శాస్త్రీయ ఆలోచనల్లేని నూతన విద్యావిధానం

A new system of education without scientific ideas– అమలు నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి
– యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ చేయాలి : ప్రొఫెసర్‌ ఆమంచి నాగేశ్వర్‌రావు
– టీయూలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్‌ ప్రారంభం
నవతెలంగాణ-డిచ్‌పల్లి
కేంద్రం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యారంగాన్ని ధ్వంసం చేస్తోందని, అందులో శాస్త్రీయ ఆలోచన లేదని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఆమంచి నాగేశ్వర్‌రావు అన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రీయ ఆలోచన లేని నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయొద్దని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్‌ శనివారం నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీలో మొదటి రోజు కామ్రేడ్‌ భారతినగర్‌లో ప్రారంభమైంది. ఎస్‌ఎఫ్‌ఐ పతాకాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి ఆవిష్కరించారు. ఇటీవల మరణించిన ప్రముఖులకు సంతాప తీర్మానాన్ని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగేష్‌ ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆమంచి నాగేశ్వర్‌రావు ప్రసంగించారు. పాఠ్యపుస్తకాలలో డార్విన్‌ సిద్ధాంతాన్ని, భగత్‌ సింగ్‌, అంబేద్కర్‌లాంటి గొప్ప మేధావుల చరిత్రలను తొలగించి.. నాడు బ్రిటీష్‌ ప్రభుత్వానికి కొమ్ముకాసిన సావర్కర్‌ వంటి వారి జీవిత చరిత్రలను జోప్పించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం యూనివర్సిటీలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. వైస్‌ ఛాన్స్‌లర్‌ల నియామకాలలో అర్హులకు అవకాశం కల్పించి విద్యావ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై ఈ కన్వెన్షన్‌లో చర్చించి భవిష్యత్‌ పోరాటాలకు సన్నద్ధం అవుతామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ రామ్మోహన్‌రావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ కార్యదర్శి రమేష్‌ బాబు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత, నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి బోడ అనిల్‌, కామారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్‌, అజరు, రాష్ట్ర కమిటీ సభ్యులు భరత్‌, ఉస్మానియా యూనివర్సిటీ కార్యదర్శి రవి నాయక్‌, తెలంగాణ యూనివర్సిటీ కార్యదర్శి ప్రసాద్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు సంధ్య రెడ్డి, దీపిక, జిల్లా ఉపాధ్యక్షులు మహేష్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.