విఆర్‌పి క్రియేషన్స్ పతాకంపై పి.పద్మావతి సమర్పణలో సుమన్, అజరు ఘోష్, కిషోర్, వెంకట రమణ, ప్రగ్య నైనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జనం’. వెంకట రమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం ఫిలించాంబర్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో అజరు ఘోష్, నిర్మాతలు టి. రామసత్యనారాయణ, సాయి వెంకట్, దర్శకుడు వి.సముద్ర తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, ‘నేను నటించిన ‘నేటి భారతం’ కోవలో వస్తోన్న చిత్రమిది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కరప్షన్‌తో పాటు అన్యాయాలు, అక్రమాల గురించి చూపించే సినిమా. ఎలక్షన్స్ సమయంలో ఈ చిత్రం రావడం గొప్ప విషయం. ప్రజల్లో మార్పు రావాలని చెప్పే చిత్రం’ అని తెలిపారు. దర్శక, నిర్మాత పసుపులేటి వెంకట రమణ మాట్లాడుతూ, ‘నేను ఇందులో మాజీ నక్సలైట్‌గా, సుమన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా చేస్తున్నా. పార్ట్ 1 షూటింగ్ పూర్తయింది. పార్ట్ -2 త్వరలో ప్రారంభమవుతుంది. నిజాయితీకి.. ప్రజా స్వామ్యానికి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం. మా బ్యానర్‌లో నిర్మిస్తున్న 3వ చిత్రమిది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని అన్నారు.