తెలంగాణ పోరాటాలపై వచ్చిన నవలాత్రయం

తెలంగాణ పోరాటాలపై వచ్చిన నవలాత్రయంఇది ప్రముఖ నవలాకారుడు ప్రాణ్‌ రావు రాసిన ట్రయాలజి. ఒకే వస్తువు మీద కొనసాగే ఈ నవలల్లో, అవే పాత్రలు లేక రూపాంతరం చెందిన పాత్రలు విభిన్న కాలాల మధ్య తిరుగాడటమే ఈ ట్రయాలజిలో కనిపిస్తుంది. ముందుగా ఎవరూ అనుకొని ట్రయాలజిగా( నవలాత్రయం) రాయరు. మొదటి నవల అసంపూర్ణంగా మిగిలిపోయిందనో లేదా దాన్ని తరువాతి సంఘటనలతో కొనసాగించవచ్చనో తలచిన రచయిత సీక్వెల్‌ గా రాయడం ప్రారంభిస్తాడు. రెండవసారి రాస్తే సీక్వెల్‌ అవుతుంది. దానికి కొనసాగింపుగా రాస్తే ట్రయాలజి అవుతుంది. అలాగని ఒకే పేరుతో రెండు మూడు భాగాలుగా రాస్తే – అది సీక్వెల్‌, ట్రయాలజి అనుకుంటే పొరపాటు. ఉదాహరణకు ఉప్పల లక్ష్మణరావు గారి ‘అతడు- ఆమె’, రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’, రావిశాస్త్రి ‘రత్తాలు – రాంబాబు’ లాంటివన్నీ ట్రయాలజిలు, సీక్వెల్లు కావు. అవి సీరియల్‌ నవలలని గుర్తించాలి.
తెలుగులో మొదటిసారిగా మహీధర రామమోహనరావు ‘కొల్లాయి గట్టితే నేమి’, ‘దేశం కోసం’, ‘జ్వాలా తోరణం’ పేరిట ట్రయాలజి రాశారు. తర్వాత దాశరథి రంగాచార్య ‘చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, జనపదం’ అనే నవలలను ట్రయాలజిగా వెలువరించారు. నవీన్‌ ‘అంపశయ్య, ముళ్ళ పొదలు, అంతస్రవంతి’ అనే నవలలను తీసుకువచ్చారు. ఇవన్నీ ఒక నవల తర్వాత ఇంకొక నవల రావడానికి చాలా గ్యాప్‌ తీసుకోవడంతో – ఎవరూ వాటిని సీక్వెల్‌ గానో, ట్రయాలజి గానో గుర్తించలేకపోయారు. ఎందుకంటే దీనిలో కంటిన్యూటీ ఉండకపోవడం వల్ల ఏ నవలకు ఆ నవల విడిగా చదువుకోవచ్చు. అన్ని నవలలు చదివితే తప్ప వాటిని ట్రయాలజీగా గుర్తించలేరు. రచయితలే ట్రయాలజి అని స్వయంగా చెప్పుకోవాలి. లేదా విమర్శకులు వాటిని ట్రయాలజిగా విశ్లేషించినప్పుడే పాఠకులు తెలుసుకోగలుగుతారు. తర్వాత కాలంలో ట్రయాలజి రాస్తున్నానని ప్రకటించిన నవీన్‌ గారు ‘కాల రేఖలు, చెదిరిన స్వప్నాలు, బాంధవ్యాలు’ పేరిట ట్రయాలజి రాశారు. అలాగే ప్రాణ్‌రావు గారు ‘మలగని బత్తి’కి సీక్వెల్‌గా ‘నేల జారని ఊడలు’, దానికి ట్రయాలజిగా ‘పంచువాటు’ అని ప్రకటించడం, వాటిని ఒక పుస్తకంగా తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో విశేషమేమిటంటే ఇంతకుముందు వచ్చిన ట్రయాలజి నవలలు అన్నీ విడివిడిగా వచ్చినవే. అలాకాకుండా మూడు నవలలను కలిపి ఒకే పుస్తకంగా తీసుకురావడం తెలుగు సాహిత్యంలో ఇదే మొదటిసారి. ముఖ్యంగా ఇలాంటి నవలలు ఉద్యమ నేపథ్యంలో వస్తాయి. మహీధర జాతీయోద్యమాన్ని తీసుకోగా, మిగతా వారంతా తెలంగాణ పోరాటాన్ని చిత్రీకరించగలిగారు.
