చరిత్రలో నిలిచిపోయే సినిమా

A movie that will go down in historyవరుణ్‌ తేజ్‌ మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌ ఆర్‌ టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా వైజాగ్‌ లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ని ఘనంగా నిర్వహించారు.
హీరో వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ, ‘బర్మా నుంచి వైజాగ్‌ కి శరణార్థిగా వచ్చిన వాసు అనే కుర్రాడు కథ ఇది. ఒక మాస్‌ సినిమా చేద్దాం, అందరికీ నచ్చే సినిమా చేద్దామని భావిస్తున్నప్పుడు కరుణ కుమార్‌ ఈ కథతో వచ్చారు. తను అద్భుతమైన మేకర్‌. ఈ 14న ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. టార్గెట్‌ రెండు సార్లు మిస్‌ అయింది. ఈసారి మాత్రం గట్టిగా కొడతాను. నేను మామూలుగా మాటలు చెప్పే వ్యక్తిని కాదు. కానీ ఈసారి సినిమా చూసి, ఆ నమ్మకంతో చెప్తున్నాను’ అని అన్నారు.
నిర్మాత రామ్‌ తాళ్ళూరి మాట్లాడుతూ, ‘ఈ సినిమా తర్వాత పరిశ్రమలో వరుణ్‌ తేజ్‌ వన్‌ అఫ్‌ ది బిగ్గెస్ట్‌ మాస్‌ హీరో అవుతారు. డైరెక్టర్‌ ఎంతో రీసెర్చ్‌ చేసి కథ రాసుకున్నారు. టీం చేసిన హార్డ్‌ వర్క్‌ కి డెఫినెట్‌ గా ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’ అని చెప్పారు.
డైరెక్టర్‌ కరుణ కుమార్‌ మాట్లాడుతూ,’ వైజాగ్‌ కి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొంత పార్ట్‌ ని ఈ సినిమాగా చూపిద్దాం అనుకున్నాను. ఒక చిన్న మత్స్యకార గ్రామంగా మొదలై వైజాగ్‌ ఈరోజు ప్రపంచ పటంలో ఒక పవర్‌ హౌస్‌ గా నిలిచింది. ఇంత దూరం వచ్చిందంటే దీని వెనక చాలామంది మనుషులు ఉన్నారు. వైజాగ్‌ లో పుట్టి పెరిగిన వారి జీవితాలు చాలామందికి తెలియదు. ఆ జనరేషన్‌ ని మళ్ళీ ఒకసారి క్రియేట్‌ చేద్దామనుకున్నాను. వైజాగ్‌ లో సామ్రాజ్యాల స్థాపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్లందరి ఇన్స్పిరేషన్‌ గా తీసుకొని ఈ సినిమా చేశాను’ అని అన్నారు.
నిర్మాత డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల మాట్లాడుతూ,’మా బ్యానర్‌ లో జరిగిన ఫస్ట్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ‘హారు నాన్న’కి వైజాగ్‌ వచ్చాము. మీరు గొప్పగా ఆదరించారు. ఈ సినిమా నిన్ననే చూశాను. వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాకి ప్రాణం పోశారు. చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది. కరుణ్‌ కుమార్‌ చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశారు’ అని తెలిపారు.