రేపే వైస్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం

రేపే వైస్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం– ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీఓ
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
ఆదిలాబాద్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ జహీర్‌ రంజానీపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస ప్రత్యేక సమావేశ నిర్వహణ గడువు సమీపించడంతో అధికారులు నిర్వహణ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఆదిలాబాద్‌ ఆర్డీఓ వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అవిశ్వాస ప్రత్యేక సమావేశం ఈ నెల 18న ఉదయం 11గంటలకు మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో జరుగనుంది. దీంతో మంగళవారం ఆయన తొలిసారిగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. అవిశ్వాస సమావేశం నిర్వహణ, మున్సిపల్‌ చట్టం నిబంధనలపై కమీషనర్‌ ఖమర్‌ అహ్మద్‌తో చర్చించారు. ఈ ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు వీలుగా అనుసారించాల్సిన భద్రత చర్యలపై డీఎస్పీ జీవన్‌రెడ్డి, కమీషనర్‌తో చర్చించారు. అవిశ్వాస తీర్మాణ సమావేశం రోజున కౌన్సిల్‌ సభ్యుల వాహానాలు, సెల్‌ఫోన్లను కార్యాలయంలోకి అనుమతించవద్దని వారికి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేలా తగు చర్యలు చేపట్టాలని ఆర్డీఓ సూచించారు. ఆయన వెంట వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ, ట్రాఫిక్‌ సీఐ ప్రణరు ఉన్నారు.