”జరీ లేని చీరల్లే / వాడే పువ్వల్లే / ఫేసే చినబోయే చూడమ్మా / పొలమారి పోయేలా /ఉండే నీ అందం /చూస్తే గోవిందం ఈ జన్మ’- అంటూ కవ్వించే కవిత్వంతో కుర్రకారును కిర్రెక్కిస్తున్నాడు నాగరాజు కువ్వారపు. కవిగా, వర్ధమాన సినీగేయ రచయితగా సుపరిచితులైన ఈ పల్లెటూరి పిల్లగాడు మొదటి సినిమా అనుభవం ఒక గమ్మత్తుగా జరిగిందంటూ నవతెలంగాణ ‘జోష్’తో పంచుకున్న కబుర్లు ఇవి.
1991 సెప్టెంబర్ 21 న ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలంలోని వెంకటాపురం గ్రామంలో శ్రీనివాసరావు, అరుణ దంపతులకు జన్మించారు. తండ్రి తెలుగు అధ్యాపకులు కావడంతో నాగరాజుకు చిన్నతనం నుంచే తెలుగు సాహిత్యంపై మక్కువ ఏర్పడింది. కవితలు రాయడం, పాటలు పాడడం అభిరుచిగా అలవడింది. అతనికి సినిమా పాటల్లోని సాహిత్యంపై కూడా మరింత ఆసక్తి. నిరంతర అధ్యయనాన్ని అలవాటు చేసుకున్నారు. 2009-2013 ఖమ్మంలోని ఇన్‌స్టిట్యూట్ అండ్ టెక్నాలజీ అండ్ సెన్సెస్‌లో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్‌లో బి.టెక్ పూర్తి చేశారు. అయినా సాహిత్య రంగంలోనూ తన సత్తా చాటుకున్నారు. కవిత్వంతోనే తప్తి పడకుండా పాటల రచన వైపు కూడా అతని కలం అడుగులు వేయడం ప్రత్యేకమైన విషయం. 2012 లో ఆయన రాసిన- ‘ఏవో కొన్ని భాషల్లో ఏదో కొత్త భావంలా నన్నే నువ్వు తరుముతూ ఉంటే నే నిలిచేదెలా’ అన్న ప్రణయగీతం (ప్రయివేటు) అతనికెంతో పేరు తీసుకొచ్చింది.
తండ్రి శ్రీనివాసరావు తెలుగు అధ్యాపకులుగా కల్లూరు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నారు. 2007 వందేమాతరం వందేండ్ల వేడుకల్లో వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి పొందడం సాహిత్యం వైపు అడుగులు పడడానికి కారణం. తండ్రి వైపు వాళ్లు గాయకులు, తల్లి వైపు వాళ్లు సంగీతకారుల పరంపర ఉండడం పాటలు రాయడానికి, సాహిత్యం వైపు అడుగులు పడడానికి కారణం. 6వ తరగతి నుంచి హిందీ టీచర్ జగన్నాధరావు ప్రోత్సాహంతో పాటలు పాడడం మొదలై బి.టెక్ వరకు గాయకుడిగా ఎన్నో పోటీల్లో గెలిచి బహుమతులు పొందారు.
పదవ తరగతి నుంచి చిన్న చిన్న కవితలు రాస్తూ 2012 నుంచి పాటలు రాయడం ప్రారంభించారు. 2013లో మొదటిగా పాటలు రాసిన చిత్రం ”యూటర్న్” చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోవడంతో.. పాటలు రాయడమే లక్ష్యంగా పెట్టుకుని 50 షార్ట్ ఫిల్మ్స్‌కు పాటలు రాశారు. ”ఓరు ఇడియట్” చిత్రంలో ఆరు పాటలు (సింగిల్ కార్డ్) రాశారు. రీసెంట్ గా ”రేంజ్ రోవర్” చిత్రంలో రెండు పాటలు రాశారు. వీడియో ఆల్బమ్స్, స్పాటిఫై ఇండిపెండెంట్ సాంగ్స్ మొత్తంగా 200 పై చిలుకు పాటలు రాశారు.
