సిద్ధిపేట కమాన్‌ మీద కొత్త గోపురం

సిద్ధిపేట కమాన్‌ మీద కొత్త గోపురంఅల్లసాని పెద్దన ఒకచోట ‘అచట పుట్టిన చివురు కొమ్మైన చేవ’ అంటారు. బహుశః ఇది సిద్ధిపేట కవులు, రచయితలకు అచ్చంగా వర్తిస్తుందనిపిస్తుంది. విద్వత్కవి వేముగంటి నరసింహాచార్యుల వారు మొదలు ఇప్పుడిప్పుడే కవిత్వం రాస్తున్న వాళ్ళవరకు నూటికి ఎనభైశాతం మంది సిద్ధిపేట నుండి బాల సాహిత్య సృజన చేస్తున్నారు. దీనికి తోడుగా బంగారానికి తావి అద్దినట్టు బడి పిల్లలను సృజనాత్మక రచనలవైపుగా ప్రోత్సహించి బాల వికాసయజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. యిగో! అచ్చంగా ఆ దిశగానే మంజీర తీరం నుంచి వచ్చిన బాల గేయాల కొత్త అల… నార్లాపురం రాములు.

సిద్ధిపేట జిల్లా నంగునూరు తాలూకా నర్మెట్టలో 3 అక్టోబర్‌, 1964 న పుట్టారు రాములు. శ్రీమతి నార్లాపురం గౌరమ్మ – శ్రీ నారాయణ తల్లిదండ్రులు. తెలుగు సాహిత్యంలో స్నాతకోత్తర పట్టబద్రులైన నార్లాపురం రాములు వృత్తిరీత్యా తెలుగు భాషోపాధ్యాయులు. ప్రవృత్తిరీత్యా కవి, రచయిత, జానపద గాయకులు, నాటక కళాకారులు. పాటలు, పద్యాలు, నానీలతో పాటు ఇతర లఘు ప్రక్రియల్లో రచనలు చేసిన వీరు ‘కృష్ణానది ఉయ్యాల పాట’ రాశారు. ‘సగటు మనిషి’ కవితా సంపుటి ఇంకా అచ్చులోకి రావాల్సివుంది. నానీల కవిగా ‘నార్లాపురం నానీలు’ కూర్చారు. ప్రపంచ తెలుగు మహాసభల సత్కారంతో పాటు రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం వారి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. అనేక సంస్థల సత్కారాలు, గౌరవాలు పొందారు.
పుస్తక రూపంలో అచ్చయిన వీరి తొలి బాల సాహిత్యం ‘సోపాల గేయాలు’. పుస్తకానికి పేరు తెలంగాణ భాషలో పెట్టడం తన భాషపైన, సాహిత్యం పైన ఉన్న పాయిరానికి నిదర్శనం. ఉపాధ్యాయులైన నార్లాపురంకు లయ బాగా తెలుసు. భాష మీద పట్టుంది. లయాత్మక అభివ్యక్తి ఆయన గేయాల్లో కనిపిస్తుంది. ‘సన్నజాజుల దండ/ సరస్వతి మెడనిండ/ గన్నేరు పూ దండ/ గణపయ్య/ మల్లెపూల దండ/ మాయమ్మ మెడనిండ/ తామర పూదండ/ మా తండ్రి మెడనిండ/ గులాబి పూదండ/ మా గురువు మెడనిండ/ కనకాంబరాల దండ/ కన్నయ్య మెడనిండ’ అంటూ గేయం హాయిగా సాగుతుంది. పిల్లల పట్ల, ప్రకృతి పట్ల ఈయనకు అపారమైన ప్రేమ. అది కూడా ఆయన గేయాల్లో కనిపిస్తుంది. అందుకు ఈ సంపుటిలోని ‘చెట్లను చెరచకు’ గేయం ఒక ఉదాహరణ. ఇందులో కవి రాములు చెట్లను కొట్టేవారిని చూసి ఆవేదన చెందుతారు, బాధపడతారు, గట్టిగా శపిస్తారు కూడా! చివరగా ‘ఫలవృక్షాలను కొట్టకురా/ నీకు ప్రాణవాయువు కరువౌరా!/ ప్రాణవాయువు లేకుంటే!/ నీ ఆయువిక సెలవంట’ అంటారు.
