ఒకప్పుడు సినిమాలు ప్రజలకు వినోదాన్ని, కొంత విజ్ఞానాన్ని కూడా ఇచ్చేవి. సినిమా ఒక ఖరీదైన కళగా ఉండి ప్రజల్లో ఒక ఆకర్షణగా కూడా ఉండేది. ఇప్పుడు ఆ ఆకర్షణ వెర్రిగా మారింది. మిగతా కళలు, హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, డోలు దెబ్బ, తోలుబొమ్మలాట, వీధి నాటకం, నాట్యం, సంగీత ప్రదర్శనలు ఇలాంటివన్నీ ఏ ఇబ్బంది లేకుండా తమ తమ ప్రేక్షకులను కలిగిఉండేవి. స్వాతంత్య్ర పూర్వం, ఆ తర్వాత కొన్ని ప్రజాకళల్ని ఉద్యమాలు పోషించాయి. చాలావరకు కళలు సినిమాల్లో కలిసిపోయాయి. (పుత్తడిబొమ్మ పూర్ణమ్మ) ఇలాంటివి సినిమాల్లో ప్రదర్శించి వాటిని బయటికంటే ఆకర్షణీయంగా చూపగలిగారు. సినిమాకు ఒక వెసులుబాటు ఉంది. తీరిగ్గా స్క్రిప్టు రాసుకుని ప్రతిష్టులైన కళాకారులను ఎంచుకొని, సంగీతాన్ని శ్రేష్టమైన పద్ధతిలో కూర్చుకుని, చక్కగా ఎడిట్ చేసి ప్రదర్శించటానికి వీలుగా ఉంటుంది. కానీ అది రానురానూ వ్యాపార ధోరణిగా మారింది. క్రేజ్ పేరుతో, ట్రెండ్ పేరుతో తమ లాభాల కోసం విస్తృతంగా ప్రమోషన్లకు కొత్త పద్ధతులను ఎంచుకుంటోంది.
వాస్తవానికి సినిమాలు వినోదాలనివ్వాలి, కానీ విషాదాలు కాదు. ఈ మధ్యకాలంలో సినీ ఇండిస్టీలో భారీ పెట్టుబడులు పెట్టి నిర్మాణ సంస్థలు సినిమాలను తీస్తున్నాయి.ఈ సినిమాలకు హైప్ క్రియేట్ చేస్తూ ప్రచార ఆర్భాటాలను నిర్వహిస్తూ ప్రి రీలీజ్, ట్రైలర్ రీలిజ్‌ల పేరుతో భారీ సభలను జరిపి పెట్టిన పెట్టుబడికంటే రెట్టింపు ఆదాయం వచ్చేవిధంగా ప్రజల్లో విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సినిమాపై భారీ అంచనాలు వచ్చే విధంగా రిలీజ్‌కంటే ముందే టిక్కెట్లు అమ్ముడుపోయేలా బెనిఫిట్‌షోలు వేస్తూ ఇష్టారీతినా టిక్కెట్ల ధరలను పెంచుతున్నాయి. మూవీ నిర్మాణ సంస్థలు చేస్తున్న ప్రతిపాదనలకు తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు వంతపాడుతున్నాయి. ప్రజలపై, ప్రేక్షకులపై అదనపు భారాలు పడే విధంగా టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు, ప్రిమియర్‌షోలకు అనుమతులిస్తున్నాయి. ఈ షోలకు హీరోలు హాజరవ్వడం, తన అభిమాన నటుడు వస్తున్నాడని అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు రావడం, హీరోను చూడాలనే తపనతో ముందుకు పరుగెత్తడం, బౌన్సర్లు వారిని నెట్టేయడం, దీంతో తొక్కిసలాటలు జరగడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
అలాంటి ఘటనే ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగింది. పుష్ప2 ప్రీమియర్‌షోకు అల్లుఅర్జున్ రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ప్రేక్షకులను అదుపు చేయలేకపోయారు. దీంతో హీరోకు ప్రయివేటు సెక్యూరిటీగా వచ్చిన బౌన్సర్లు అందరినీ నెట్టివేయడంతో ఒకరిమీద ఒకరు పడ్డారు. వారిపై నుంచే వందలాది మంది ఉరుకులు, పరుగులు పెట్టడంతో రేవతి అనే మహిళ ఊపిరాడక చనిపోయింది. ఆమె కొడుకు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఈ కుటుంబ శోకం ఎవరు తీరుస్తారు? తమ అభిమాన నటుని సినిమా ఫస్ట్‌షో చూడాలనే కోరికతో తల్లిని వెంటబెట్టుకుని వచ్చిన పిల్లాడు ఇప్పుడు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుంటే చూసేవారి గుండె తరుక్కుపోతోంది. ఈ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు కావడం, జైలు కెళ్లడం, ఒక్కరోజులోనే బెయిల్‌పె విడుదలవ్వడంతో సినీ ఇండ్రస్టీ అంతా కదిలింది. ప్రముఖులంతా అల్లు అర్జున్ ఇంటికెళ్లి మరీ పరామర్శిస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి రేవతి కుటుంబానికి ఎందుకీ శిక్ష? ఆ కుటుంబాన్ని ఆదుకునేవారు ఎవరు? వారిని పరామర్శించేవారెవరు? రూ.25లక్షల పరిహారం ఆ కొడుక్కు తల్లి లేని లోటు తీరుస్తుందా? ఈ ఘటన జరిగాక హీరో అరెస్టుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌ను మీడియా ప్రశ్నిస్తే ‘ మనిషి చనిపోతే ఊరుకుం టామా? అరెస్టు చేస్తే తప్పేంటి? చట్టానికి అందరూ సమానమే.’ అన్నారు. వాస్తవమే కానీ, మరి ప్రీమియర్ షోలకు, టిక్కెట్ ధరల పెంపును ఎందుకు అనుమతులిచ్చినట్టు? ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం అధికార యంత్రాంగం వైఫల్యం కాదా? ఒకే ప్రాంగణంలో ఉన్న రెండు థియేటర్లకు సంబంధించిన సౌకర్యాలను పర్యవేక్షించారా? తగు హెచ్చరికలు చేశారా? రెండు థియేటర్లకు ఇన్, అవుట్ గేట్లు మాత్రమే ఉన్నాయి. మరి ప్రేక్షకులు ఎలా వెళ్తారు? ఎలా బయటకొస్తారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఇంకేలా ఉంటుంది పరిస్థితి. ఇప్పటి కైనా ప్రజలు మేల్కోవాలి. సినిమాను ఆదరిం చాలి, వీక్షించాలి. అందులోని మంచిని స్వీక రించి, చెడును వదిలేయాలి. కానీ, ప్రాణాలు పోయేంతగా విషాదం కాకూడదు.
– ఆనగంటి వెంకటేష్, 9705030888