వికృత క్రీడ

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గాని, శాశ్వత శత్రువులు గాని ఉండరు. ప్రజా సంక్షేమానికి, సమాజ హితానికి భంగం కలిగించనంత వరకు వాటిని ప్రజలు అంతగా పట్టించుకోరు. అధికారం కోసం, అవసరం కోసం సైద్ధాంతికంగా భిన్న ధృవాలున్న పార్టీలు స్నేహితులుగా… ఒకే ఆలోచనా విధానంతో ఉండే పార్టీలు శత్రువులుగా మారుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన్ననలందుకుంటున్న ఇండియాలో ఈ తరహా రాజకీయాలు గత దశాబ్ద కాలంగా ఎక్కువయ్యాయి. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనైతిక రాజకీయ క్రీడకు తేరలేపింది. ప్రాంతీయ ప్రభుత్వాలను కూల్చడం, ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం ద్వారా వారిని తమ దారికి రప్పించుకునే కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అనైతిక చర్యలకు పాల్పడుతోంది, నితీష్‌కుమార్‌లాంటి గోడమీది పిల్లులను అడ్డం పెట్టుకొని రాజకీయ చదరంగంలో పావులు కదుపుతోంది. భవిష్యత్తులో తమ ఉనికికి ప్రమాదకంగా మారుతారనే భయంతో ఢిల్లీలో కేజ్రీవాల్‌, జార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌లాంటి వారిపై అక్రమ కేసులను బనాయించి భయ భ్రాంతులకు గురిచేస్తోంది. బీజేపీయేతర రాష్ట్రాలపై ఆర్థిక ఆంక్షలు విధించండం, తమను ధిక్కరించే ప్రాంతీయ పార్టీలను రాజకీయంగా నిర్వీర్యం చేయడం లాంటి చర్యల ద్వారా స్థానికంగా వారిపై ప్రజల్లో వ్యతిరేకత రేకెత్తేలా కుట్రలకు పాల్పడుతోంది. అదే సందర్భంలో జాతీయత, దేశభక్తి, మతం ముసుగులో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాషాయ కూటమి అస్త్రశస్త్రాలను సంధిస్తోంది. ఈ వైకుంఠపాళిలో కాషాయదండు గెలుపు తమదేననే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కన్నుమిన్ను కానరాకుండా ప్రవర్తిస్తోంది. అయితే కాలం చాలా బలీయమైనది. దానికి ఎవరు అతీతులు కారు. ఇందిరాగాంధీ నుంచి మొదలుకొని కేసీఆర్‌ వరకు ‘నేనే రాజు నేనే మంత్రి’ అంటూ విర్రవీగిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. దశాబ్ద కాలంగా మోడీ బ్యాచ్‌ రాజకీయ వికృత క్రీడ నిశితంగా గమనిస్తున్న దేశ ప్రజలు రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం.
– ఊరగొండ మల్లేశం