బ్లూ స్టార్‌ నుంచి నూతన శ్రేణీ డీప్‌ ఫ్రీజర్లు

– 2025లో శ్రీసిటీలో వాణిజ్య ఏసీల తయారీ రూ.8200 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం :ఎండీ త్యాగ రాజన్‌ వెల్లడి
హైదరాబాద్‌ : ప్రముఖ ఎయిర్‌ కండీషనింగ్‌, వాణిజ్య రిఫ్రిజిరేషన్‌ సంస్థ బ్లూ స్టార్‌ నూతన శ్రేణీ డీప్‌ ఫ్రీజర్లను విడుదల చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో వీటిని ఆ సంస్థ ఎండీ త్యాగరాజన్‌, కమర్షియల్‌ రిఫ్రిజిరేషన్‌ హెడ్‌ శ్రీనివాస్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్బంగా త్యాగ రాజన్‌ మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని వాడా ప్రాజెక్టులో అంతర్జాతీయ స్టాండర్డ్స్‌తో వీటిని తయారు చేశామన్నారు. 50 లీటర్ల నుంచి 600 లీటర్ల సామర్థ్యం కలిగిన డీప్‌ ఫ్రీజర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇందులో కొన్నిటినీ రీడిజైన్‌ చేయగా.. కొన్నిటిని కొత్తగా రూపొందించామన్నారు. వీటన్నిటీ తమ సొంత ఆర్‌అండ్‌డీ సెంటర్‌లోనే అభివృద్థి చేశామన్నారు. వీటి ధరలు రూ.15వేల నుంచి ప్రారంభమవుతాయన్నారు. శ్రీసిటీలోని ప్లాంట్‌లో తొలి దశలో రూ.350 కోట్ల పెట్టుబడుల వ్యయంతో 2023 జనవరి నుంచి గృహ ఏసీలను తయారు చేస్తున్నామన్నారు. రెండో దశలో మరో రూ.200 కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు వేశామన్నారు. ఈ ప్లాంట్‌ను మరింత విస్తరించడానికి రూ.500 కోట్లతో మరో 40 ఎకరాలు కొనుగోలు చేశామన్నారు. 2025 నుంచి ఇక్కడ వాణిజ్య ఏసీలను తయారీని ప్రారంభించనున్నామన్నారు. విస్తరణలో భాగంగా 8,000 టచ్‌ పాయింట్లను 10వేలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8200 కోట్ల టర్నోవర్‌ను సాధించాలన్న లక్ష్యానికి చేరువలో ఉన్నామన్నారు. గడిచిన 2021-22లో రూ.6045 కోట్ల రెవెన్యూ నమోదు చేశామన్నారు. ఏసీ పరిశ్రమ ప్రతీ ఏడాది 15 శాతం పెరుగుతుండగా.. బ్లూ స్టార్‌ 20-25 శాతం మధ్య వృద్థిని సాధిస్తుందన్నారు.