పోలీసుల పవరేంటో తెలిపే సినిమా

A movie about the power of the police‘మగధీర’తో సహా పలు దక్షిణ భారతీయ చిత్రాలలో విభిన్న పాత్రలు, విలక్షణ నటనతో అందర్నీ అలరించిన దేవ్‌గిల్‌ హీరోగా దేవ్‌ గిల్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అహో! విక్రమార్క’. పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్‌ 30న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇస్తూ మేకర్స్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను గమనిస్తే హీరో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నారని అర్థం అవుతోంది. సినిమా రిలీజ్‌ సందర్భంగా హీరో దేవ్‌ గిల్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో పోలీసుల ధైర్యం, అంకిత భావాన్ని గొప్పగా చూపించబోతున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆగస్ట్‌ 30 పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేస్తున్నాం. ఇప్పటి వరకు నాలోని నటుడిని ఓ కోణంలో చూసిన ప్రేక్షకులు ఈ సినిమాతో మరో కోణాన్ని వెండితెరపై చూస్తారు’ అని తెలిపారు. ‘ఈ సినిమా పోలీసుల పవర్‌ను తెలియజేస్తుంది. సినిమాని అనుకున్న ప్లానింగ్‌ ప్రకారం రూపొందించాం. ఫస్ట్‌లుక్‌, టీజర్‌లకు చాలా మంచి స్పందన వచ్చింది. దేవ్‌గిల్‌ను సరికొత్తగా చూస్తారు’ అని దర్శకుడు పేట త్రికోటి చెప్పారు. షాయాజీ షిండే, ప్రవీణ్‌ తార్డే, తేజస్విని పండిట్‌, చిత్ర శుక్లా, ప్రభాకర్‌, విక్రమ్‌ శర్మ, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు : ఆర్తి దేవిందర్‌ గిల్‌, మీహిర్‌ కుల్జర్ని, అశ్విని కుమార్‌ మిశ్రా, కథ :పెన్మెత్స ప్రసాద్‌ వర్మ, సంగీతం : రవి బస్రూర్‌, ఆర్కో ప్రవో ముఖర్జీ, కెమెరామెన్‌ : కరమ్‌ చావ్లా, గురుప్రసాద్‌.ఎన్‌, ఎడిటర్‌ : తమ్మిరాజు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: కార్తీక్‌ విధతే, స్టంట్స్‌: రియల్‌ సతీష్‌.