సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై రోహన్ కులకర్ణి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘కైజర్’. వికాస్ చిక్బల్లాపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆదివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైన్మెంట్ డిస్ట్రీబ్యూటర్ ద్వారా అమెజాన్ ప్రైమ్, ఎమ్‌ఎక్స్ ప్లేయర్లలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డైరెక్టర్ వికాస్ చిక్బల్లాపూర్ మాట్లాడుతూ, ‘ఆటో డ్రైవర్ల కష్టాలు ఎలా ఉంటాయి?, వారిని ఆదుకోవడానికి రోహన్ కులకర్ణి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు?, రోకు యాప్ ఆటో డ్రైవర్లకు ఎలా ఉపయోగపడుతుందో ఈ సినిమాలో అద్భుతంగా చూపించాం. ఈ కథను ప్రతీ ఆటో డ్రైవర్‌కు చేరవేయాలనేదే మా సినిమా లక్ష్యం. సినిమాలో చాలా మంది రియల్ ఆటో డ్రైవర్లను చూపించాం, ఈ సిరీస్‌ను జనాల వద్దకు నేను తీసుకెళ్తా అని ముందుకొచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ అధినేత రాజీవ్‌కు ధన్యవాదాలు’ అని తెలిపారు. ‘డైరెక్టర్ వికాస్ ఒక నెలలోనే సినిమాని పూర్తి చేయడమంటే మాములు విషయం కాదు. దాన్ని వికాస్ సాధించి చూపించారు. రోహన్ రోల్ చేసిన రవి మహాదాస్యం చాలా నేచురల్‌గా చేశారు. సుశాంత్ ఆటో డ్రైవర్‌గా బాగా చేశారు. ఈ చిన్న చిత్రానికి పేరున్న నటులు కోటేశ్వరరావు, బీహెచ్‌ఎల్ ప్రసాద్ పెద్ద ఆస్తి’ అని స్టోరీ, స్క్రీన్ ప్లే రైటర్ సజన గోపాల్ చెప్పారు. హీరో రవి మహదాస్యమ్ మాట్లాడుతూ,’స్టోరీ విన్న వెంటనే చాలా బాగుంది చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. అయితే ఇంత తొందరగా సినిమా అయిపోయి ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకోలేదు. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ వికాస్‌కే ఇవ్వాలి. రోహన్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆయన గురించి తెలుసుకున్నాను. ఆయన చాలా సేవలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల కోసం యాప్‌ను తీసుకురావడమే కాదు, వారి పిల్లలను కూడా చదివించడం అంటే మాములు విషయం కాదు. ఈ సినిమా చూసిన తరువాత ఆటో వాళ్లను చూసే విధానం మారిపోతుంది’ అని అన్నారు. రోహన్ మాట్లాడుతూ,’కైజర్ అంటే రాజు అని అర్థం. సుభాష్ చంద్రబోస్‌ను హిట్లర్ కైజర్ అని పిలిచేవారు. అందుకే ఈ చిత్రానికి కైజర్ అని టైటిల్ పెట్టాం. సినిమా చాలా తొందరగా, ఇంత అద్భుతంగా రావడం వెనుక డైనమిక్ టీమ్ పని చేసింది. ఆటో డ్రైవర్ల బతుకుల్ని మార్చే సినిమాగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పారు. ‘రోహన్ నా కొడుకు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు అద్భతం చేసి చూపించాడు’ అని రోహన్ తండ్రి దేవ్ చెప్పారు.