సర్వమతాల సారమొక్కటే అన్న సత్యాన్ని బాలలకు పరిచయం చేస్తూ రాసిన గేయం ‘గ్రంథములు’. సర్వమతాలలోని సారాన్ని తన గేయంలో అందంగా ఏకవాక్యంలో పిల్లలకు చెప్పే ప్రయత్నం చేసిన రాములు సఫలం అయ్యారు. ‘భగవద్గీతేమి తెలిపిందిరా!/ భగవంతుడొకడని తెలుపునురా!/ ఖురాన్‌ ఏమని చెప్పిందిరా!/ ‘అల్లాV్‌ా’ ఏక్‌ అని తెల్పిందిరా!/… అన్ని గ్రంథాలు ఏమన్నవి!/ భూతదయ కలిగుండాలన్నవి!’ అంటాడు చివరగా. గుర్రం గురించి ఇందులో ఒక చక్కని గేయం ఉంది. రాజులెక్కే గుర్రం మొదలుకుని హోదా కోసం కలిగుండే గుర్రం, సరదా కోసం గుర్రం, జట్కాగుర్రం వంటి వాటిని కవి రాములు ఇందులో వర్ణిస్తాడు. గేయాల్లో చక్కని హాస్యాన్ని కూడా జొప్పించడం రాములుకు బాగా తెలుసు. ‘మా బావ’ అన్న గేయం అటువంటిదే మరి! ‘ఎలుకను జూచి మా బావ/ వెల్లకిల పడ్డాడు మా బావ/ బల్లిని జూచి మా బావా/ లొల్లి లొల్లి జేశాడు మా బావ/ పందిని జూసి మా బావ/ పండ్లిగిలిచ్చిండు మా బావ/ ఉడుతను జూసి మా బావ/ బుడతడైపోయాడు మా బావ/ … తిండికి తిమ్మరాజు మా బావ/ పనికి పోతరాజు మా బావ’ అంటూ పిల్లలకు నచ్చేలా రాశాడీ గేయం. బాలలకు జంతువులంటే బాగా ఇష్టమని తెలిసిన కవిగా ఈయన కొన్ని జంతువుల అరుపులను పిల్లలకు తన గేయంలో పరిచయం చేశారు. ‘సింహం గర్జించును/ …నక్క ఊళ వేయును/ కుక్క బౌబౌ మనును’ అంటూ రాశారిందులో. ఇదే కోవలో సోపాల, ఆటలు, స్నేహం, బాల్యం వంటి గేయాలు సాగాయి. ‘బాలలం మేమొక్కటే/ ప్రపంచం మా కొక్కటే/ కులమతాలు ఎరుగనోళ్ళం/ కుతంత్రాలు తెలియనోళ్ళం’ అని చాటుతూనే, ‘పిల్లలం పసి పిల్లలం’ అని రాశారు నార్లాపురం. ఇందులో ‘అంగన్‌వాడి’ గురించి రాయడం బాగుంది. ఇదేకోవలో మాతృభాష గురించి, ‘ఉగ్గుపాల భాషరా/ ఉర్విలోన భేషురా’ అంటూ తల్లి భాష గొప్పతనాన్ని చెబుతాడు కవి. కవిగా, రచయిగా, కళాకారునిగా పరిచయమైన ఉపాధ్యాయడు నార్లాపురం రాములు బాల సాహితీవేత్తగా పరిచయం కావడం అభినందనీయం. మరిన్ని మంచిగేయాలు రాయాలని కోరుతూ… జయహో! బాల సాహిత్యం.

– డా|| పత్తిపాక మోహన్‌
9966229548