– బస్సు నుంచి విడిపోయిన వెనుక చక్రాలు
– ఓవర్‌లోడ్ కాదన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
– ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశం
నవతెలంగాణ-ఎల్కతుర్తి
హుజరాబాద్ నుంచి హన్మకొండ వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఒక్కసారిగా ఊడిపోయి సమీపంలోని పొలాల్లోకి చక్రాలు దూసుకెళ్లాయి. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఎల్కతుర్తి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించంలో బస్సులో ప్రయాణికులకూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి ప్రయాణీకులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలోకి చేరుకోగానే పెద్ద శబ్దంతో వెనుకటైర్లు బస్సు నుంచి ఊడిపోయాయి. దాంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును కంట్రోల్ చేసి ఓ పక్కకు ఆపారు. దాంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 80 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. 55 మంది వెళ్లాల్సిన ఈ బస్సులో అంతమందిని ఎక్కించుకోవడం గమనార్హం. కాగా, ఈ ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఓవర్‌లోడ్ వల్లనే ప్రమాదం జరిగినట్టు వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్టు చెప్పారు. డ్రైవర్ రాజు అప్రమత్తమై బస్సును వెంటనే ఆపడం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అద్దె బస్సుల నిర్వహణపై వాటి యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని, తరచూ తనిఖీ చేస్తూ బస్సులను ఎప్పుడూ ఫిట్‌గా ఉంచాలని సూచించారు.