కొత్త ఓటరు ఎప్పటికప్పుడు నమోదు ఫారాలను పరిష్కరించాలి

– జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద లాల్‌ పవార్‌
నవ తెలంగాణ: వనపర్తి
తుది ఓటరు జాబితా ప్రకటన తర్వాత వచ్చిన కొత్త ఓటరు నమోదు ఫారాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద లాల్‌ పవార్‌ సూచించారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి వివరిస్తూ కొత్త ఓటర్ల ఫారాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. తుది ఓటరు జాబిత వెలువడిన తర్వాత 21 సంవత్సరాల పైబడిన వారు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారని ఈ విషయంలో చాలా జాగ్రత్తగా దరఖాస్తులు పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించాలని సూచించారు. వి. ఐ.పి. ఓటర్లను గుర్తించి ఓటరు జాబితాలో మార్కింగ్‌ చేయించాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించనున్న ఉద్యోగులు, సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ లు సక్రమంగా అందేవిధంగా వారి ఎపిక్‌ కార్డు వివరాలను ఆన్లైన్‌ లో నమోదు చేయించాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని తెలియజేశారు. షెడ్యూల్‌ వెలువడిన రోజు నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. సోషల్‌ మీడియాను నియంత్రించే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద లాల్‌ పవార్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌, 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి కానున్న యువత ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోడానికి అవకాశం ఉన్నందున సద్వినియోగం చేసుకునే విధంగా స్వీప్‌ యాక్టివిటీ ద్వారా అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లను స్వయంగా పరిశీలించి అన్ని మౌలిక సదుపాయాలు ఉండేవిధంగా చర్యలు తీసుకొని నివేదికను ఇవ్వాల్సిందిగా తహశీల్దార్లు ఆదేశించారు. ఎక్కడైనా ఆగ్జిలరి పోలింగ్‌ స్టేషన్ల ఆవశ్యకత ఉన్నదా అనే విషయాలను తహశీల్దార్‌ లతో వివరాలు సేకరించారు. ఓటరు జాబితాలో డూప్లికేట్‌ పేర్లు ఉంటే పరిశీలన అనంతరం తొలగించాలని సూచించారు. కొత్త ఓటర్ల ఎపిక్‌ కార్డులను పోస్టు ద్వారా పంపేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని అదేశించారు. అదనపు కలెక్టర్‌ లోకల్‌ బాడీస్‌ సంచిత గాంగ్వార్‌, అదనపు కలెక్టర్‌ రెవెన్యూ యం. నగేష్‌, ఆర్డీఓ పద్మావతి తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.