గాడి తప్పిన పురపాలన.. ముసిరిన సమస్యలు

– స్వచ్ఛతకు మచ్చ… మళ్లీ పట్టణంలో పందులు
– అధికారులు, సిబ్బంది తలోదారి… పట్టించుకోని పాలకవర్గం
– పురపాలనపై కలెక్టర్ దృష్టి సారించేనా…?
నవతెలంగాణ – సిరిసిల్ల
పురపాలన గాడి తప్పుతుంది అనేక కారణాలతో సిరిసిల్ల మున్సిపల్ పాలన అస్తవ్యస్తంగా తయారైంది పట్టణంలో మళ్లీ పందులు స్వైర విహారం చేసి స్వచ్ఛతకు మచ్చ తెస్తున్నాయి. పురపాలక సంఘంలోని అధికారులు సిబ్బంది తలోదారిగా ఉన్నారు సిరిసిల్ల పురపాలక సంఘంలోని పాలకవర్గం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్ జా సిరిసిల్ల పురపాలక సంఘంపై దృష్టి సారిస్తేనే మళ్లీ గాడిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా పట్టణ అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి.
సిరిసిల్ల అభివృద్ధి ఆగింది..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అభివృద్ధి ఆగిపోయింది గత ప్రభుత్వంలో సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో రాష్ట్రస్థాయిలోనే సిద్దిపేట తర్వాత ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి వెనుకడుగు వేసింది పట్టణంలో ఏ వీధి చూసిన అపరిశుభ్రంగా కనిపిస్తుంది అయినా పురపాలక సంఘం అధికారులు సిబ్బంది పట్టించుకోవడం లేదు. దానికి తోడు పాలకవర్గం మాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో వందల కోట్లు అభివృద్ధి పనులకు గత ప్రభుత్వం వెచ్చించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలు పూర్తవుతున్న పట్టణ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు వెచ్చించలేదు. ఈ 8 మాసాల నుంచి సిరిసిల్ల శాసనసభ్యులు కే తారకరామారావు పట్టణాభివృద్ధికి నిధులు తీసుకురావడం లేదని ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఎమ్మెల్యే తారక రామారావు సిరిసిల్ల పట్టణం పై దృష్టి సారించి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు..
సిరిసిల్ల పురపాలక సంఘం గతంలో రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందంజలో ఉండడంతో పాటు అప్పుడు పని చేసిన మున్సిపల్ అధికారులు సిబ్బంది పట్టణం పై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం పని చేస్తున్న అధికారులు సిబ్బంది పట్టణమును అసలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. ప్రజలు అనేక సమస్యలతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన వారి సమస్యలు  తీర్చడం పక్కన పెడితే వినే వారు కూడా లేరని ప్రజలు పేర్కొంటున్నారు. పట్టణ సమస్యలు పట్టించుకోని కొంతమంది అధికారులు కొంతమంది సిబ్బంది అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడంలో మాత్రం రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. వీటంతటికి కారణం పాలకవర్గం పట్టించుకోకపోవడం తో పాటు కలెక్టర్ సిరిసిల్ల మున్సిపల్ పై దృష్టి సారించకపోవడమేనని తెలుస్తుంది.
సిరిసిల్లలో ఎక్కడ చూసినా సమస్యలే..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ చూసిన సమస్యలే కనిపిస్తున్నాయి ప్రధానంగా గణేష్ నగర్ బాల్యాల నగర్ తుకారావ్ పల్లి పెద్ద బోనాల చిన్న బోనాల శ్రీనగర్ కాలనీ లాంటి అనేక ప్రాంతాల్లో సిసి రోడ్లు మురుగు కాలువలు లేవు దీంతో పాటు అనేక ఖాళీ స్థలాల్లో నీటి నిలువలు పెరిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో నిధులు వెచ్చించి నిర్మాణాలు చేయకపోవడమే కాకుండా ప్రైవేటు ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు ఉన్న  స్థలాల యజమానులకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వడం లేదు. వీటితో దోమలు స్వైర విహారం చేసి పట్టణ ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు వేలాది రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చు చేస్తున్నారు. దీనికి ప్రధానంగా మున్సిపల్ కారమని ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో అప్పటి అధికారులు ఎంతో శ్రమించి పట్టణం నుంచి పందులను దూరం చేశారు. కానీ ప్రస్తుతం పందులు పట్టణంలో స్వైర విహారం చేస్తున్నాయి. మున్సిపాలిటీలో విలీనమైన పెద్దూరు చంద్రంపేట ముష్టి పెళ్లి రాజీవ్ నగర్ ప్రాంతాల్లోని పందుల సంచారం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది/ సిరిసిల్ల పట్టణ స్వచ్ఛతకు స్ఫూర్తిగా నిలుస్తూ జాతీయస్థాయిలో అనేక అవార్డులు సాధించిన ఈ సిరిసిల్ల ప్రస్తుతం పూర్తిగా వెనుకబడిపోయింది/ అంతేకాకుండా చెత్త సేకరణ వ్యవస్థ కూడా గాడి తప్పుతుంది ప్రధాన వీధుల్లో వేదిదీపాలు సైతం వెలగడం లేదు పట్టణ శివారు ప్రాంతాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. ఇలాంటి అనేక సమస్యలతో కార్మిక క్షేత్రం తల్లడిల్లుతోంది.