సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తు న్నారు. సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా దర్శకుడు మల్లిక్ రామ్ మీడియాతో ముచ్చటించారు.
సిద్ధు, నేను ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టాం. మేమిద్దరం కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ‘నరుడా డోనరుడా’, ‘అద్భుతం’ అలాగే మధ్యలో పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ కూడా చేశాను. అది చాలా పెద్ద హిట్ అయింది. డీజే టిల్లు, అద్భుతం సినిమాలు ఇంచుమించు ఒకే సమయంలో వచ్చాయి. ఆ తర్వాత నేను, సిద్ధు కలిసి ఒక సినిమా చేయాలి అనుకున్నాం. అదే సమయంలో నాగవంశీ ‘టిల్లు స్క్వేర్’ చేస్తే బాగుంటుందని చెప్పడం, డీజే టిల్లు దర్శకుడు విమల్ కష్ణ ఇతర కమిట్ మెంట్స్‌తో బిజీగా ఉండటంతో నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను.
– సిద్ధు ఒక రచయితగా, నటుడిగా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో.. అంతవరకే ఇన్వాల్వ్ అవుతాడు. దర్శకుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను దర్శకుడికి ఇస్తాడు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇద్దరం చర్చించుకొని చేశాం. డీజే టిల్లు నచ్చినవారిని టిల్లు స్క్వేర్ ఏమాత్రం నిరాశ పరచదు.
– డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌కి వ్యత్యాసం ఉంటుంది. డీజే టిల్లు డెడ్ బాడీ నేపథ్యంలో సాగే బ్లాక్ కామెడీ. కానీ టిల్లు స్క్వేర్ అలా ఉండదు. ఒక కమర్షియల్ సినిమాలా ఉంటుంది. టిల్లు పాత్ర తీరు అలాగే ఉంటుంది. రాధిక పాత్ర ప్రస్తావన ఉంటుంది. మొదటి భాగాన్ని ముడిపెడుతూ కొన్ని సన్నివేశాలు ఉంటాయి. డీజే టిల్లుని గుర్తు చేస్తూనే టిల్లు స్క్వేర్ మీకొక కొత్త అనుభూతిని ఇస్తుంది.
– అనుపమ గొప్ప నటి. ఈ సినిమాలో లిల్లీ పాత్ర ఛాలెంజింగ్ రోల్. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లను పరిశీలించాం. కానీ అనుపమనే పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. అనుపమని బోల్డ్‌గా చూపించాలనే ఉద్దేశంతో లిల్లీ పాత్రను రాసుకోలేదు. లిల్లీ పాత్ర తీరే అలా ఉంటుంది. ఆ పాత్రకి ఆమె న్యాయం చేయగలదని నమ్మాం. ఆమె ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది. భవిష్యత్‌లో టిల్లు-3 వచ్చే అవకాశముంది.
ఈ సినిమాలో కొందరి స్వభావం ఎలా ఉంటుందో చూపించాం. కానీ ఇలా ఉండకండి, మారండి అనే సందేశాలు మాత్రం ఇవ్వలేదు.
సితార సంస్థ గురించి చెప్పాలంటే బడ్జెట్ విషయం ఎప్పుడూ మాట్లాడరు. కంటెంట్ గురించి, క్వాలిటీ గురించే ఎక్కువ మాట్లాడతారు. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారు.