు వీటిని స్వీకరించటంవల్ల, మినీ కవితలు విరివిగా వెలువడు తున్నాయి. వచన కవితా వైవిధ్యానికి తోడ్పడుతున్న రూపం ‘మినీ కవిత’. ‘మినీ కవితలు’ పద్యాల్లో, గేయాల్లోనూ వచ్చిన ఈ మాట వచన కవితల్లో వచ్చిన వాటికే సార్ధకమనిపిస్తున్నది.
మినీకవితల మూలాలు శేషేంద్ర కవిత్వంలో..
1972లో శేషేంద్ర జ్యోత్స్నా పర్వం రాశారు. జ్యోత్స్నా పర్వం ఒకటో సర్గలో మినీ కవితలు రాశారు. మొదటి కవితలో… ”ఎండలాంటి నా ఊహ శబ్దం మీద పడినది/ సుదీర్ఘంగా దాని నీడ శతాబ్దం మీద పడినది/ సూర్యుడు ఉదయం పూచిన పూలతో/ క్రీడిస్తున్నాడు/ వీరుడ్ని చూచి కాలం భయపడినది”
తెలుగునాట పద్యం రాజ్యమేలుతున్న కాలమది. ఆ కాలంలోనే మినీ కవితలు రాశారు. పై మినీ కవిత రిథమిక్‌గా సాగుతుంది. అందుకే మినీ కవిత్వ నిర్మాణం ఎలా ఉండాలో అలా ఆనాడే బీజం వేశారు. సామాజిక స్పృహ కన్నా సాహిత్య స్పృహ మాత్రమే ఉండాలని కాదు.. సామాజికత ఎంత బలంగా ఉండాలో 1974 వచ్చిన ‘మండే సూర్యుడు’ కవిత్వం చదివితే ఎవరికైనా అర్థమైపోతుంది. ఇందులో వర్గచైతన్యం, కళాత్మక అభివ్యక్తి, అన్నింటికీ మించి గొప్ప శిల్పం ఉంది. మండే సూర్యుడు రాసి యాభై ఏళ్ళు దాటినా కవిత్వసొబగులు, సువాసనలు అలాగే గుభాళిస్తున్నాయి. ఇందులో సామాజిక చైతన్యం నవతరం కవులను పిడికిలి బిగించి ఉద్యమం చేసేలా చేయగలిగింది. ఈ పరం రెండో సర్గలోనూ మినీ కవిత ఎలా ప్రారంభిస్తాడో చూడండి.. ”సంధ్యాకాల బాహువుల్లో ఇరుక్కుని/ ధరిత్రి/ సౌందర్యాలకు లొంగింది/ కోటలాంటి గుండెమీద/ ప్రేమ శతఘ్ని పేలింది”. (ఆధునిక మహాభారతం- రెండోసర్గ-తొలికవిత)
మరి మినీ కవితా ఉద్యమం దాదాపు 1980 తర్వాతనే అని చెబుతున్న పరిశోధకులు ఈ మూలాలను చూడలేదా? అప్పుడు శేషేంద్ర కవిత్వంలో లేడా? ఇంకా చెప్పాలంటే తెలిసినా దాన్ని పరిగణనలోకి తీసుకోలేదా? చాలామంది పరిశోధనా గ్రంథాల్లో పరిశీలించినపుడు శేషేంద్రకు తీరని అన్యాయమే చేశారనిపిస్తుంది. ఇప్పటి ప్రక్రియలకు మూలకర్తలు వీళ్ళే, సృష్టికర్తలు వీళ్ళే అని ప్రసంగాల్లో తమ పాండిత్యాన్ని వొకలబోస్తూ మాట్లాడేవాళ్ళు శేషేంద్ర మినీ కవిత్వాన్ని ఎందుకు పసిగట్టలేదు. ఆద్మీపర్వం శేషేంద్రజాలం పేరుతో 1985లో ఆంధ్రజ్యోతి వారపత్రిక ప్రచురించింది. ఆ కాలంలో వందలాది అభిమానులను ఆయన కవిత్వం ఒక సైన్యంలా చేయగలిగింది. సిద్ధాంత రీత్యా ఆయన భావజాలంతో విభేదించవచ్చేమో కాని, ఆయన కవిత్వంతో ఎవరు విభేదించినా కవిత్వలోనికి తీరని ద్రోహం చేసినవాళ్లమౌతాం. అసలు ఇవి మినీ కవితలు కావా..? ఆద్మీపర్వంలోని మొదటి సర్గ చూడండి.. ఎంత గొప్ప భావుకత, శిల్పం కనబడతాయో.. ఇందులో సామాజిక స్పృహ, సాహిత్య స్పృహ దర్శనమిస్తాయి. పరిశీలించండి..
”సూర్యుడ్నించి సూర్యుడికి/ ఇరవైనాలుగు గంటల దూరం/ మనిషి నుంచి మనిషికి/ రెండు గుండెలే దూరం/ ఆకాశం ప్రభాత వాయువుల చేతుల్లో/ ఊదా రంగు ముడతలు విప్పి/ తనని జెండాలా ఎగరేస్తోంది/ అడుగు!/ గ్రామం నుంచి సంగ్రామానికి/ ఎన్ని తుపాకుల దూరం/ వాడు ఒక్కొక్క జీవితపు పేలిక కోసం/ వాడికి ఉన్న రెండు చేతుల్తో యుద్ధం చేశాడు/ శాంతి రేవులు చేరే కోరికతో సముద్రాలు ఈదాడు/ ఆశల ఒడ్ల కోసం తెడ్లు లేని నావల్లో ప్రయాణించాడు./ అరే ఎప్పుడు తెలుసుకుంటావు/ ఇది భూగోళం! మానవుడి ఆస్తి”
1985 రాసిన మౌక్తిక పర్వమంతా కూడా మినీ కవితలమయమే కదా! ఈ మౌక్తిక పర్వమొకటి చాలు ఇప్పుడున్న కవిత్వ ప్రకియల మూలాలన్నీ కనబడతాయి. ఈయనను ఆదిపురుషుడు.. మూలపురుషుడు అనాలని నేను కోరుకోవడం లేదు. రావలసినంత ఖ్యాతి రాకుండా పోయిందనేదే బాధ. గమనించండీ మినీ కవితలు..
”కాలాన్ని నా కాగితం చేసుకుంటా/ దాని మీద లోకానికి ఒక స్వప్నం/ రాశి యిస్తా/ దాని కింద నా ఊపిరితో సంతకం చేస్తా/ సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు/ తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు/ పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు/ నేనెంతా.. ఒక పిడికెడు మట్టే కావచ్చు/ కానీ కలమెత్తితే నాకు/ ఒక దేశపు జెండా కున్నంత పొగరుంది.”
ఉదాహరణకు మాత్రమే ఇవి.. ఈ పర్వం నిండా మినీ కవితలే. ఆధునిక కవిత్వం పురుడుపోసుకున్న వివిధ కవిత్వ ప్రక్రియల నిర్మాణ రహస్యాలన్నీ ఈ వొక్క పర్వంలో కనబడతాయి. చాలా ప్రగతిశీల కవిత్వం రాసినా ఆయన్ని దూరం పెట్టారనిపిస్తుంది. బహుశా ఆయన ‘కవులు రాజకీయ పక్షాల నిరంకుశ ప్రజ్ఞలకు కట్టుబడి సాహిత్య స్పహను కోల్పోరాదని’ కవిసేన ద్వారా హెచ్చరించడమే కారణమని అనిపిస్తుంది. అంతేకాక రాజకీయవేత్త నినాదాల్లో కవిత్వం బందీ అయిపోయిందని బాధపడి ఒక కొత్త కవిత్వోద్యమాన్ని శేషేంద్ర ప్రారంభించడం మూలంగా దానికి ‘కవిసేన’ అని పేరు పెట్టి లోతైన కవిత్వవిమర్శ చేయడం వల్ల ఈ పరిణామాలనిపిస్తుంది. కవిసేన ద్వారా కవిత్వాన్ని ఒక మహాయుధంగా సామాజిక ప్రగతివాదులమని భావించే కవులపై ఝుళిపించారు. తొలుత సాంప్రదాయశైలిలో షోరాబ్, ఋతు ఘోష, పక్షుల కావ్యాలను రచించడమైనా కావచ్చు. ఆయనపై సాంప్రదాయక కవి ముద్ర ఉండటం వల్ల అన్యాయం జరిగి ఉండవచ్చు. వాస్తవానికి కావ్య వస్తువులో, కవితా శిల్పంలో మార్పు రావలసిన ఆవశ్యకతను గుర్తించి, సమకాలీక సమాజ సమస్యలను అవగాహన చేసుకొని వీరు వచన కవితకు మరలారని, ప్రకృతి పరిశీలనలో శేషేంద్ర శర్మ దృష్టి అమోఘమని కొంతమంది మాత్రమే చెప్పగలిగారు.
దేవతలే లేకుండా బ్రతకలేని జాతి మనది. పూజలనీ, భజనలనీ అస్తమానమూ భక్తులు పెట్టే బాధలు పడలేక దేవతలు మందిరాల్నించి పారిపోతున్నారు. నేడు భక్తుల్లో పెరుగుతున్న మహాభక్తి దేవతలకు జాతీయ సమస్యగా మారిందని తనే చెప్పారు. శేషజ్యోత్స్న, మండే సూర్యుడు నా దేశం, నా ప్రజలు సముద్రం, నా పేరు నీరై పారిపోయింది, గొర్రిల్లా, ప్రేమలేఖలు వంటి కావ్యాలు శేషేంద్రశర్మగారి కవితా సౌందర్యాన్ని ప్రతిబింబించే నిలువుటద్దాలని విమర్శకులు చెబుతూనే ఉన్నారు. కవిత్వం రాస్తే ఆయనలా రాయాలి లేకుంటే రాయనవసరం లేదని, కవిత్వాన్ని రాయడం మానేసి పాఠకులుగానే మిగిలిపోయిన కవులు తెలుగు రాష్ట్రాల్లో చాలామందే ఉన్నారు. చైతన్యం ముసుగు కింద వీరవిహారం చేస్తున్న శిల్పరహిత అకవిత్వ మలినాన్ని దేశంనుంచి క్షాళనం చెయ్యాలన్నదే శేషేంద్ర సంకల్పమని, శిల్ప రహితమైన కవిత్వం త్వరలోనే తన తేజస్సు కోల్పోతుందని గొప్ప విమర్శ చేయడం తెలుగు సాహిత్య చరిత్రలోనే నూతన అధ్యాయం. శేషేంద్ర సాహిత్యమంతా ప్రయోగాల మయమే. తెలుగులో గజల్ సాధ్యం కాదన్నారు. సాధ్యం చేసి చూపించాడు. చంధస్సుల్లోనూ, ఆశ్చర్యకరమైన చమత్కారికల్లోనూ ప్రయోగాలు చేశాడు. వేమన ఆటవెలది చేసినట్టు సంస్కృతంలోని చంధస్సు ప్రయోగంతో కావ్యాలు రచించినట్లు ఈయన అనేకానేక ప్రయోగాలు చేశాడు. ఎట్లా చెప్పావన్న దానిపైనే కవిత్వ విలువలుంటాయన్న శేషేంద్ర చిరస్మరణీయుడు.
– కెంగార మోహన్, 9493375447