సూర్య నటించిన పీరియాడిక్ చిత్రం ‘కంగువ’. శివ దర్శకుడు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, ‘తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిలో నేను సినిమాలు చేసేందుకు స్ఫూర్తినిచ్చింది హీరో సూర్య. ఆయన నటన, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ నాకు చాలా ఇష్టం. సూర్య మేకర్స్ కంటే స్టోరీస్‌ను సెలెక్ట్ చేసుకుని జర్నీ చేస్తున్నాడు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఈ సినిమాను చాలా రేర్ లొకేషన్స్‌లో సెట్స్ వేసి మరీ షూట్ చేశారు. మీరు పడిన కష్టం మేకింగ్ వీడియోలో తెలుస్తోంది. మీ టీమ్ కష్టమంతా సినిమా రిలీజ్ అయ్యాక విజయం రూపంలో ప్రతిఫలంగా దక్కుతుందని నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాను థియేటర్స్‌లోనే చూడాలి. అప్పుడే ఆ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని పొందుతారు’ అని అన్నారు. ‘రాజమౌళి మా అందరికీ ఒక గొప్ప దారి చూపించారు. మేము ఆ దారిలో ప్రయాణిస్తున్నాం. ‘కంగువ’ లాంటి స్పెషల్ మూవీ నాకు ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలు శివ, జ్ఞానవేల్‌రాజాకి థ్యాంక్స్’ అని హీరో సూర్య చెప్పారు.