రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘తల్లి మనసు’. వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మించిన చిత్రమిది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 24న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ముత్యాల అనంత కిషోర్ తెలియజేశారు. సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, ‘దర్శకుడిగా 50 చిత్రాలు తీశాను. అయితే సొంత చిత్ర నిర్మాణం మునుపు ఎన్నడూ చేయలేదు. మా పెద్ద అబ్బాయి అనంత కిషోర్ నిర్మాతగా ఓ మంచి చిత్రం తీయాలన్న అభిరుచి మేరకు ఈ సినిమాను సొంతగా నిర్మించాం. తల్లికి ఎన్ని నిర్వచనాలు ఇచ్చినా సరిపోవు. అలాంటి తల్లి సబ్జెక్ట్‌ని తీసుకుని, పాత్రలకు తగ్గ నటీనటులనే ఎంచుకుని ఈ సినిమాను తీశాం. కథలో, పాత్రలలో ప్రేక్షకులు పూర్తిగా నిమగమయ్యే విధంగా సినిమా వచ్చింది. ఇలాంటి మంచి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి’ అని అన్నారు. ‘ఓ తల్లి ఎలాంటి సంఘర్షణలకు గురయ్యిందన్న అంశాన్ని ప్రేక్షకులకు హత్తుకునేలా వైవిధ్యంగా చెప్పాం. భావోద్వేగం, సెంటిమెంట్, ఎంటర్‌టైన్మెంట్ వంటి అంశాల మేళవింపుతో చిత్రం ఉంటుంది. నిర్మాత అభిరుచి లేకపోతే ఇంత మంచి చిత్రం రాదు’ అని దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) చెప్పారు.