ప్రైవసీకి ఉరి-డిజిటల్‌ మీడియాపై గురి

A nod to privacy—a focus on digital mediaదేశంలో తీసుకొచ్చిన డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ చట్టం- 2023పై ఇటీవల ఓ దినపత్రికలో వచ్చిన వ్యాసం సమర్థించే విధంగా ఉంది. మీడియా అంటేనే ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలు వాటి లోపాల్ని బయటపెట్టేది.కానీ అందుకు భిన్నంగా వ్యవహరించం సహేతుకమైనది కాదని అభిప్రాయం. చట్టంలో గోప్యతకు సంబంధించిన అంశం జస్టిస్‌ కెఎస్‌ పుట్టస్వామి వర్సెస్‌ యూనియన్‌ గవర్నమెంట్‌ కేసు తీర్పు 2017లో వెలువడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14,19,21 ప్రకారం గోప్యత పౌరుల ప్రాథమిక హక్కుగా ఉంటుందని, తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన అత్యున్నత ధర్మాసనం ప్రతిష్టాత్మక తీర్పునిచ్చింది. డేటా ప్రొటెక్షన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ కోసం, సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జీ జస్టిస్‌ బిఎన్‌ శ్రీకృష్ణ సారథ్యంలో కమిషన్‌ను వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది 2018లో రిపోర్టుతోపాటు, డ్రాఫ్ట్‌ బిల్లును అందించింది. పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్‌-2018 డ్రాఫ్ట్‌ను పార్లమెంటు ఎగువ, దిగువ సభల్లో 2019లో ప్రవేశపెట్టింది. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ బిల్లును పరిశీలించి 2021లో 80 సవరణలను ప్రతిపాదించింది. 90 సెక్షన్లతో కూడిన 2018 బిల్లులో 18చోట్ల అవరమైతే నిర్ధేశించవచ్చు అని రాసుకుంది. చట్టాన్ని ఏలికలు తమకు నచ్చినట్లు వాడుకునే అవకాశం కల్పిస్తుంది ఇది. ప్రతిపక్షాలు, మేధావుల నుండి బిల్లుపై పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో కేంద్రం 2022 ఆగస్టు 2న పార్లమెంటులో ఈ చట్టాన్ని ఉపసంహరించుకుంది. డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్‌-2022 పేరుతో మరో డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది. 2023 ఆగస్టులో మూజువాణి ఓటింగ్‌ ద్వారా పార్లమెంటులో చట్టం చేసింది. 2025 జనవరి 3న డిపిడిపి చట్టం అమలు కోసం నియమాల డ్రాఫ్ట్‌ను రిలీజ్‌ చేసింది.
డిపిడిపి-2023లో ఏముంది? దేశంలోని వ్యక్తిగత డేటా సేకరణ, నిల్వ, ఉపయోగం,షేరింగ్‌కు సంబంధించిన నియమ నిబంధనల్ని, డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ చట్టం-2023లో పొందు పరిచారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో సేకరించిన డేటా, ప్రాసెసింగ్‌ ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. పౌరుల డేటాను వారి సమ్మతితోనే తీసుకోవాలి. సేకరించిన పనికోసమే డేటాను వినియోగించాలి. ఆ పని పూర్తయితే, ఆ డేటాను మరోపనికి వాడకుండా డిలీట్‌ చేయాలనే క్లాజులో ప్రభుత్వ ఏజెన్సీలకు మినహాయిం పునిచ్చారు. డేటా మినిమైజేషన్‌, అక్యురసీ, భద్రత అంశాలు చట్టంలో ఉన్నాయి. 18 ఏండ్లలోపు ఉన్న పిల్లల డేటాను తీసుకోవాలంటే వారి పేరెంట్స్‌ అనుమతి తప్పనిసరి. ప్రభుత్వ ఏజెన్సీలు ఏదైనా కారణంతో పౌరుల అనుమతి లేకుండానే వ్యక్తిగత డేటా తీసుకోవచ్చు. ఒక కంపెనీని కొనుగోలు చేస్తే దానివద్ద ఉన్న డేటాను కొత్త కంపెనీకి ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు. పౌరుల డేటా దుర్వినియోగం చేస్తే రూ.50 కోట్ల నుండి 500 కోట్ల వరకు జరిమానా ఉంటుంది. భారీగా ఫైన్లు వేసే రూల్స్‌ రూపొందించారు. కానీ డేటాను కోల్పోయిన బాధితుడికి నష్టపరిహారం ప్రస్తావన ఈ చట్టంలో లేదు. వసూలు చేసిన పెనాల్టీ డబ్బులను డేటా ప్రొటెక్షన్‌ కోసం వాడాలని శ్రీకృష్ణ కమిటీ డ్రాఫ్ట్‌లో ఉంది. దాన్ని నూతన చట్టం నుండి తొలగించారు.
శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన డ్రాఫ్టులో డేటా లోకలైజేషన్‌ అనే క్లాజు ఉంది.అంటే పౌరుల సెన్సిటివ్‌ డేటాను దేశ సరిహద్దు లోపలే భద్రపరచాలి. మల్టీ నేషనల్‌ కంపెనీలు, అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ప్రభుత్వం నోటిఫై చేసిన దేశాలను మినహాయించి, మిగతా దేశాలకు డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చని 2023 చట్టంలో చేర్చారు. దేశ పౌరుల వ్యక్తిగత డేటా విదేశాలకు తరలివెళ్లే వెసులుబాటునిచ్చారు. కానీ అక్కడ డేటా భద్రంగా ఉంటుందనే గ్యారంటీ ఈ చట్టం కల్పించదు. దేశ పౌరుల గోప్యతా హక్కుతో పాటు, దేశ సార్వభౌమత్వానికిి భంగం కలిగించే రీతిలో క్రాస్‌ బార్డర్‌ డేటా క్లాజు ఉందనే విమర్శలున్నాయి. వ్యక్తిగత డేటాను ప్రాసెస్‌ చేయడం వలన పౌరునికి వచ్చే ఆర్థిక, సామాజిక నష్టాలను ఈ చట్టం నియంత్రించదు. తప్పుడు వ్యక్తిగత డేటా ఇస్తే జరిమానా పది వేల రూపాయలు. ఈ చట్టంలో పలు చోట్ల పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌, డీమ్డ్‌ కన్సెంట్‌ అనే పదాలున్నాయి. వాటికి నిర్థిష్టమైన డెఫినేషన్‌ ఇవ్వలేదు. ఈ నెపంతో డేటాను దుర్వినియోగం చేసే ప్రమాదం పొంచిఉంది. వివాధాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసే డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ స్వతంత్రంగా ఉండాలని కమిషన్‌ చెప్పింది. కానీ కొత్త చట్టం ప్రకారం డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సభ్యులను ప్రభుత్వమే నియమిస్తుంది. రెండేళ్లకు వీరి పదవీ కాలం ముగుస్తుంది. మళ్లీ వారినే రిక్రూట్‌ చేసే వెసులు బాటూ చట్టంలో ఉంది. పదవిలో కొనసాగాలనుకుంటే, సభ్యులు ప్రభుత్వ చెప్పుచేతుల్లో ఉండాల్సిందే.
సమాచార హక్కు చట్టం 2005ను వినియోగించుకుని, ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయో లెక్కలు, వివరాలతో సహా తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. నూతన డేటా చట్టం, ఆర్టిఐ చట్టంలోని సెక్షన్‌ 8(1)(జె)ను సవరిస్తోంది. డిపిడిపి-23 పేజీ నంబర్‌ 30(పాయింట్‌ (30(2))లో ఆర్టీఐ చట్టం ద్వారా ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోలేమని పొందుపరిచారు. ప్రజాస్వామ్యానికి ఊపిరులూదుతున్న ఆర్టీఐ చట్టానికి ఉరివేసే చర్య ఇది. ఉదాహరణకు బ్యాంకులు కార్పొరేట్లకు వేలకోట్ల రూపాయల లోన్లు ఇస్తున్నాయి. లోన్‌ తిరిగి చెల్లించకుండా విదేశాలకూ పారిపోతున్నారు. మొండి బాకీల పేరుతో ఆ లోన్లను ప్రభుత్వాలు మాఫీ చేస్తున్నాయి. జనం డబ్బులు తీసుకొని ఎవరు ఎగ్గొడుతున్నారో తెలుసుకునే హక్కు ప్రజలకుండాలి కదా! వ్యక్తిగత డేటా ప్రొటెక్షన్‌ పేరుతో ఇది నిరాకరించబడుతుంది. ఇలాంటి అనేక అంశాల్లో సమాచారం పొందే అవకాశాన్ని జనం కోల్పోతారు. సమాచారం తెలుసుకోవడం పౌరుల హక్కు, పారదర్శకత ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. ఈ రెండూ విస్మరించబడుతున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక అకౌంట్లను, పోస్టులను తొలగించాలని కేంద్రం ట్విట్టర్‌ సంస్థపై ఒత్తిడి తెచ్చిన వార్తలు చూశాం. వ్యక్తుల డేటా, ప్రయివేట్‌ ఛాటింగ్స్‌ను ఇవ్వాలని ప్రభుత్వం కోరినట్లు వాట్సాప్‌ సంస్థ బట్టబయలు చేసింది. ఇకపై సోషల్‌ మీడియా సంస్థల వద్ద ఉన్న ప్రజల ఏ డేటానైనా ప్రభుత్వం తీసుకునే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తుంది. ఏఐ యుగంలో డేటా అంటే వ్యక్తిగత వివరాలతో పాటు, ప్రజల బిహేవియరల్‌ డేటా కూడా ప్రభుత్వం తీసుకునే ప్రమాదం లేకపోలేదు. అంటే ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు? ఏం సెర్చ్‌ చేస్తాడు? ఏం ఇష్టపడతాడు? ఎవరితో ఏం మాట్లాడు తున్నాడు? తమకు వ్యతిరేకంగా ఎవరెవరున్నారు? ఇలాంటి అత్యంత సెన్సిటివ్‌ డేటాను చట్ట ప్రకారమే ప్రభుత్వానికి సోషల్‌ మీడియా, టెలికాం సంస్థలు ఇవ్వాల్సి ఉంటుంది. నిరాకరిస్తామంటే కుదరదు. తమకు వ్యతిరేకంగా వాయిస్‌ వినిపిస్తున్న సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను కట్టడి చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.