ఎలా ఆసక్తి వచ్చిందంటే
”చిన్నపుడు మా ఇంటి దేవుడి గదిలో తాతయ్య పాడిన భజన పాటల విన్నప్పటి నుంచి పాట నా జీవితంలో భాగమే. 4వ తరగతి నుంచి సినిమా థియేటర్‌లో చూడడం, పాటలు బాగా వినడం, పాడడం, పాటల గురించి తెలుసుకోవడం అలవాటే. మా చిన్నాన్నకి పాటల కలెక్షన్ హాబీగా ఉండేది. ఆయన అనేకానేక పాటలను రోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో వినిపించేవారు. అప్పటి నుంచే మొదలైంది నాకు సినిమా పిచ్చి. సిరివెన్నెల, శంకరాభరణం ప్రేమదేశం, ప్రేమికుల రోజు, బొంబాయి పాటలు విని నేను పీకల్లోతు పాటల ధ్యానంలో మునిగిపోయా. 6వ తరగతి నుంచి ”తూనీగా తూనీగా” అంటూ ”మనసంతా నువ్వే” సినిమాలో పాటను స్కూల్ అందరికీ బాగా పాడతానని తెలిసేదాక పాడించారు మా హిందీ టీచర్ జగన్నాథరావు. అలా ఎన్నో వేదికలపై పాడిన పాటలే నాతో పాటలు రాయించే ధైర్యం, శక్తిని తెచ్చాయి. దానికి తోడు ఇంటర్ నుంచి చదివిన ”అమతం కురిసిన రాత్రి”, ”మహాప్రస్థానం”, ”ప్రపంచ పదులు”, ”విశ్వంభర”, ”అసమర్ధుని జీవయాత్ర”, ”అతడు అడవిని జయించాడు” ఇలా చదివిన ఎన్నో కవితలు, నవలలు నాతో నిత్య చైతన్య రచనా స్ఫూర్తిని కలిగించాయి.
పాటలు రాసే మొదట్లో తీవ్రమైన వ్యతిరేకతని ఇంట్లోనూ, కాలేజీలోనూ చవిచూసాను. చదివింది బీటెక్. ఇంగ్లీష్ మీడియం చదువులు అవ్వడంతో మా ఫ్రెండ్స్ ఎవరికి తెలుగు రాదు. ఎవరికి నేను అర్థం కానట్టే ఉండేది నా పోకడ, కానీ నాకు అదే ఇష్టం అదే చేస్తూ పోతూ ఉండేవాడ్ని. మా నాన్న తెలుగు అధ్యాపకులు అవ్వడం వల్ల వాళ్ళ స్టాఫ్ పిల్లలు అంతా ఏవేవో చేసి ఏదేదో అయిపోతున్నారని కొంచెం ఒత్తిడి తెచ్చేవారు ఏదో ఐపోవాలని, ఏదో చేసెయ్యాలని. ఆ సమయంలో నాయనమ్మ, తాతయ్య ఇచ్చిన భరోసా మరువలేనిది. వాళ్లే చిన్నతనం నుంచి నా వెనకుండి బలంగా ముందుకు నడిపించింది” – అంటూ చెప్పుకొచ్చారు.
కొన్ని అనుభవాలు
”నా మొదటి సినిమా అనుభవం ఒక గమ్మత్తుగా జరిగింది. నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌కి పాటలు రాశాక ఆర్ధిక సమస్యల వల్ల ”అమీర్ పేటలో” సినిమాలో హీరోకి ”పర్సనల్ అసిస్టెంట్” గా పని చేయడానికి వెళ్లాను. అప్పటికే 70 శాతం షూటింగ్, ఐదు పాటలు రాయడం, షూట్ చేయడం అయ్యాయి. చాలామంది ”సాఫ్ట్‌వేర్ లైఫ్ కోసం” సాంగ్ రాయడానికి ప్రయత్నించారు కానీ చివరగా నేను రాసిందే నచ్చడం ట్యూన్ కూడా నాదే అవ్వడం ఒకే రోజులో పాట రాయడం ముగియడం మంచి జ్ఞాపకాలు. ఒకతను ఒక పాట కోసం నన్ను 10 రోజులు 10 వేరు వేరు వెర్షన్స్ పాటలు రాయించాడు. వాటిలో లైన్స్ పొదిగి నేనే రాసాను. పాట నాకు నచ్చేలా నువ్వేం రాయలేదన్నాడు. అదొక చేదు అనుభవం. పాట రాయడం ఒక తపస్సు. నేను పాట రాసేటపుడు కూడా ఒక తపస్సులాగే రాస్తాను. సినిమాకి రాసిన ప్రతి పాట నాకు ఎంతో అపురూపం. పాట రాయడం మొదలెడితే 3-5 రోజులు అదే లోకంలో ఉండి రాస్తుంటాను. ”ఉత్తర” సినిమాలో ”ఓ చూపే చుక్కల ముగ్గులా” పాట అలా రాసిందే. కష్ణానగర్ కష్టాలు మొదటి దశలో నేను అనుభవించిన వాడినే. ఏ సహకారం లేకుండా, ఎవరు సినిమా పరిశ్రమలో తెలిసిన వాళ్ళు లేకుండానే నా ప్రయాణం మొదలై 200 పాటలు రాసేంత వరకు కొనసాగింది, కొనసాగుతోంది.- అంటూ తన అనుభవాలు పంచుకున్నారు.
తొలి సినిమా పాట
2016 లో దర్శకులు అనిల్ మద్దెల ప్రోత్సాహంతో ‘అమీర్ పేట్ లో..’ (2016) ‘సాఫ్ట్ వేరు లైఫ్ కోసం..’ అనే పాటతో గీత రచయితగా అతని సినీ ప్రస్థానం మొదలైంది. ఈ పాటలోని- ‘ముందు చూస్తే పొట్ట నెత్తిపైన బట్ట కంటి చూపు ఫట్టా పిల్లనివ్వట్లేదు ఎట్టా’ వంటి వాక్యాలు సాఫ్ట్ వేరు జీవితాలను కళ్ళముందుంచుతుంది. సాఫ్ట్ వేర్ జీవితాల వ్యదార్థగాథలను అక్షరబధ్ధం చేశారీపాటలో.
వలపు పాటలు
అలాగే- 2017 లో వచ్చిన ‘ఉందా లేదా?’ అనే సినిమాలో ‘సెల్ఫీపిల్లా’ అనే పాటను రాశారు. ఈ పాటలోని ‘నింగిలోని పాలపుంత కూడా చిన్నబోదా నిన్ను చూస్తే’ వంటి పంక్తుల్లో ప్రేయసి అందాన్ని కవిత్వీకరించిన తీరు కనబడుతుంది. అలకలో ఉన్న చెలిని బుజ్జగిస్తూ, ఆమె అందచందాల్ని పొగడుతూ సాగే ఈ పాట ఎంతో హద్యంగా ఆకట్టుకుంటుంది. ఇదే సినిమాలో ‘పిల్లా..రసగుల్లా’ అనే పాటను కూడా ఆయన రాశారు. లేతవయసులో ప్రేమ చేసిన సందడికి పులకించిన ప్రేమికుడు పరవశించి పాడే పాట ఇది. ఈ పాటలోని ‘నా చుట్టూ ఉన్న లోకాన్ని మరచిన.. ముందే ఉన్న రూపాన్ని కలిసిన.. చూపుల్లోని బాణాలు తగిలిన నిన్నే చూస్తున్నా..’ అంటూ ప్రేయసి చేసిన తొలివలపు గాయానికి ప్రేమికుడిలో చిగురెత్తిన వయసు తపనను ఈ పాటలో స్పష్టంగా ఆవిష్కరించారు నాగరాజు. అలాగే – ‘ఉత్తర’ (2020) సినిమాలో ఆయన రాసిన – ‘ఓ చూపే చుక్కల ముగ్గులా.. రూపం గోపెమ్మలా..’ అనే పాట కూడా చక్కటి ప్రణయ భావుకతను చాటుతుంది. ఈ పాటలోని ‘నీ వలన గుండె చాటున ఉన్నట్టుండి వింతభావన’ అనే వాక్యంలో తొలిప్రేమలోని సోయగం కనబడుతుంది. ‘అందాల దేవత భూలోకవాసిగా మారిముందుంటె చూస్తున్నా..’ అంటూ ప్రేయసిని స్వర్గలోక దేవతగా భావించిన వైనాన్ని, ప్రేమికుడు ఆమెపై చూపిస్తున్న నిండైన ప్రేమకు సాక్ష్యంగా చెప్పవచ్చు. ఇలాంటి ప్రేమపాటల రచనలో ఆయన కలం సరికొత్తగా ఉరకలేసిందని చెప్పవచ్చు.
‘ఓరు ఇడియట్’ (2020) సినిమాలోని పాటలన్నీ ఆయన రాసినవే. ప్రతి పాట ఎంతో వైవిధ్యభరితంగా ఉంది. అటు ప్రణయాన్ని, ఇటు విషాదభరితమైన ప్రేమనుఆవిష్కరించే పాటల్ని ఆయన రాశారు. అందులో- ‘కనుపాపే కన్నీటితో తడిసే వేళ’ అనే పాట సరికొత్త అభివ్యక్తిని వ్యక్తపరుస్తుంది. ఈ పాటలోని ‘గాజు బొమ్మల్లే చూసుకున్నానే గాయమే చేసి వెళ్ళిపోతుందే తీపిముల్లలే గుచ్చుకున్నాదే..’ వంటి పంక్తుల్లో విరహభావన వింతగా తొంగిచూస్తుంది. ఇలా ఈ సినిమాలోని ప్రతి పాట లయబద్ధంగాను,కవితాత్మకంగాను ఎంతో చక్కగా ఆవిష్కృతమయ్యాయి.
