కొత్త తరం నాయకత్వాన్ని అందిస్తా

– కమలా హారిస్‌ వెల్లడి
వాషింగ్టన్‌ : అధ్యక్షుడు బైడెన్‌ కన్నా తాను భిన్నమని, తాను కొత్త తరం నాయకత్వాన్ని అందిస్తానని డెమోక్రాట్‌ అభ్యర్ధి కమలా హారిస్‌ చెప్పారు. డెమోక్రాట్‌ అభ్యర్ధిగా నామినేట్‌ అయిన తర్వాత శుక్రవారం తన మొదటి టెలివిజన్‌ ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు. రిపబ్లికన్‌ అభ్యర్ధి డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తం చేస్తున్న విద్వేషం, విచ్ఛిన్నవాదాలను ఆమె తీవ్రంగా విమర్శించారు. ఆయన నాయకత్వం తీరు పట్ల ప్రజలు విసుగు చెందారని తాను భావిస్తున్నానన్నారు. తుపాకుల వంటి మారణాయుధాలు కలిగి వుండడంపై నిషేధం వుండాలని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అధ్యక్షుడు బైడెన్‌ కన్నా భిన్నంగా వుండే అంశాల గురించి చెప్పాలని టివి యాంకర్‌ కోరిన నేపథ్యంలో ”నేను జో బైడెన్‌ను కాను”, కొత్త తరం నాయకత్వాన్ని అందించాలను కుంటున్నానని హారిస్‌ చెప్పారు. 21వ శతాబ్దం సామర్ధ్యాన్ని సంపాదించేందుకు, అలాగే సవాళ్ళను ఎదుర్కొనడానికి రాబోయే పది, ఇరవై ఏళ్ళలో మనం చేయాల్సిన పనులేమిటి అనే అంశంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించనున్నట్లు హారిస్‌ చెప్పారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు. హారిస్‌ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వెనుకాడుతుందని ట్రంప్‌, ఇతర రిపబ్లికన్‌ నేతలు విమర్శించిన నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. అమెరికన్లుగా అందరినీ కలిపిఒక తాటిపైకి తెచ్చే నేత కావాలని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నారని ఆమె చెప్పారు. మాజీ ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ, ఆయన కుమార్తె, మాజీ రిపబ్లికన్‌ లిజ్‌ చెనీ సహా పలువురు రిపబ్లికన్‌ అధికారులు తనకు మద్దతునివ్వడంపై స్పందిస్తూ ట్రంప్‌ వైఖరితో ప్రజలు విసిగిపోయారన్నారు. దేశానికి ముందుగా ప్రాధాన్యమివ్వాలని, దానివల్ల మనందరం మరింత బలోపేతమవుతామని అన్నారు.