ఇక నుండి దేశవ్యాప్తంగా ఏ రకమైన సర్వే చేయాలన్నా ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ప్రజాసంఘాలు, ఎన్జీవోలు, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్స్‌, సర్వే సంస్థలు, మీడియా, ప్రజల జీవన ప్రమాణాలు తెలుసుకోవడానికి సర్వేలు చేస్తాయి. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? ఎంతమందికి అందట్లేదు? నిరుద్యోగిత, పేదరికం ఎలా ఉన్నాయి? ఇలాంటి అనేక సర్వేలు చేస్తుంటాయి. డిపిడిపి చట్టం ప్రకారం ఇలాంటి సర్వేలు చేసేవాళ్లు కూడా డేటా ఫిడుషరీస్‌ (డేటా సేకరించే వారు) కిందకి వస్తారు. ముందుగా డేటా ప్రిన్సిపల్‌ (పౌరుడి) నుండి రాతపూర్వక సమ్మతి తీసుకోవాలి. ఆ డేటాను ఏం చేస్తారో నిర్ధిష్టంగా వివరించాలి. విస్తృతస్థాయిలో, ఎక్కువ మందిలోకి వెళ్లి సర్వే నిర్వహించేవారిని సిగ్నిఫికెంట్‌ డేటా ఫిడుషరీ అంటారు. వీరిని కేంద్ర ప్రభుత్వం డిఫైన్‌ చేస్తుందని ఈ చట్టం చెప్తుంది. మల్టీనేషనల్‌ కంపెనీలు, ప్రభుత్వానికి ఫండ్స్‌ ఇచ్చేవారిని అనుమతించి, తమతో రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నవారికి సర్వేలను నిరాకరించే ప్రమాదం ఉంది. డేటా వివాదాల్లో పెనాల్టీ రూ.500 కోట్ల వరకు ఉంది. ప్రత్యర్థులను భయపెట్టడానికి, నియంత్రించడానికి ఇది చాలదా!
గోప్యత పౌరుల ప్రాథమిక హక్కు అనే గొప్ప లక్ష్యాన్ని ముందు పెట్టి, దేశ పౌరుల డేటా మొత్తం కంట్రోల్లోకి తీసుకునే ప్రమాదకర విస్తృతి ఈ చట్టానికి ఉంది. సుప్రీంకోర్టు తీర్పును ఏ మాత్రం ప్రతిబింబించని చట్టమిది. ఇలాంటి చట్టం ప్రజలకు, ప్రజా స్వామ్యానికి, దేశ సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టులాంటిది.
2023లో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నపుడు, అనేక మంది ఎంపీలపై వేటువేసి, పార్లమెంటు బయటకు పంపి మూజువాణి ఓటుతో, దొంగదారిలో తీసుకొచ్చిన చట్టమిది. ప్రభుత్వం చేసే ఇలాంటి దేశ వ్యతిరేక నిర్ణయాల్ని ఎదుర్కునేందుకే 2024లో బలమైన ప్రతిపక్షాన్ని ఎన్నుకున్నారు జనం. అటు పార్లమెంటులోనూ, ఇటూ ప్రజాక్షేత్రంలోనూ ఫైట్‌ చేస్తూ, డిపిడిపి- 2023 ప్రమాదాన్ని దేశ ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. విశాల జన భాగస్వామ్యంతోనే ఇలాంటి ప్రజా వ్యతిరేక చట్టాల్ని తిప్పికొట్టి, భారత రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.
శ్రీ సుందర్‌
8498084005