నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా హీరో నవీన్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ, ‘దర్శకుడు శ్రీకాంత్ నాగోతితో ఇది నాకు రెండవ సినిమా. కథ, పాత్రలు సహజత్వంతో ఉంటాయి. నా పాత్ర పేరు మధుసూధనరావు. చదువుకున్న రోజుల్లో ఫ్రెండ్స్ అతన్ని హీరోలా చూస్తుంటారు. మందు, సిగరెట్‌కి అలవాటు పడిపోతాడు. ఒకరి కింద ఉద్యోగం చేయాలని ఉండదు. తనకి డబ్బు పై కూడ ఆశ లేదు. తనకి ఏ లక్ష్యం ఉండదు? ఏ బాధ్యత తీసుకోడు. చిన్నప్పటి నుంచి అందరూ ఒక హీరో ఇమేజ్‌తో చూడటంతో అందులోనే ఉండిపోతాడు. ఇందులో మధుమతి పాత్ర యుఎస్ ఎన్ఆర్ఐ. మంత్ ఆఫ్ మధు అంటే ఇద్దరం. ఆ అమ్మాయికి ఇచ్చిన ఒక నెల.. ఈ నెలలో తనతో నా పాత్ర స్నేహం, దీంతో స్వాతితో పాటు మా ఇద్దరి జీవితాలు ఎలా మారాయనేది కథ. ప్రస్తుతం శంకర్ ‘గేమ్ ఛేంజర్’తోపాటు మరో 8 సినిమాల్లో నటిస్తున్నాను’ అని చెప్పారు.