ప్రముఖ చారిత్రిక నవలాకారుడు ప్రాణ్‌ రావు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై 2011లో ‘మలగని బత్తి’ నవలను వెలువరించారు దానికి సీక్వెల్‌ గా 2013లో ‘నేల జారని ఊడలు’ నవల రాశారు. మళ్లీ దానికి కొనసాగింపుగా 2020లో ‘పంచువాటు’ నవలను రాశారు. తెలంగాణ సాయుధ పోరాటాల చరిత్రను వివరించే ఈ మూడు నవలల్లో మొదటిదైన ‘మలగనిబత్తి’ 1908-1946 కాలాన్ని చిత్రీకరించిందని రచయిత స్వయంగా చెప్పుకున్నారు.
‘మలగని బత్తి’ (2011) : నిజాం నిరంకుశ పాలనలో గ్రామాల్లో జమీందారీ, జాగిర్దారి భూస్వామ్య వ్యవస్థలో వెట్టి చాకిరికి లోబడి ప్రజలు అజ్ఞానంతో, అసహాయతలో అణగారి పోతున్న రోజులవి. దారుణమైన వెట్టిచాకిరి. అంతకన్నా దారుణమైన శేరీదార్లు, అధికారుల జులుం, నిత్యం తన్నులు- తిట్లతో వాళ్ల జీవితం గడిచిపోతుంది. తిమ్మాపురం అనే ఊరిలో దొర ప్రజలందరినీ తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. వాళ్ళ అవసరాలకు అప్పులిచ్చి వడ్డీలకు వడ్డీలు పెంచి, వాళ్లను అప్పుల ఊబిలో ముంచి, తన వెట్టి చాకిరికి ఉంచుకుంటాడు. దొరల అనుమతి లేనిదే పిల్లలు బడికి పోకూడదు. వాళ్ళు వెట్టికే రావాలి. ఊర్లో కాస్త కంటికింపుగా కనిపించిన ఆడది దొర కామ దాహానికి బలి కావాల్సిందే. ఇదంతా తమ ఖర్మ అని సర్దుకుపోయే జనాలు. ఇలాంటి నేపథ్యంలో- మలగనిబత్తి’ నవలలో, శీనయ్యను వెట్టివానిగా చేసిన దొర, వాడి పెళ్ళాం చంద్రమ్మను లొంగ తీసుకుంటాడు. ఆమె దొరను బతిమిలాడి తన కొడుకు రాజన్నను బడికి పంపిస్తుంది. ఆరవ తరగతి చదివి దొర కొలువుకు చేరుకున్న రాజన్న, దొరచేసే ఆకత్యాలను సహించలేక పోతాడు. పిల్లల్ని చేరదీసి చదువు చెబుతాడు. అడవిలో కమ్యూనిస్టు నాయకుడు జానకి రామయ్యతో పరిచయమవుతుంది. క్రమంగా సంఘం ప్రచారం వలన ఊరివాళ్లు వెట్టి, వంతులను అడ్డుకుంటారు. దానికి ఆగ్రహించిన దొర అమీను, తాసిల్దారుల నాయకత్వాన పోలీసులు, రజాకార్లను ఉసిగొల్పి ఊరిలో అల్లకల్లోలం సష్టిస్తారు. అక్కడ జరిగిన ఘర్షణలో రాజన్న, అమీన్‌ ను తన్ని పారిపోతాడు. ఇక ఆ ఊర్లో ఉండలేక అడవిలో ఉన్న జానకి రామయ్య వద్దకు చేరుకొని, దళంలో చేరిపోయి సుశిక్షితుడైన కార్యకర్తగా తయారవుతాడు. అక్కడ కనిపించిన పార్వతిని ఇష్టపడి రాజన్న పెళ్లి చేసుకుంటాడు. పార్వతితో కలిసి ఊరికి వస్తుంటే దారిలో కనిపించిన రజాకార్ల ముఠాను ఎదుర్కొని పారద్రోలుతాడు. పార్వతి కూడా సహకరిస్తుంది. సంఘం అండతో ఊరిలో కొత్త చైతన్యం వస్తుంది. దొరను ప్రజా పంచాయితీకి పిలిపిస్తే, గడిలోంచి ఎదురుకాల్పులు ప్రారంభమవుతాయి. విరుచుకుపడిన ప్రజలు గడిని ధ్వంసం చేస్తారు. దొరచేతిలో రాజన్న, రాజన్న చేతిలో దొర చచ్చిపోతారు. తెలంగాణ సాయుధ పోరాటంలోని ఆసక్తికర ఘట్టాలను తీసుకొని ఆకర్షణీయకంగా మలచిన నవల ఇది.
