లహరి ఫిల్మ్స్, చారు బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న సినిమా ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దీనికి దర్శకత్వం వహించడంతో పాటు ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 26న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరో, దర్శకుడు సుమంత్ ప్రభాస్ మీడియాతో మాట్లాడుతూ, ‘నేను చేసిన ‘పిల్ల పిలగాడు’ వెబ్ సిరీస్ చాలా మందికి రీచ్ అయ్యింది. దీంతో అనురాగ్, శరత్ పిలిచి మంచి కథతో వస్తే సినిమా చేస్తామన్నారు. నేను చెప్పిన కథ వాళ్ళకి నచ్చింది. దీంతో రైటర్, డైరెక్టర్‌గా సైన్ చేశాను. అయితే ఇందులో నేను చేసిన పాత్ర కోసం చాలా ఆడిషన్స్ చేశాం. కానీ ఎవరూ సరిగ్గా కుదరలేదు. షూట్‌కి వెళ్ళే పది రోజులు ముందు ఇందులో నటుడిగా చేరాను. ఇదంతా నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకం వలనే సాధ్యమైంది. సినిమాని సింక్ సౌండ్‌లో షూట్ చేశాం. ఊర్లో ఏం చేసినా ఫోకస్, ఫేమస్ అవ్వాలనే ఆలోచన ఉన్న కుర్రాళ్ళ కథ ఇది. అందుకే దీనికి మేమ్ ఫేమస్ అని టైటిల్ పెట్టాం. ఇందులో నటించిన అందరూ దాదాపుగా కొత్తనటీనటులే. చాలా క్లీన్ ఫిల్మ్ ఇది. ఫ్యామిలీ అంతా కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూసే సినిమా’ అని అన్నారు.