కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈనెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్‌ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘మూడు తరాలు నన్ను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. భారతీయుడు రిలీజ్ అయినప్పుడు ఈ సీక్వెల్ గురించి ఆలోచించలేదు. భారతీయుడు భారీ హిట్ అయింది. డబ్బులు వస్తాయా? అని అందరూ అన్నారు. కానీ ఇప్పుడు ఒక షెడ్యూల్‌కి పెట్టే ఖర్చే చాలా ఎక్కువగా ఉంది. శంకర్ విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో తెలుగు సినిమాకు గొప్ప స్థానం ఉంది. నా జీవితంలోనూ తెలుగుకి గొప్ప స్థానం ఉంది. ‘ఇండియన్ 2′ ఇప్పటి తరానికి రిలవెంట్‌గా ఉంటుంది. జనాల గురించే ఈ చిత్రం మాట్లాడుతుంది. ఇది ప్రజల సినిమా. 28 ఏళ్ల తరువాత మళ్లీ అదే దర్శకుడు, అదే పాత్ర నాకు రావడం అదష్టం. మంచి క్వాలిటీతో సినిమాను తీశాం. అందరూ చూడండి. ఏసియన్ సురేష్, శ్రీలక్ష్మీ మూవీస్ మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 12 కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
”భారతీయుడు’ అయిన తరువాత చాలా సినిమాలు తీశాం. లంచం తీసుకునే వార్తలు చూస్తూనే ఉంటున్నాను. ఆ వార్తలు చూసినప్పుడల్లా నాకు సేనాపతి గుర్తుకు వస్తుంటాడు. ‘భారతీయుడు 2’ సినిమా సెట్‌లోకి సేనాపతిగా కమల్ హాసన్‌ని చూసి నాకు ఒక గూస్‌బంప్స్ వచ్చాయి. ఆడియెన్స్‌కి కూడా అలాంటి ఫీలింగే వస్తుంది. నేను రాసిన దాని కంటే.. ఆయన నటించిన తరువాత సీన్ స్థాయి పదింతలు పెరుగుతుంది. అలాంటి నటులు దొరకడం అదష్టం. ‘బార్సు’ సినిమాతో సిద్దార్థ్‌ను నేను పరిచయం చేశాను. ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. రకుల్ ప్రతీ సీన్‌ను తెలుసుకుని, అర్థం చేసుకుని నటించారు. ఎస్ జే సూర్య ఎంత చేసినా సంతప్తి అవ్వరు. బాబీ సింహా ప్రాణం పెట్టి నటించారు. సముద్రఖని వాయిస్ నాకు చాలా ఇష్టం. ఆయనలో ఓ డిగ్నిటీ కనిపిస్తుంటుంది. నేను బ్రహ్మానందంకి అభిమానిని. ఇందులో కేమియో రోల్‌లో కనిపిస్తారు. కాజల్ పార్ట్3లో కనిపిస్తారు. అనిరుధ్ సంగీతం, రవి వర్మన్ కెమెరా వర్క్ బాగుంటుంది. ముత్తు గారు అద్భుతమైన సెట్స్ వేశారు. శ్రీకర్ ప్రసాద్ సీన్‌లోని ఆత్మ పోకుండా కట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా వచ్చాయి. తెలుగులో పాటలు అనుకున్నదాని కంటే బాగా ఇచ్చారు. నేను అనుకున్నది అనుకున్నట్టుగా తీసేలా సహకారం అందించిన లైకా సుభాస్కరణ్, రెడ్ జెయింట్‌లకు థ్యాంక్స్’ అని డైరెక్టర్ శంకర్ చెప్పారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, ‘శంకర్ సినిమాలో మెసెజ్ ఎంతో గొప్పగా ఉంటుంది. నేను రాసిన పాట మూడో పార్టులో ఉంటుంది. ఈ రెండో పార్ట్ పెద్ద హిట్ అవుతుంది’ అని చెప్పారు.