– రైతులను కావాలనే హరీష్ రావు ,కేటీఆర్ రెచ్చగొడుతున్నారు..
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…
నవతెలంగాణ – వేములవాడ
రుణమాఫీ పైన బీఆర్ఎస్ పార్టీది అక్కసు మాత్రమే అని,రైతులను కావాలనే హరీష్ రావు ,కేటీఆర్ రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని,ఆగస్ట్ 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారని అన్నారు. ప్రభుత్వం 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పిందని,జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టిందన్నారు.జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న 11,50,193 మంది రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో రూ.6098.93 కోట్ల రుణమాఫీ చేసిందని,జులై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడత 6,40,823 మంది రైతులకు రూ.6190.01 కోట్ల రుణమాఫీ కార్యక్రమం అమలు చేసి ఒక లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణమున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసిందన్నారు.ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభ వేదికపై ముఖ్యమంత్రి రాష్ట్రంలోని రైతులకు అసలైన స్వరాజ్యం వచ్చిందని.. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్లు ప్రకటించారని అన్నారు.రాష్ట్రంలోని మూడో విడత కింద 4,46,832 మంది రైతులకు రూ.5644.24 కోట్లరుణమాఫీ కార్యక్రమం అమలు చేసి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ అవుతాన్నాయిని, ఆ రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నారని, దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగియనుందన్నారు.
కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.37 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ.18 వేల కోట్ల రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు.సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతులను రోడ్లపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని,పదేళ్లలో కేసీఆర్ చేయలేని పని నెల రోజుల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసారని అన్నారు.ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వమే స్వయంగా చర్యలు తీసుకుంటోందని,గతంలో బీఆర్ఎస్ లాగా రైతులకు మేం రుణమాఫీ ఎగ్గొట్టలేదని అన్నారు.రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు 8500 కోట్లు ఎగ్గొట్టిన బతుకులు మీవని,లక్ష రూపాయల రుణమాఫీ ఐదేళ్ల పాటు చేసిన చరిత్ర కూడా మీదన్నారు.సాక్షాత్తు రైతులకు సంకెళ్లు వేసి నడిపించిన నీచ చరిత్ర కేసీఆర్ దన్నారు..ఒక్క రైతు బంధు ఇచ్చి అన్నదాతలను పదేళ్ల పాటు ఎండబెట్టారని,రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ లను ఎత్తి వేసి రైతులను నాశనం చేశారని దుయ్యబట్టారు. దళిత,పేద రైతుల, అసైన్డ్ భూములను లాక్కున్నారని,బడా బాబులకు రైతు బంధు పేరుతో 24 వేల కోట్లు దోచిపెట్టి,రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీ ఏ మాత్రం లేదన్నారు.అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో రైతులు కేసీఆర్ కుటుంబాన్ని ఛీ కొట్టారనిరుణమాఫీ పైన అసత్యాలు ప్రచారం చేస్తే అన్నదాతల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. రుణమాఫీ పైన కేటీఆర్, హరీష్ రావు తో పాటు బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని,రైతులకు రుణమాఫీ కావడం వారికి ఇష్టం లేదన్నారు.కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు అవుతుంటే కేటీఆర్ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడని,మా ముఖ్యమంత్రి కదిలినా మెదిలినా బీఆర్ఎస్ గజగజ వణికిపోతోందన్నారు.ఎప్పుడైనా రైతులకు అండగా నిలబడింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని,భవిష్యత్తు లో కూడా రైతులకు వెన్నుదన్నుగా మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందన్నారు.ఉచిత విద్యుత్తు ను ఇస్తున్నాం.. కావాల్సిన సబ్సిడీలనుకొనసాగిస్తున్నాంమని,కౌలు రైతులకు రైతు భరోస్తా ఇస్తామని… రైతు కూలీలకు సాయం చేస్తామన్నారు.రైతుకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకొని తీరుతాం అని, రైతు పేరు చెప్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుకు వచ్చేలా అన్నదాత కు అండగా ఉంటామన్నారు.