ఆయన ప్రతిభాపాటవాలకు మెచ్చి ఎన్నో పురస్కారాలు వరించాయి. 2016 లో ‘నాన్నతో అనుబంధం’ అనే డాక్యుమెంటరీ చిత్రానికి గాను ఉత్తమ గీతరచయితగా పురస్కారం, 2017లో తెలంగాణ కళాపరిషత్ వారి ఉగాది పురస్కారం మొ. గౌరవ సత్కారాలు ఆయన అందుకున్నారు. సినిమా పాటలే కాకుండా ఎన్నో ప్రైవేటుగీతాలను కూడా ఆయన రాశారు. కవిగానే కాకుండా గాయకుడిగా కూడా ఆయన ప్రజ్ఞ ప్రశంసనీయం. దాదాపు 9 సార్లు ఉత్తమ గాయకుడిగా పురస్కారాలను అందుకున్నారు. ఇలా అద్భుతమైన సినీపాటలతో దూసుకుపోతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు నాగరాజు కువ్వారపు.
కుటుంబం : భార్య- వెంకటరావమ్మ కూతురు- అభిజ్ఞ, కొడుకు- శ్రీ ఆదిత్య
పాటల్లోని పంక్తులు
తి బాడీలోకెళ్లే రోజుల్లో
గుడిలో విన్న పాటలా
గుండె వీణ గొంతులో
కొత్త రాగం నీ పేరు
తి ఏవో కొన్ని భాషల్లో
ఏదో కొత్త రాగంలా
నన్నే నువ్వు తడుముతూ ఉంటే
నే నిలిచేదెలా
ఇంకో కొత్త లోకంలో
ఇంకా కొంత దూరంలో
నన్నే విడిచి నువ్వెళిపోతే
నే బ్రతికేదెలా
తి భూమ్యాకర్షణ న్యూటన్ సిద్ధాంతం
నీ చుట్టూ జరిగే ఘర్షణ అది నా సిద్ధాంతం
ఫీలింగ్స్ ప్రేరణ ఈ ప్రేమల్లో సహజం
ఇనుము అయస్కాంతం థియరీలో అది ప్రత్యక్షం
తి చూపులు ఆగవు చూడకపోతే
ఊసులు సాగవు చెప్పకపోతే
రెక్కలు లేని విహంగమల్లే ఉంటా
ఆశలు తుంచకే మాటలు ఆపి
అలజడి పెంచకే గుండెను మీటి
అందని తారగ దూరం అయిపోతావా
తి విరబూసే రంగుల్లో
చెలి రూపం చూసాలే
తొలిసారి నా కళ్ళతోనా
ఎదలోక యువరాణికి
ఈ చిత్రం చూపించనా
ఆకుల్లా నా గుండెను
పరిచానే నీ ముందర
తి ముచ్చట్లే చెప్తుంటే మహారాణల్లే ఉంటావే
నువు గుమ్మంలో కూర్చుంటే చాలు అనిపిస్తుందే
కన్నుల్లో లోకాన్ని నువు దాచావో ఏమోలే
స్వప్నాలన్నీ నీలో చూసానే
తి తీరంలేని కడలి
ఉగ్రరూపం చూసేదెవరు
ఒంటరిదైన మదిలో
మంట రేపితే ఆర్పేదెవరు
తి నన్నింత శూన్యంలో
నువ్వుంచి వెళ్ళొద్దే
నేనుండలేనంట ఈ బాధలోన
నా ప్రపంచమంతా
నన్నే కాదంటే ఇంకేం చెయ్యాలే
నే పరాయివాడై
ఉన్నా నీ ముందే ఇంకేం కావాలే
తి నడిచే ప్రతి అడుగులోనా
ఏడడుగులతో పోల్చుకోనా
ఇలా ప్రతి నిమిషము
ఆనందంగా ఎగిరిపోనా
సదా నీ చెలిమికై
పూల దారిలోన మేలుకుంటున్నా
తి సంద్రాన చినుకులే
తన పాదాల పరుగులే
తీరాల మలుపులో
తను కోరింది చెలిమినే
అనంతోజు మోహన్‌కృష్ణ 8897765417