కొత్త అడుగు.. ఆరోగ్యం వైపు

A new step.. towards healthకొత్త ఏడాది ప్రారంభం ప్రతిఒక్కరి జీవితంలో ఆనందానికి, ఆశలకు, కొత్త సంకల్పాలకు కారణమవుతుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలసి వేడుకలను జరుపుకుంటాం. అయితే ప్రతి ఏడాది ముగింపు, కొత్త ఏడాది ప్రారంభం కేవలం క్యాలెండర్‌ మార్పు మాత్రమే కాదు.
మన జీవితంలో కొత్త ఆరంభానికి ఒక గుర్తు. మనం తీసుకునే కొత్త నిర్ణయాల్లో ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా తీసుకునే అనారోగ్యకరమైన ఆహారం వల్ల మన ఆరోగ్య లక్ష్యాలను మనమే దూరం చేసుకుంటున్నాం.
ఆరోగ్యంగా కొత్త ఏడాది
పండుగ భోజనంలో సమతుల్యత: పండుగ రోజుల్లో అన్ని రకాల ఆహార పదార్థాలు తినాలనే కోరిక మనల్ని అనారోగ్యం వైపు నెట్టివేస్తుంది. పండుగ భోజనంలో కూరగాయలు, పండ్లు, తణధాన్యాలు, ప్రోటీన్లు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి.
తీపి తగ్గించండి : పండుగల సమయంలో తీపి వంటలకు ప్రాధాన్యం ఎక్కువ. అయితే అధికంగా తినడం మధుమేహం, బరుపు పెరుగుదల వంటి సమస్యలకు దారితీస్తుంది. కనుక తక్కువ మోతాదులో, ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేసిన తీపి వంటలను మాత్రమే ఎంచుకోవాలి.
వ్యాయామం మర్చిపోవద్దు : పండుగ సమయంలో వ్యాయామం పట్ల నిర్లక్ష్యం వహించడం సర్వసాధారణం. అయితే రోజూ కొంత సమయం వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రసాయన మార్పులు జరిగి, ఆకలిని అదుపులో ఉంచుతాయి.
మద్యం మానండి : మద్యం మన ఆరోగ్యానికి ఎంతో హానికరం. పండుగల సమయంలో మద్యం సేవనం పెరుగుతుంది. అయితే మద్యం వల్ల కాలేయం దెబ్బతింటుంది, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి మద్యం సేవనం తగ్గించడం లేదా మానుకోవడం మంచిది.
పండ్లు, కూరగాయలు : కొత్త ఏడాది విందులో పండ్లు, కూరగాయలను ప్రాధానంగా చేర్చాలి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ సమద్ధిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన సలాడ్లు, పండ్ల రసాలు ఎంచుకోండి.
ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు దూరంగా : తయారు చేసిన ఆహార పదార్థాలు, ఫాస్ట్‌ ఫుడ్‌ వంటివి తగ్గించడం మంచిది. వీటిలో ఎక్కువగా క్యాలరీలు, కొవ్వు పదార్థాలు ఉండి ఆరోగ్యానికి హానికరంగా మారతాయి.
తక్కువగా చక్కెర, ఉప్పు : విందులో చక్కెర, ఉప్పు ఉపయోగాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తక్కువ చక్కెరతో చేసిన డెజర్ట్‌లు, తక్కువ ఉప్పుతో చేసిన వంటకాలను తీసుకోవాలి.
తగిన మోతాదులోనే ఆహారం : వేడుకల ఉత్సాహంలో అధిక మోతాదులో ఆహారం తీసుకోవడం సాధారణం. కానీ తగిన మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యకరంగా ఉంటుంది.
ఫుడ్‌ డెలివరీ ఆప్స్‌ : ఫుడ్‌ డెలివరీ ఆప్స్‌ని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. వారంలో ఒక్క రోజు అది ఒక్క పూట మాత్రమే ఫుడ్‌ ఆర్డర్‌ చేయాలనే నియమం పెట్టుకోండి. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి. రుచిని కొంచెం పక్కన పెట్టండి.
చివరగా
కొత్త ఏడాది ప్రారంభం మన జీవితంలో కొత్త ఆరంభానికి ఒక గుర్తు. ఈ సందర్భంగా మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని మలుస్తాయి. కాబట్టి ఈ కొత్త ఏడాది ఆరోగ్యంగా ప్రారంభించడానికి మనం చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే కొత్త ఏడాదిలో ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా మీతో కలిసుండాలని ఆకాంక్షిస్తూ.. ఆరోగ్యకరమైన ఆహార మార్గదర్శకాలతో ముందుకెళ్దాం.

Dr.Prathusha. Nerella
MD( General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician, Positive Psychologist certified Nutritionist, Diabetes And Lifestyle Expert, Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach. Ph: 8897684912/040-49950314