మల్లారెడ్డి మురళీమోహన్ ‘నిశాచరుడి దివాస్వప్నం’ పేరుతో ఈ మధ్యకాలంలో ఓ కవితా సంపుటిని వెలువరించారు. వీరు కార్టూనిస్ట్ కూడా. వీరి వ్యంగ్యాత్మక ధోరణిలోని బొమ్మలు చాలా మందిని విశేషంగా ఆకర్షించాయి. వారు రాసిన ‘రాత్రి’ అనే కవితను పరిశీలిద్దాం.
కవులు ‘రాత్రి’ అనే అంశం మీద రాసినప్పుడు బాగా రాణించే అవకాశముంది. రాత్రిని ప్రతీకగా చేసుకొని చెప్పేవారు కొందరయితే, రాత్రితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకునే వారు మరికొందరు. రాత్రిని బాధామయంగా వర్ణించే వారు కొందరయితే, రాత్రిని భావుకతతో వర్ణించే వారు మరికొందరు. రాత్రికి రంగులను ఆపాదించే వారూ లేకపోలేదు. రంగుల భ్రమలను తొలగించడానికి మురళీమోహన్ రాసిన కవిత ఈ ‘రాత్రి’. కొంతమంది కవులు ఎత్తుగడలో ఏం చెబుతామనుకుంటున్నారో చాలా వరకు చెప్పేస్తారు. కొంతమంది కవులు ఎత్తుగడ నుండి ముగింపు దాకా చెప్పాల్సిన విషయానికి సంబంధించిన తాడును వదులుతుంటారు. ఈ కవి రెండవ కోవకు చెందినవారు. చిక్కదనాన్ని ఎక్కడా తగ్గించకుండా కవితను నిర్మిస్తారు. ఈ శిల్పాన్ని సాధించాలంటే సాధన అవసరం. కొన్ని కవితలకు ఈ నిర్మాణం మినహాయింపే. పగలు, రాత్రులను ప్రతీకలుగా చేసుకొని కవితను ప్రారంభించారు. పొద్దంతా కష్టపడి పనిచేసి పొందిన అలసటను, కష్టనష్టాలను ‘పగలు’గా తీసుకొని, ప్రశాంతంగా ఇంట్లో హాయిగా గడిపే క్షణాలను ‘రాత్రి’ గా చెప్పుకొచ్చారు. ఇక్కడ కవిని ఎందుకు అభినందించాలి అంటే కొత్తగా వ్యక్తీకరించటంలో విజయం సాధించారు. ఈ విషయాలను సరాసరిగా రాస్తే వాక్యమయ్యే ప్రమాదముంది. ప్రతీకల్లోకి మార్చి కవిత్వంగా కూర్చటం వీరి నిపుణత.
చుక్కలను విజయానికి ప్రతీకగా తీసుకొని చెబుతుంటాం. ఈ వాక్యాల్లో కూడా కవి ఆ దష్టికోణంలోనే తీసుకున్నారు. ఓ సందర్భంలో సినారే జీవన రహస్యాలను విప్పి చెబుతూ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాధించే విజయం తప్తినివ్వదు అంటారు. వారన్నట్టు మనిషి జీవితంలో రాత్రి లాంటి బాధామయ జీవితం ఉంటేనే చుక్కలుగా ఎదగటానికి అవకాశముంటుంది. రాత్రి అనేది చుక్కల పక్కన ఉంటేనే చుక్కలకు ప్రాధాన్యత. ప్రాధాన్యత గల ఈ విషయాన్ని రెండు లైన్లలో విస్తతమైన అర్థం వచ్చే విధంగా కూర్చటం కవి ప్రతిభ. శబ్దానికి, నిశబ్దానికి మధ్య ఉండే తేడాను తెలియజేస్తూ, పగలును బొమ్మలా రాత్రిని బొరుసులా అభివర్ణిస్తూ జీవన తాత్త్వికతను పట్టుకొచ్చారు. కవి ఉద్దేశం ఈ ప్రపంచమంతా పగలుతోనే కుస్తీ పడుతుందని. సేద తీరేది రాత్రిలోనేనని. ఆరోగ్యపరంగా, మానసికంగా ఒత్తిడిని జయించటానికి ఉపయోగపడేది రాత్రి ఇచ్చే ప్రశాంతతే. రాత్రి మనిషి జీవితంలో ఎంత ప్రభావవంతమైనదో ఈ కవిత తేల్చి చెబుతుంది.
ప్రపంచాన్ని ఎప్పుడు రంగులమయంగా, సంతోషం గానే ఊహించుకోవటం జీవితంలో అనుభవంలేని తనమే. ఎప్పుడూ మంచే జరుగుతుందని అనుకోవటం భ్రమే. అందుకే కవి రాత్రిని పరిచయం చేస్తున్నాడు. రాత్రి అనేది ఒకటుందని మనం తెలుసుకోగలిగితే పగలును ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థమవుతుంది. కవి అందుకే రంగుల భ్రమలను తొలగిస్తున్నాడు. కవులకు రాత్రి ఎంతో పసందైనది. వాక్యం తిప్పటంలో చాలా అనుకూలిస్తుంది. అందుకు కారణం శబ్దలేమి. ప్రశాంతత ఆవహించటం. నిశాచరులకు రాత్రి ఓ స్వర్గం. ఈ కవి కూడా నిశాచరుడే. రాత్రులను పండిస్తున్నాడు. రాత్రి రంగున్న చిక్కటి కవిత్వాన్ని అల్లుతున్నాడు.
రాత్రి మీద ఎంత ప్రేముంటే ఒక దర్బారు పెట్టి రాత్రిని ఒక సింహాసనం మీద కూర్చోబెడతాడు. స్వప్నాలను పొదిగిన సింహాసనమిది. పగటి పూట ఏమీ సాధించక అలసిసొలసి పోయినవాడు రాత్రిపూట కలల్లో ఎన్నో సాధిస్తుంటాడు. కవి చెప్పినట్టుగా రాత్రి అనేది లేకపోతే అపజయం పొందేవారికి ఊరట ఎక్కడిది. రాత్రి ఓడిపోయినవారి గుండెల్లో వెలుగునిచ్చే రేపటి దీపం. పగలుతో బాటు రాత్రిని గుర్తించాల్సిన అవసరాన్ని కవి దశ్యమానం చేస్తున్నాడు. కవితంతా రాత్రి గురించే కానీ ఇందులో ప్రతీకల వెలుగులు చాలా ఉన్నాయి.
– డా|| తండ హరీష్ గౌడ్, 8978439551
రాత్రి
పగటి పగుళ్లు పూడ్చేందుకే
వస్తుంది రాత్రి
చుక్కల అస్తిత్వాన్ని నిలపడానికే
వస్తుంది రాత్రి
శబ్దాలని నిద్రపుచ్చి
నిశ్శబ్దాన్ని బతికించడానికే
వస్తుంది రాత్రి
ఇల ఇరుసుపై కాలచక్రానికి
పగలు బొమ్మయితే
బొరుసులా వస్తుంది రాత్రి
రంగుల భ్రమలు తుడిచేస్తూ
వర్ణరహితమై
వస్తుంది రాత్రి
నిశాచారులతో బాతాఖానీకై
నీరవాన్ని మోసుకుని
వస్తుంది రాత్రి
చీకటి దర్బారులో
స్వప్నఖచిత సింహాసనంపై
కూర్చునేందుకే వస్తుంది రాత్రి
– మల్లారెడ్డి మురళీమోహన్