‘నేల జారని ఊడలు’ (2013) : ‘మలగనిబత్తి’ నవలకు సీక్వెల్‌ గా వచ్చిన ఈ నవల 1952లో మొదలై 1975 దాకా సాగుతుంది. ఈ నవలలో రూపం మారినా సారం మారని దొరతనం, నల్లదొరల పాలనలో ప్రజల దుస్థితి, కొనసాగిన దోపిడీ – పీడనలు, తిరిగి ప్రారంభమైన ప్రజా ప్రతిఘటన సాయుధ పోరాట రూపం ధరించిన తీరు, తెలంగాణలో అదనంగా ప్రాంతీయ దోపిడిని చిత్రీకరించారు.
ఈ నవలలో పోరాటంలో చనిపోయిన రాజన్న కొడుకు దుర్గయ్యకు తల్లి కూడా చనిపోగా, నాయనమ్మ చంద్రమ్మ పెంచుతుంది. కూలి పని చేసే చంద్రమ్మ తీవ్ర అనారోగ్యానికి గురికాగా, దుర్గయ్యను చదువు మానిపించి, షావుకారు పిచ్చయ్య దుకాణంలోకి పనికి పెడతారు. చెయ్యని దొంగతనానికి శిక్ష అనుభవించాలని తిమ్మాపురం గ్రామంలోని పెత్తందారులు ఏకమై దుర్గయ్యను నిలదీస్తారు. మధ్యయుగాలనాటి న్యాయాన్ని అమలు జరపబోతే దుర్గయ్య తిరగబడి పట్నం పారిపోతాడు.
పట్నంలో దుర్గయ్య ఒక హోటల్‌లో క్లీనర్‌గా చేరి హెడ్‌ కుక్‌ వెంకటేశ్వర్లు ద్వారా వంటలు చేయడం, ఇంగ్లీషు నేర్చుకుంటాడు. క్రమంగా వంట మనిషిగా ఎదుగుతాడు. అక్కడ పురుషోత్తంతో కుదిరిన స్నేహం బంధుత్వంగా మారుతుంది. అతని చెల్లెలు ప్రమీలను పెళ్లి చేసుకొని ఒక కూతురిని కంటాడు. 1969లో ఉధతంగా చెలరేగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొంటాడు. అరెస్టు అయి జైలుకు పోగా, దుర్గాప్రసాద్‌ అనే మార్క్సిస్టు మేధావితో పరిచయం కలుగుతుంది. దుర్గాప్రసాద్‌ ప్రోద్బలంతో నక్సలైట్‌ ఉద్యమంలో చేరి, భార్యా పిల్లలను వదిలేసి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతాడు. ఎదురుకాల్పులు ఎదుర్కొంటూ, ఏమైపోయాడో తెలియదని చెబుతూ నవల ముగుస్తుంది. తన తండ్రి రాజన్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎలా పాల్గొన్నాడో, దుర్గయ్య ఆనాటి నక్సలైట్‌ పోరాటంలో అలాగే పాల్గొంటాడు. ఇద్దరూ వీరమరణం పొందారని మనం గుర్తించగలుగుతాం.
‘పంచువాటు’ (2020) : 1975 నుండి 2018 వరకు సాగిన తెలంగాణ చరిత్రకు దర్పణంగా ‘పంచువాటు’ నవల నిలుస్తుంది. ఈ నవల 1975లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితితో ప్రారంభ మవుతుంది.
నక్సలైట్‌ దుర్గయ్య పట్టుబడనందున ఆ కుటుంబం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎమర్జెన్సీలో పెరిగిన నిర్బంధాలను తట్టుకోలేక దుర్గయ్య భార్య ప్రమీల పట్నం వదిలి తిమ్మాపురం వెళుతుంది. అక్కడ దుర్గయ్య మిత్రుడు నర్సింలు సహాయంతో తమకుండే రెండెకరాలను స్వాధీనం చేసుకుని, వ్యవసాయం చేసుకుంటూ మనుగడ కొనసాగిస్తుంది. పట్నంలో తనకు అండగా నిలిచిన అనాధ బాలుడు రవిని చేరదీసి పెంచి, తన కూతురు గాయత్రిని ఇచ్చి పెళ్లి చేస్తుంది. అక్కడ పోలీస్‌ పటేల్‌ ఆగడాలను భరించలేక ప్రమీల కూతురు గాయత్రి, రవితో పాటు తిరిగి పట్నం వచ్చేస్తుంది.
పట్నంలో రవి, గాయత్రి కూలి పనులు చేస్తూ కొడుకులను చదివిస్తారు. ఇంతలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రతరమవుతుంది. రవి పెద్ద కొడుకు రాజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, ఆత్మాహుతి చేసుకొని మరణిస్తాడు. అక్కడ ఉండలేక తిమ్మాపురం వస్తే, అక్కడ ఉన్న వారి రెండు ఎకరాల భూమి కబ్జాకి గురవుతుంది. అక్కడ శంకరయ్య అనే మధ్యవర్తి రంగంలోకి దిగి, రెండు లక్షలు వాళ్లకు ఇప్పించి కేసు సెటిల్‌ చేస్తాడు. ఆ డబ్బుతో రవి కూతురు గాయత్రిని రెండో పెళ్లి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. రెండో కొడుకు కిరణ్‌కి తెలిసిన వాళ్ళ ద్వారా ముంబైలో ఉద్యోగం దొరుకుతుంది. కూతురు అత్తారింటికి వెళుతుంది. వద్ధులైన గాయత్రి, రవి ఒంటరిగా మిగిలిపోతారు. ముంబైలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్లి అక్కడ ఇమడలేక వాళ్ళు హైదరాబాద్‌ తిరిగి వచ్చేస్తారు. వచ్చేసరికి వారు ఉంటున్న గుడిసె వానలకు, పొంగిన చెరువులో మునిగిపోతుంది. అక్కడ సొంత ఇల్లు ఉన్న వారికే తప్ప, అక్రమంగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి ప్రభుత్వ సహాయం అందదని ప్రకటించడంతో వారు నీరుగారిపోతారు. అన్ని పోగొట్టుకొని నిరాశ్రయులై, నిస్సహాయంగా నిలబడిన రవి, గాయత్రీలు- ఈ వద్ధాప్యంలో తమ భవిష్యత్తు ఏమిటా అని తలుచుకొని కుమిలిపోవడాన్ని చూపిస్తూ నవల ముగుస్తుంది. మూడు నవలల్లోనూ నాయకులు తమ ప్రాణాలు బలి ఇస్తారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రాజన్న దొరను చంపివేస్తాడు. అక్కడ ఉండలేని దొర కొడుకులు హైదరాబాద్‌ చేరుకుని సినిమా హాళ్లు నిర్వహిస్తూ ఇతర వ్యాపారాలు చేసుకుంటుంటారు. ఊళ్లో ఉన్న భూములను, ఆస్తులను తమ తొత్తుల అండతో కాపాడుకుంటారు. ఊరిమీద తమ పట్టును అలాగే కొనసాగిస్తుంటారు. మెల్లగా రాజకీయాలలోకి ప్రవేశించడానికి ప్రణాళికలు తయారు చేసుకుంటారు. వాళ్లు నాయకులుగా ఎదగక తప్పదు. కొత్త రూపాలలో వారి దోపిడీ మరింత విస్తతం కాక తప్పదని సూచిస్తూ నవల ముగుస్తుంది.
దాదాపు వందేళ్ళ తెలంగాణ చరిత్రను చిత్రీకరించిన ఈ మూడు నవలలు – ఆనాటి తెలంగాణ ఆర్థిక, సామాజిక, రాజకీయ చరిత్రను మరోమారు మన కళ్ళముందు ఉంచాయి. రాచరిక భూస్వామ్య యుగం నుండి ప్రజాస్వామ్యంలోకి ప్రవేశించిన క్రమంలోని స్థితిగతులు, మారుతున్న ప్రజా జీవితాన్ని ఈ నవలలు చక్కగా పట్టుకోగలిగాయి.
ఈ నవలలు మంచి నేటివిటితో కూడుకొని తెలంగాణ భాష, పలుకుబడులు, నుడికారాలతో ఆద్యంతం ఆసక్తిగా చదివింపజేస్తాయి. నలభైఏళ్ల కాలాన్ని (1975 – 2018) తీసుకున్న మూడవ భాగంలో ఆనాటి ఆర్థిక, సామాజిక పరిస్థితులను మరింత వివరంగా రాస్తే బాగుండేది. అలాగే ప్రపంచీకరణ వల్ల చోటు చేసుకున్న అనూహ్యమైన మార్పులను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. బహుశా గ్రంథ విస్తరణ భీతి వల్ల రచయిత ఉద్దేశపూర్వకంగా వాటన్నింటిని దాటవేసి ఉంటాడని భావించాల్సి వస్తుంది. మొత్తానికి బిగువైన సన్నివేశాలతో, పదునైన సంభాషణలతో ఈ నవలలు ఉత్కంఠతను పోషిస్తూ, పాఠకుడ్ని ఆకట్టుకుంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు.