రూ.100 కోట్లతో కొత్త స్టేడియం!

హైదరాబాద్‌ : రూ.100 కోట్లతో కొత్త స్టేడియం నిర్మాణానికి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) తీర్మానం ఆమోదించింది. ఉప్పల్‌ స్టేడియంలో ప్రపంచ శ్రేణి శిక్షణ కేంద్రం, హైదరాబాద్‌ పరిధిలో నాలుగు శాటిలైట్‌ అకాడమీలు సహా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మినీ స్టేడియం నిర్మాణాలు చేపట్టనున్నారు. బీసీసీఐ నిధుల్లో కనీసం 30 నిధులను గ్రామీణ క్రికెట్‌ అభివృద్దికి ఖర్చు చేయనున్నారు. అందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. మహిళల క్రికెట్‌కు సైతం ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఏజీఎం ఆమోదించింది. హెచ్‌సీఏ తరఫున బీసీసీఐ సమావేశానికి అధ్యక్షుడు జగన్‌మోహన్‌, కార్యదర్శి దేవరాజ్‌ రొటేషన్‌ విధానంలో హాజరుకావాలని సభ్యులు తీర్మానించారు. గతంలో రసాభాసాగా సాగిన హెచ్‌సీఏ సమావేశాలకు భిన్నంగా 86వ ఏజీఎం స్నేహపూర్వక వాతావరణంలో ముగిసింది.